బ్లాగు వీక్షకులకు, తెలంగాణ ప్రజలకు
తెలంగాణ కవి దాశరథి జన్మదిన శుభాకాంక్షలు!
"నా తెలగాణ కోటి రతనమ్ముల వీణ"యటంచుఁ బల్కి, తా
నేతగనుండి, పోరి, చెఱనిల్చి, "నిజాము పిశాచమా మహా
భూతమ"యంచుఁ బిల్చి, మన పూర్వపుఁ దెల్గుల విల్వఁ బెంచు ధీ
దాతయు, శక్తియుక్తుఁడగు దాశరథే మన మార్గదర్శియౌ!
-గుండు మధుసూదన్
-నేడు దాశరథి 89వ జయంతి
-దాశరథి సేవలను కొనియాడిన సీఎం కేసీఆర్
పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్య అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. మంగళవారం దాశరథి 89వ జయంతి సందర్భంగా ఆయన సాహితీ సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను, కష్టాలను అగ్నిధార పేరుతో పద్యాల రూపంలో రాసి, వినిపించి ప్రజల్లో చైతన్యం కలిగించిన గొప్ప మనిషి దాశరథి అని ఆయన సోమవారం ఓ ప్రకటనలో కీర్తించారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి తెలంగాణ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహనీయుడని పేర్కొన్నారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో పాండిత్యం గల దాశరథి కథలు, నాటికలు, సినిమా పాటలు రాయడమే కాకుండా, రేడియో ప్రయోక్తగా కూడా విభిన్న రూపాల్లో తన సాహితీ సేవలను అందించారని కొనియాడారు. దాశరథి లాంటి వారి కృషి ఫలితంగానే తెలంగాణ సమాజం నిత్య చైతన్య స్రవంతిలో ప్రయాణం చేసిందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి మహనీయులను కేవలం స్మరించుకోవడమే కాకుండా తరతరాల పాటు వారి నుంచి స్ఫూర్తి పొందేవిధంగా కార్యక్రమాలు రూపొందించుకుంటామని ప్రకటించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి