గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 09, 2014

ఉమ్మడిలోనే భూమాయ...!

-ఐటీ కంపెనీలకు అక్రమంగా స్థలాల గడువు పొడిగింపు 
-పరిశ్రమలు పెట్టకపోయినా అక్రమార్కుల కబ్జాలో వేల ఎకరాలు 
-అగ్గువ భూముల్ని అనుభవించడమెలా?
-ఆ జాబితాలో 50 ఎకరాలకు పైగా పొందిన సంస్థలు 40కిపైగానే 
-రైతుల నోట్లో మట్టి కొట్టి.. బడాబాబులకు పంచిన ఏపీఐఐసీ 
-వినియోగంలో లేని భూముల స్వాధీనానికి ఏదీ దారి..?
-సీఎం కొరడాకు అడ్డంకిగా మారిన ఉమ్మడి సర్కారు ఉత్తర్వులు
అంతన్నాడింతన్నాడే గంగరాజు.. హస్కన్నడు.. బుస్కన్నాడే...అన్నట్లుగా ప్రభుత్వానికి చేతిలో వైకుంఠాన్ని చూపిన కొన్ని మాయదారి సంస్థలు తెలంగాణలో కోట్ల విలువైన ఎకరాల భూమిని అగ్గువ ధరకు కొట్టేశాయి. భూమి వచ్చే వరకు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతాం.. వేలమందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన సదరు సంస్థలు, ఆ తర్వాత పత్తా లేకుండా పోయాయి.

open-land
ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలు గడిచినా ఆ జాగలో చిన్న ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు. మరి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది..? ఇచ్చిన భూమి లాక్కుని.. మాట తప్పినందుకు చర్యలు తీసుకోవాలి అంటారా..? అక్కడే సెజ్‌లో కాలేశారు. ఈ తతంగమంతా ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. భూమి తెలంగాణది.. ఇచ్చింది సీమాంధ్ర ఆధిపత్య సర్కారు.. ఇంకేముంది దొరికింది దోచేసుకో అన్నట్లుగా వ్యవహరించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూమిని జప్తులో ఉంచుకున్న కంపెనీలపై చర్యలు తీసుకోవడం పక్కన బెట్టి.. లీజు గడువు పెంచుతూ వారిపట్ల అవ్యాజమైన ప్రేమను కురిపించింది. 

సీమాంధ్ర అక్రమార్కులు కలలోకూడా ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, పూర్తి మెజారిటీతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం చకాచకా జరిగిపోయాయి. అధికారం చేపట్టిన నాటినుంచి అన్ని విభాగాలపై పూర్తిస్థాయి సమీక్షలు చేసిన సీఎం కే చంద్రశేఖర్‌రావు రాష్ర్టాభివద్ధికి ఇతోధికంగా దోహదం చేసే పారిశ్రామీకరణపై దృష్టి పెట్టారు. ఇందులోభాగంగానే గత ప్రభుత్వాలు అప్పనంగా దోచిపెట్టిన అక్రమ భూ కేటాయింపులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ విషయంలో రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు సైతం ఔరా! అనేట్లుగా కార్యాచరణను అమలు చేస్తున్నారు.

అక్రమ భూ కేటాయింపుల్లో రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే భూములను స్వాధీనం చేసుకుంటున్నా.. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) పేరిట ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) కట్టబెట్టిన, రాసిచ్చిన వేలాది ఎకరాలను మాత్రం స్వాధీనం చేసుకునేందుకు చట్టాలు అడ్డువస్తున్నాయి. దీనికంతటికీ ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలుస్తున్నది. భూములు తీసుకుని పనులు ప్రారంభించని సంస్థల వెనుక రాజకీయ పెద్దలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడాబాబులు ఉండడం వల్లే ఒప్పందాలను ఉల్లంఘించినా ఏపీఐఐసీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలపై త్వరలోనే విధి విధానాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి సర్కారు భారీ కుట్రకు తెర లేపింది. హైదరాబాద్ చుట్టూ తమ అస్మదీయులకు కేటాయించిన భూముల రక్షణకు కొత్త ఎత్తుగడలు అమలు చేసింది.

ప్రభుత్వ షరతులను అమలు చేయలేకపోయాం. కనికరించండంటూ అగ్గువ ధరలకు భూములు పొందిన ఐటీ కంపెనీలు మొర పెట్టుకోవడమే ఆలస్యం.. అవాజ్యమైన ప్రేమను కురిపించేశారు. గజం ధర రూ.10వేల నుంచి రూ.50వేల వరకు పలికే వేల ఎకరాలను షరతులు ఉల్లంఘించిన కంపెనీలకే హక్కు భుక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలు నామమాత్రపు ఫీజు చెల్లిస్తే చాలు.. గడువు పెంచుతామంటూ దొంగ చేతికి తాళాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడున్నదని తెలిసి..ఉమ్మడి పాలకులు అక్రమాలకు పాల్పడిన సంస్థల యాజమాన్యాలతో రాజీ కుదుర్చుకొని వెసులుబాటు కల్పించారు. ఈమేరకు నామమాత్రపు ఫీజుతో ఐదారేళ్లు గడువు పెంచుకోవచ్చునంటూ ఉమ్మడి రాష్ట్ర ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి సంజయ్‌జాజు తేదీ 20-01-2014న జీవో నంబర్ 3ను జారీ చేశారు. భూములు ఏపీఐఐసీవి అయినా.. ఈ విషయంలో ఐటీఅండ్‌సి ప్రత్యేక శ్రద్ధ చూపడం అనుమానాలకు తావిస్తున్న విషయం.

ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో కనీసం 30 శాతం కూడా వినియోగించకపోతే వెనక్కి తీసుకుంటామని ఐటీ అండ్ సీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఏ ఒక్క స్థలాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఏపీఐఐసీ సెజ్‌లు, ఐటీ/ఐటీఈఎస్ లేఅవుట్లను ఎక్కువగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లోనే ఉన్నాయి. అత్యంత ఖరీదైన స్థలాలను అగ్గువ ధరలకు పొందిన సంస్థలు ఆ భూములను వదులుకోలేక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సానుకూలంగా మలుచుకున్నట్లు సమాచారం. ఎలాంటి ఫీజులు చెల్లించకుండా వందల ఎకరాలపై యాజమాన్యపు హక్కులను అనుభవిస్తున్న సంస్థలూ లేకపోలేదు. వీటన్నింటిపై తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందో వేచి చూడాలి.

నోటీసులతో సరిపెట్టిన ఏపీఐఐసీ

రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని, స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి స్థలాలు పొందిన సంస్థలపై నిఘా ఉంచాల్సిన ఏపీఐఐసీ.. ఆ సంస్థల అడుగులకు మడుగులు ఒత్తుతున్నది. ఏమాత్రం ఒత్తిడి తేకుండా నోటీసులు జారీ చేసేసి.. చేతులు దులిపేసుకుంటున్నారు. నోటీసులకు సంస్థల యాజమాన్యాలు సమాధానాలిచ్చినా, ఇవ్వకపోయినా పట్టించుకోని అధికారులు.. గడువు పెంచడంలో మాత్రం ఆగమేఘాల మీద పనులు చేసేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1889 సంస్థలు ప్రభుత్వ స్థలాలు వినియోగించకుండా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఏపీఐఐసీ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 1500 వరకు తెలంగాణలోనే ఉండటం గమనార్హం. చాలా కాలానికి 83 సంస్థలకు కేటాయించిన 3602 ఎకరాలను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిలో 48 సంస్థలు తెలంగాణలో ఉండగా మిగతావి సీమాంధ్రకు చెందినవి.

స్వాధీనానికి ఏమీ లేదు..!

ఏపీఐఐసీ ద్వారా స్థలాలు పొంది వినియోగించని సంస్థలు ఏమీ లేవు. కొన్ని ఉన్నప్పటికీ వాటికి షరతులను అమలు చేసేందుకు గడువు ఉంది. కొన్నింటి గడువు పూర్తయినా.. ఆయా సంస్థల విజ్ఞప్తి మేరకు పొడిగించాం. ఇప్పటికిప్పుడు ఏ సంస్థ నుంచి స్థలాన్ని స్వాధీనం చేసుకోలేం. చాలావాటికి వెసులుబాటు కల్పించాం. ప్రభుత్వం కూడా అలాంటి ఆదేశాలు జారీ చేయలేదు అని ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్ అన్నారు. వినియోగించని స్థలాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేయగా టీ మీడియాతో ఆయన తీవ్రస్వరంతో పై విధంగా స్పందించారు. ఆ ఆదేశాలేవీ తమకు వర్తించదన్నట్లుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వినియోగించని సంస్థల జాబితా కూడా అందుబాటులో లేదని ఖరాఖండీగా చెప్పారు.

ఎన్నో సంస్థల చేతుల్లో ఖరీదైన స్థలాలు

-సైబరాబాద్ పార్కులో ఎమ్మార్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు కింద ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ లిమిటెడ్‌కు 2002, నవంబర్ 6న 258.36 ఎకరాలు కేటాయించారు. దీనిపై అనేకమైన ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు సాగిస్తున్నది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అలాగే శంషాబాద్ పార్కులో ఇందు టెక్ జోన్ ప్రైవేటు లిమిటెడ్‌కు 2006లో 250 ఎకరాలు కేటాయించారు. దీనిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. దీంతో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నది. 
-బ్రాహ్మణి ఇన్‌ఫ్రా టెక్‌కు 2006లో 250 ఎకరాలు కేటాయించగా.. తాజాగా లేఅవుట్‌ను జీహెచ్‌ఎంసీకి పంపారు. 
-గోపన్‌పల్లిపార్కులో విప్రో లిమిటెడ్‌కు 20-3-2006న 101.30 ఎకరాలు కేటాయించారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏకంగా 20 ఏళ్లు గడువు పొడిగించారు. 
-మణికొండలో ల్యాంకోహిల్స్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు 17-8-2005న 100 ఎకరాలు కేటాయించగా 83.29 ఎకరాలను స్వాధీనం చేశారు. మరో రెండేళ్ల పాటు గడువు ఇచ్చారు.
-మంచిరేవుల పార్కులో రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్‌కు 80.27 ఎకరాలను 2007, అక్టోబర్ 6న ట్రేడ్ టవర్ అండ్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను నిర్మించేందుకు కేటాయించారు. ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 
-శంషాబాద్ హార్డ్‌వేర్ పార్కులో కెటలైటిక్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కు 50 ఎకరాలను 2000, జూలై 24న సాఫ్ట్‌వేర్ వర్కింగ్ ఇన్‌స్టిట్యూషన్‌ను నిర్మించేందుకు కేటాయించగా 20 ఎకరాలు మాత్రమే వినియోగించుకున్నారు. 
-శంషాబాద్ హార్డ్‌వేర్ పార్కులో జేటీ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు 2005లో 70 ఎకరాలు హార్డ్‌వేర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్‌కు ఇచ్చారు. స్థలాన్ని రద్దు చేసేందుకు సిఫార్సు చేశారు. కానీ అమల్లోకి రాలేదు.
-ఆగాఖాన్ ఫౌండేషన్‌కు 2005, ఆగస్టు 19న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్‌ను నిర్మించేందుకు 100 ఎకరాలను, సెజ్ ఫ్యాబ్‌లో సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేటు లిమిటెడ్‌కు 2007లో మరో 100 ఎకరాలు అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకింగ్ ప్లాంట్‌కు ఉచితంగా ఇచ్చారు.
-సెజ్ ఫ్యాబ్ సిటీలో ఎక్స్ ఎల్ టెలికాం ఎనర్జీ లిమిటెడ్‌కు 2008లో 50 ఎకరాలను సోలార్ సెల్స్ అండ్ సోలార్ మాడ్యూల్స్ తయారీకి కేటాయించగా పాక్షికంగానే వినియోగించుకున్నారు. దీనికి కూడా 2015 వరకు గడువును పొడిగించారు.
-కేఎస్‌కే సూర్య ఫొటోవాల్టిక్ వెంచర్ ప్రైవేటు లిమిటెడ్‌కు 2008లో 50 ఎకరాలు కేటాయించగా నాటినుంచి ఈ స్థలం ఖాళీగానే ఉంది. 
-జీడిమెట్ల బయోటెక్ పార్కులో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు 2005లో 100 ఎకరాలు కేటాయించగా అది కూడా ఖాళీగా ఉంది. దీనికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన అధికారులు అంతటితో తమ పని అయిపోయిందని.. చేతులు దులిపేసుకున్నారు. 
-తూఫ్రాన్‌లో 2007లో ఎంఎల్‌ఆర్ మోటార్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు 125 ఎకరాలు, హిందూజా ఫౌండ్రీస్ లిమిటెడ్‌కు 60 ఎకరాలు, లోకేష్ మిషన్స్ లిమిటెడ్‌కు 50 ఎకరాలు కేటాయించగా ఆ స్థలాలు ఖాళీగా ఉన్నాయి.
-దామరగుంటలో ఎన్వీ డిస్ట్రిలరీస్ అండ్ బ్రూవరీస్ లిమిటెడ్‌కు 2010లో 132 ఎకరాలు కేటాయించారు. లక్కంపల్లిలో స్మార్ట్ ఆగ్రో లిమిటెడ్‌కు 371.43 ఎకరాలు, పెద్దాపూర్‌లో ఇన్‌వేవ్ డెక్కన్ బ్రూవరీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు 2009లో 68.02 ఎకరాలు, జెడ్చర్లలో ఎస్వీకేఎం నిమిస్ యూనివర్సిటీకి 89.99 ఎకరాలు, ఇబ్రాహీంపట్నంలో వైట్‌గోల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పింటెక్స్ పార్కు ప్రైవేటు లిమిటెడ్‌కు 135 ఎకరాలు, వరంగల్‌లోని మడికొండ టెక్స్‌టైల్ పార్కులో కాకతీయ టెక్స్‌టైల్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ పొదుపు అండ్ పరపతి పరస్పర సహకార సంఘానికి 2011లో 50 ఎకరాలు కేటాయించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి