- నేడు నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్ జయంతి
- ఇంజినీర్స్ డేగా గుర్తింపునిచ్చిన తెలంగాణ సర్కార్
తెలంగాణ సాగునీటిరంగ వైతాళికుడు, జలరంగ నిపుణుడు నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్‌కు ఎట్టకేలకు మంచి గుర్తింపు లభించింది. తెలంగాణలో సాగునీటిరంగానికి ఆద్యుడిగా నిలిచిన నాటి ఇంజినీర్ అలీ నవాజ్‌జంగ్ జయంతిని ఇంజినీర్స్ డే గా గుర్తిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నవాబ్‌అలీ జయంతి సందర్భంగా తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జలసౌధలో ప్రత్యేక కార్యక్రమం జరుగనుంది.
ఈ సందర్భంగా భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నవాబ్‌అలీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సర్‌ఆర్థర్ కాటన్ ఎలాంటి వారో తెలంగాణకు నవాబ్‌అలీజంగ్ అలాంటి వారని అంటారు. కానీ కాటన్ కంటే నవాబ్ అలీ ఎక్కువ సేవలు చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చరిత్రను గుర్తించకపోవడాన్ని మొదటి నుంచి తెలంగాణ ఇంజినీర్లు తప్పుపడుతున్నారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణలో కేసీఆర్ సర్కార్ రావడంతో నవాబ్‌అలీ జయంతిని ఇంజినీర్స్ డేగా ప్రకటించాలన్న వారి డిమాండ్ నెరవేరింది.
తెలంగాణ జల ప్రదాత
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి నిజాంసాగర్ వరకు నవాబ్‌అలీ ముద్ర కనిపిస్తుంది. 1877లో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అలీ.. ఇంజినీర్‌గా హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో విశేష సేవలందించారు. ఇంగ్లాండ్‌లోని కూపర్ హిల్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 1905నుంచి 1948వరకు తెలంగాణలో సాగునీటిరంగానికి విశేష సేవలందించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, నిజాంసాగర్, వైరా, పాలేరు, నిజామాబాద్ పోచారం, డిండి ప్రాజెక్ట్, కరీంనగర్ అప్పర్‌మానేరు, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లకు, ఉస్మానియా దవాఖానా.. ఇలా ఎన్నింటికో రూపకల్పన చేసిన ఆయన సేవలను దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గుర్తించి, జాతీయ ప్రణాళిక కమిషన్ సబ్‌కమిటీ సభ్యులుగా నియమించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఇంజినీర్‌ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంపై ఇంజినీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
కేసీఆర్ శుభాకాంక్షలు
ఇంజినీర్స్‌డే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను బంగారు బాటలో నడిపించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్‌జంగ్ జయంతిని ఇంజినీర్స్ డేగా జరుపుకోవడం మన సంప్రదాయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అలీ వంటి ఇంజినీర్లు ఆనాడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఇంజినీర్లు బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి