-ప్యాకేజీ-1 పనులనుఅడ్డుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
-మహబూబ్‌నగర్‌కు మేలు చేసే పనులపై రాయలసీమ నేతల దౌర్జన్యం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మహబూబ్‌నగర్, కర్నూల్ జిల్లాల మధ్యలో ఉన్న రాజోలి డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)పై వివాదం మరోసారి రాజుకుంది. తెలంగాణకు మేలు చేసే ఆర్డీఎస్ ఆధునీకీరణ పనులను ఆదివారం కర్నూలు జిల్లాలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులతో వచ్చి అడ్డుకున్నారు. కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి పనులను నిలిపివేయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఎస్‌పై వలసపాలకులు వివక్ష ప్రదర్శించడంతో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు మొదటి నుంచి అన్యాయం జరుగుతోంది. కర్నూలు జిల్లా నేతలు ఆర్డీఎస్ తూములను పగులగొట్టి బలవంతంగా రాయలసీమకు అనేక ఏళ్లుగా నీళ్లు తరలించుకుపోతున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, 30 వేల ఎకరాలకు మించడం లేదు.
ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ ఈ సమస్యను ఎత్తిచూపడంతో తప్పని పరిస్థితుల్లో,ఆర్డీఎస్ వివాదానికి పరిష్కారంగా హెడ్‌వర్క్స్‌లోని ప్యాకేజీ -1, 2 పనులను ఉమ్మడిరాష్ట్రంలో చేపట్టారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో ఆధునికీకరణ పనులకు రూ.92 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కర్ణాటక పరిధిలో పనులు చేపట్టేందుకు రూ.72కోట్లు, తెలంగాణ పరిధిలో పనులకు రూ.20 కోట్లను కేటాయించారు. ఆ పనులు ఆరేళ్లుగా కొనసాగుతున్నాయి. 1, 2 ప్యాకేజీల్లో పనులు 15 రోజులుగా ముమ్మరంగా పూర్తిచేస్తున్నారు. 1వ ప్యాకేజీ పనుల్లో భాగంగా ఆనకట్టను పటిష్ఠపరిచే పనులు చేపట్టారు. గతంలో 60 మీటర్ల మేర పనులు పూర్తవగా మిగిలిన 40మీటర్ల ఆనకట్టకు స్టీల్ అమర్చేపనులు ప్రస్తుతం చేపట్టారు.
విషయం తెలుసుకున్న మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన అనుచరులతో ఆదివారం కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు చేరుకుని కర్ణాటక అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్యాకేజీ-1 పనులను నిలిపివేయించారు. కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ రామయ్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కర్ణాటక సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో ఆనకట్ట దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆగస్టు నెలాఖరుకు పనులు పూర్తిచేయాలన్న లక్ష్యంతో కాంట్రాక్టర్ ఉండగా, పనులు నిలిపివేయడంతో ఈ ఏడాది కూడా సాగునీరు అంతంతమాత్రమే అందే అవకాశాలు ఉన్నాయని పాలమూరుల రైతులు ఆందోళనకు గురువుతున్నారు.
చంద్రబాబు హయాం నుంచే దౌర్జన్యాలు
తెలంగాణ రాష్ట్రం వచ్చినా సీమ నేతలు ఫ్యాక్షన్ సంస్కృతి వీడలేదని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి మాట్లాడుతూ 2003-04లో చంద్రబాబు ప్రభుత్వం 194 జీవో విడుదల చేస్తూ ఆనకట్టను పటిష్టపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ, అదే ప్రభుత్వంలోని సీమనేతలు దౌర్జన్యంగా ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ షట్టర్లను ధ్వంసం చేశారని గుర్తుచేశారు. సీమ నాయకుల దౌర్జన్యాలతో ఆనకట్ట పూర్తిగా దెబ్బతిని పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. నైజాంకాలంలోనే ఆర్డీఎస్ ఆనకట్టను 1095 అడుగులకు పెంచుకునేలా ఉత్తర్వులున్నా సీమాంధ్రపాలనలో ఆర్డీఎస్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని వాపోయారు. ప్యాకేజీ-1 పనులను అడ్డుకున్న విషయాన్ని ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పనులను సాఫీగా జరిగేలా చూడాలని కోరారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి