గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 08, 2014

అంతసీను లేదు! సెక్షన్ 8 చెప్పిందేమిటి?

-గవర్నర్‌కు ఉన్నది బాధ్యతలే.. అధికారాలు కావు..
-వాటిని అవసరమైతేనే వినియోగించాలి
-తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించడం తప్పనిసరి
-గవర్నర్‌కు ఇచ్చింది బాధ్యతలే...
-అసలు బిల్లులో కనపడని ఉమ్మడి పోలీస్ బోర్డు
-చంద్రబాబు లేఖకు వంత పాడుతున్న కేంద్ర ప్రభుత్వం
-గవర్నర్ పాలనపై సీమాంధ్రుల పగటి కలలు
KTRపచ్చమూకల ప్రచార పటాటోపంలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రుల అక్రమ ఆస్తుల రక్షణే ధ్యేయంగా వారు ముందుకు తెచ్చిన విభజన చట్టంలోని సెక్షన్- 8 పస ఏమిటో తేలిపోయింది. ఉమ్మడి రాజధానిలో పోలీసుశాఖను పూర్తిగా గవర్నర్‌కు అప్పగించాలని విభజన చట్టంలో ఉందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాదన పచ్చి అబద్ధమని తేలిపోయింది.

పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండబోతున్న హైదరాబాద్‌లో సర్వం గవర్నర్ చేతిలో ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. పునర్వవ్యవస్థీకరణ బిల్లులోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని శాంతి భద్రతలు, పోలీస్ వ్యవస్థ మొత్తం గవర్నర్ చేతిలో ఉండాలంటూ చంద్రబాబు చేసిన వాదన అంతా కుట్రపూరితమేనని రుజువైంది. ఎందుకంటే సెక్షన్ 8లో ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థను గానీ, శాంతి భద్రతలను గానీ ఏకపక్షంగా గవర్నర్‌కు అప్పగించాలని లేదు. అయినా సీమాంధ్ర పెట్టుబడిదారులు, మీడియా మాత్రం సెక్షన్ -8 కింద గవర్నర్ సర్వాధికారి అంటూ విషప్రచారం చేస్తున్నారు. అత్యున్నతమైన పార్లమెంట్ రూపొందించిన చట్టాన్నే అపహాస్యం చేస్తున్నారు.

section
బాధ్యతలకు అధికారాలకు తేడా తెలియదా?..
ఈ సెక్షన్ చెప్పిందల్లా గవర్నర్‌కు కొన్ని బాధ్యతలున్నాయనే... అధికారాలున్నాయని కాదు. "రెస్పాన్సిబిలిటీ" అనే పదానికి అర్థం "బాధ్యత" అని మాత్రమే. అది అధికారం కాదు. బాధ్యత అంటే ఆ విధులన్నీ తన చేతిలోకి తీసుకోమని కాని, తెలంగాణ ప్రభుత్వ అధికారాలకు కొర్రీ పెట్టాలని కాదు. ఇదే సెక్షన్‌లోని 3వ నిబంధన కింద తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించాలన్న నిబంధన ఉంది.

అది చెబుతున్నదేమిటి? గవర్నర్ సూపర్‌పవర్ కాదనే. అన్నింటినీ తెలంగాణ మంత్రి మండలితో సంప్రదించి తీరాలనే. అదే సమయంలో ఏపీ మంత్రిమండలిని సంప్రదించాలన్న నిబంధనలేక పోవడం ఎవరి స్థాయి ఏమిటో స్పష్టంగానే వివరించింది. సహజంగానే ఇరు రాష్ర్టాల ప్రజలు నివసిస్తారు కాబట్టి వారి రక్షణ విషయంలో అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో అవసరమైన పక్షంలో వినియోగించే నిమిత్తం వీటి పొందు పరిచారే తప్ప ఈ సెక్షన్ స్ఫూర్థి గవర్నర్ పాలన సాగించాలని కాదు. అదే ఉద్దేశమై ఉంటే బిల్లులో పదేళ్లపాటు గవర్నర్ పాలన ఉంటుందని నేరుగానే పేర్కొనేవారు. రేపు ఏదైనా శాంతి భద్రతలకు భంగం వాటిల్లిన పక్షంలో సీమాంధ్ర ప్రజలకు రక్షణ ఇచ్చే ఉద్దేశంతోనే ఈ సెక్షన్ చేర్చారు.

ఉమ్మడి పోలీస్ బోర్డు ఎక్కడినుంచి వచ్చింది?...

వాస్తవం ఇదికాగా చంద్రబాబు చేస్తున్న కుటిల ప్రయత్నాలకు కేంద్ర హోంశాఖ కూడా వంత పాడుతోంది. అసలు బిల్లులోని సెక్షన్-8లో కనిపించని ఉమ్మడి పోలీస్ బోర్డు వ్యవహారాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. విభజన బిల్లులో ఈ పోలీస్ బోర్డుకు సంబంధించిన అంశమే లేదు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిని ప్రభుత్వ కార్యకలాపాల నిమిత్తం, రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ఉపయోగించుకునేలా ఏర్పాటుచేశారు.

అంతే కానీ ఉమ్మడి రాజధానిలోని పోలీస్ వ్యవస్థ మొత్తం గవర్నర్ కింద పనిచేయాలని, వివిధ పోలీసు అధికారులు ఆయనకే రిపోర్ట్ చేయాలని లేదు. ఇక హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రంగారెడ్డి జిల్లా ఎస్పీ పరిధిలోని అధికారుల బదిలీలు, నియామకాలు, పదోన్నతులు కల్పించే అధికారం గవర్నర్‌కు ఇవ్వాలనేది ఎక్కడినుంచి వచ్చిందో హోంశాఖకే తెలియాలి. ఎందుకంటే హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లా. విభజన చట్టంలో హైదరాబాద్ జిల్లాను తెలంగాణ రాష్ట్రం కింద చేర్చారు. కాబట్టి దీనిపై ఎలాంటి అధికారాలు గవర్నర్‌కు కేటాయిస్తున్నట్టు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో పేర్కొనలేదు. పైగా అదే చట్టంలో విభజన తర్వాత అప్పటిదాకా ఉమ్మడి రాష్ర్టానికి ఉన్న అధికారాలు విభజన తర్వాత ఆయా ప్రాంతాలకు పరిమితమైన రూపంలో ఆ అధికారాలు యథాతథంగా కొనసాగుతాయనే అంశం చట్టంలోని 11వ నిబంధన కింద ఉంది. అంటే హైదరాబాద్ మీద తెలంగాణ ప్రభుత్వ అధికారం తిరుగులేనిది.

చంద్రబాబు లేఖ రాశారు.. హోంశాఖ సిపార్సు చేసింది...

తెలంగాణతో ఏమాత్రం సంబంధం లేని ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖతో కేంద్ర హోంశాఖ హుటాహుటిన సిఫారసులు పంపడం మొదలుపెట్టింది. విభజన బిల్లు, ఫెడరల్‌స్పూర్తికి విరుద్ధంగా హైదరాబాద్‌లో ఉమ్మడి పోలీస్ బోర్డు ఏర్పాటుచేయాలని చంద్రబాబు కోరితే దానికి వంత పాడుతూ పోలీస్ బోర్డు ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సర్క్యులర్ పంపింది. దానిలో జనాభాకు అనుగుణంగా ఇరు రాష్ర్టాల అధికారులుంటారని కూడా పేర్కొంది. తన అధికారాలపై క్లారిటీ ఇవ్వాలని అడిగిన గవర్నర్‌కు ఆ మేరకు స్పష్టత ఇచ్చేబదులు విషయాన్ని మరింత గందరగోళంలోకి నెట్టివేసింది.

ఆక్రమణ కూలిస్తే గుర్తొచ్చింది...

పార్లమెంటులో ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆవిర్భావం లాంఛనమే. మధ్యలో అనేక నెలలు గడిచాయి. జూన్ 2న ఆవిర్భావం జరిగింది. అది జరిగి దాదాపు నెల గడిచింది. ఇంతకాలం గవర్నర్ పాలన మీద, అధికారాల మీద ఎవరూ మాట్లాడలేదు. చంద్రబాబుకు అసలే గుర్తుకు రాలేదు. కానీ గురుకుల్ భూముల్లోకి తెలంగాణ సర్కారు బుల్డోజర్లు అడుగు పెట్టిన తర్వాత హఠాత్తుగా అందరికీ గవర్నర్ అధికారాలు గుర్తొచ్చాయి. అంటే సీమాంధ్రుల లక్ష్యం ఏమిటో.. వారికి వంత పాడే పచ్చ మీడియా వైఖరి ఏమిటో స్పష్టమవుతుంది. 
ఎట్టిపరిస్థితిలో అక్రమ కబ్జాలను చెర విడిపించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉక్కు సంకల్పం చూసి బెదిరిపోయినందునే సీమాంధ్రులు ఈ ప్రతిపాదన తెచ్చారన్నది స్పష్టం. ఇందులో సీమాంధ్ర సామాన్య ప్రజల ప్రయోజనాలు లేవు. అడుగు భూమి లక్షలు పలికే ప్లాట్లలో పేదలున్నారని పచ్చ మీడియా ప్రదర్శించే పైత్య ప్రకోపాల్లో నిజాయితీ లేదు. గురుకుల్, గోకుల్ ప్లాట్లలో పేదలుంటారా లేదా అనేది పచ్చ మీడియా పరిజ్ఞానానికి సంబంధించిన అంశం. ఉన్నదల్లా వందల కోట్ల వ్యాపారుల ప్రయోజనాలు. వారికి అండగా నిలిచి చంద్రబాబు తన నిజస్వరూపమేమిటో చాటుకున్నారు. కేవలం పెట్టుబడి దారుల కోసమే చంద్రబాబు ఉమ్మడి పోలీస్ బోర్డు, గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇదే క్రమంలో భూ పరిపాలన కూడా గవర్నర్ చేతికి తెచ్చి దొడ్డిదారిలో హైదరాబాద్‍ను ఏలాలనే కుట్ర తప్ప ఇందులో నిజాయితీ కనిపించదు.

ఇంతకీ సెక్షన్ 8 ఏం చెప్పింది...

- సెక్షన్ 8(1)...సెక్షన్ 8లోని మొదటి అంశం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంనాటినుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పరిపాలన సాగించే క్రమంలో..ఇక్కడ నివసించే ప్రజలకు స్వేచ్ఛ, ప్రాణ రక్షణ, ఆస్తుల భద్రతకు సంబంధించి రక్షణ కల్పించే విషయంలో గవర్నర్ ప్రత్యేక బాధ్యతను కలిగి ఉంటారు.
-సెక్షన్8(2)...ప్రత్యేకించి.. ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ వంటి అంశాలపై ఆయన తన బాధ్యతలను విస్తరించవచ్చు.
- సెక్షన్8(3)..ఈ విధుల నిర్వహణలో గవర్నర్ తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించిన తర్వాతనే, తన వ్యక్తిగత నిర్ణయం మేరకు తగు చర్యలు తీసుకోవచ్చు.
-సెక్షన్ 8 (4)..ఈ విధుల నిర్వహణకోసం కేంద్రం ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది.

కొసమెరుపు...

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాడు ఆ పార్టీ వెల్లడించిన సిద్ధాంతాల్లో అసలు గవర్నర్ల వ్యవస్థే రద్దు చేయాలన్న వాదన ఉంది. దాన్ని పచ్చ మీడియా ఆనాడు ప్రత్యేక కథానాలు వేసి మరీ ప్రచారం చేసింది. నాదెండ్ల సంక్షోభం అనంతరం ఎన్టీఆర్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక వేదికల మీద గవర్నర్ల వ్యవస్థే రద్దు చేయాలని డిమాండ్లు చేస్తూ వచ్చారు. పలువురు టీడీపీ ఎంపీలు కూడా పార్లమెంటు వేదికపై ఈ డిమాండ్లు వినిపించారు. చంద్రబాబు అధికారం చేపట్టాక కూడా అనేక సార్లు ఈ డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆ విధానం కేంద్రం గవర్నర్ల ద్వారా పరోక్షంగా పాలించడానికి వ్యతిరేకమని ఘోషించారు. కానీ ఇవాళ ఆ వ్యవస్థే చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు, పచ్చ మీడియాకు కూడా ముద్దు వస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

1 కామెంట్‌:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఈ వ్యాఖ్య ఎవరికి వర్తిస్తుందో వారికి:

తెలంగాణ ఏమైనా గవర్నర్ పాలనలో ఉందా? రాష్ట్రాన్ని పరిపాలించడానికి ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం ఉన్న తర్వాత గవర్నర్‍కు ఇంకేం అధికారాలు కావాలి? దేశంలోని ఇతర రాష్ట్రాల గవర్నర్‍లకు ఏ అధికారాలు, బాధ్యతలు ఇవ్వబడ్డాయో, ఈ గవర్నర్‍కూ ఇవ్వాలిగానీ విశేషాధికారాలెందుకు? ఆయనను అడ్డం పెట్టుకుని తెలంగాణను దోచుకు తినడానికా? కతలు చెప్పడం మాకూ వచ్చు. అరవై ఏండ్ల నుండి దోచుకు తిన్నారు...ఇంకా జలగల్లా పట్టి వదలకున్నారు మీ పీడ మాకు ఎప్పుడు విరగడవుతుందో ఏమో? ధర్మం మా పక్షాన వుంది...అధర్మపరులు మీరు. ఇప్పటివరకూ అధర్మమే జయించినా చివరికి ధర్మమే గెలిచితీరుతుంది! జై తెలంగాణ...జై జై తెలంగాణ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి