-నీటి కేటాయింపులపై రాష్ట్రం డిమాండ్
-309 టీఎంసీల కేటాయింపు ఏ మూలకూ సరిపోదు
-కేంద్ర జలవనరులశాఖకు విన్నవించిన తెలంగాణ ప్రభుత్వం
-కృష్ణా రివర్‌బోర్డుకు పెత్తనం వద్దు.. తాజా ట్రిబ్యునల్ లేదా తాజా కేటాయింపులు
-కేంద్ర మంత్రి ఉమాభారతికి మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు
-309 టీఎంసీల కేటాయింపు ఏ మూలకూ సరిపోదు
-కేంద్ర జలవనరులశాఖకు విన్నవించిన తెలంగాణ ప్రభుత్వం
-కృష్ణా రివర్‌బోర్డుకు పెత్తనం వద్దు.. తాజా ట్రిబ్యునల్ లేదా తాజా కేటాయింపులు
-కేంద్ర మంత్రి ఉమాభారతికి మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు
కృష్ణా నదీ జలాల పంపిణీలో తాజా వాదనలు వినండి.. కొత్తగా కేటాయింపులు జరపండి అంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నీటి వాటాల కేటాయింపులో అన్యాయం జరిగింది.. ఎగువ రాష్ర్టాలను, దిగువ రాష్ర్టాన్ని పార్టీ చేయండి, ట్రిబ్యునల్‌ను నెలకొల్పండి.. అంటూ అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. బేసిన్ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 309 టీఎంసీలను మాత్రమే కేటాయించారని, అది కూడా సరిగా అందడం లేదని, తమ అవసరాలకోసం న్యాయంగా అదనంగా 581 టీఎంసీలను ఇవ్వాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసింది.
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సమర్థ అథారిటీని ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ తాజా తీర్పును అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనవసర పెత్తనం చెలాయించకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ బోర్డు (కేడబ్ల్యూడీఐబీ) నిర్ణయాలను అనుసరించేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సోమవారం ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని కలుసుకుని సెక్షన్-3 కింద ఫిర్యాదు పత్రం అందించారు.
మంత్రితోపాటు రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌రెడ్డి తదితరులున్నారు. నదీ జలాలకు సంబంధించిన పలు వివాదాలపై వివరించారు. గడచిన ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంతానికి కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో పూర్తి అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని ఇపుడైనా ఆ అన్యాయాలు సరిదిద్దవలిసి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీ కోసం ప్రత్యేక నిర్ణయం జరగాలని కోరారు.
మంత్రితో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఉమాభారతి సానుకూలంగా స్పందించారని, తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టి అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి ఉండే కష్టాల గురించి తనకు తెలుసునని, అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పారని తెలిపారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఇందుకోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీని నియమించాలని మంత్రిని కోరగా ఆమె సానుకూలంగా స్పందించారని హరీవ్‌రావు తెలిపారు. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా విడుదల చేయాలని, గ్రౌండ్ వాటర్ అంశానికి సంబంధించి కూడా ఒక హైడ్రాలజీ విభాగాన్ని ఇవ్వాల్సిందిగా కోరామని అందుకు ఆమె సానుకూలంగానే స్పందించినట్లు తెలిపారు.
అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కూడా కలిసి పెండింగ్‌లో ఉన్న కొన్ని సాగునీటి ప్రాజెక్టులతో పాటు ప్రాణహిత -చేవెళ్ల, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరలో ఇవ్వాల్సిందిగా కోరారు. రాష్ట్ర నీటిపారుదలమంత్రి హరీశ్‌రావు కేంద్రానికి సమర్పించిన తెలంగాణ ఫిర్యాదు పత్రంలోని వివరాలివి: అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 4(1) ప్రకారం తాజాగా జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి.. కృష్ణా జలవివాదాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇంకా అమలులోకి రానందున తాజా కేటాయింపులు జరపాలి, పొరుగురాష్ర్టాల తో వివాదాలు, కొత్త డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి.. లేదా కృష్ణా వాటర్ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ బోర్డు (కేడబ్ల్యూడీఐబీ) నోటిఫై కానందున తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదును బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు సమర్పించాలి. జలవివాదాలు, తాజా అంశాలను ట్రిబ్యునల్ ప్రొసీడింగ్స్‌లోకి తీసుకోవాలి.
వాస్తవానికి బ్రిజేష్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పుపై ఆంధ్రప్రదేశ్ గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్‌లో ఉండటం తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా మారింది. ఎస్‌ఎల్‌పీపై తీర్పు ఇచ్చేంతవరకు బ్రిజేష్ తుదితీర్పును కేంద్రప్రభుత్వం గెజిట్‌లో ప్రచురించరాదని ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల బ్రిజేష్ తుది తీర్పు గత ఏడాది నవంబర్‌లోనే వెలువడినప్పటికీ అమలులోకి రాలేదు. తుదితీర్పు అమలులోకి రాలేదు కాబట్టి తాజా కేటాయింపులు కోరడానికి తెలంగాణకు అవకాశం లభించింది.
ఒకవేళ బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది తీర్పు అమలులోకి వస్తే మరో యాభయ్యేండ్ల వరకు కేటాయింపుల్లో అన్యాయాన్ని భరించాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమైన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కేంద్రంపై సెక్షన్-3 అస్ర్తాన్ని ప్రయోగించి వ్యూహాత్మకంగా అడుగు వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూనే ఎగువ పరీవాహక ప్రాంతాలలోని (అప్పర్ రైపేరియన్) రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రతో కూడా జలవివాదాలున్నందున వాటిని కూడా పార్టీ చేయాలని సెక్షన్-3 కింద ఫిర్యాదు చేసింది.
తెలంగాణకు అనాదిగా జరిగిన అన్యాయంపై కేంద్ర జలసంఘం ముందు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలు, నిర్దిష్ట ఆధారాలతో ఫిర్యాదు చేసింది. బచావత్ నుంచి బ్రిజేష్ ట్రిబ్యునల్ వరకు జలపంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను వివరించింది. తెలంగాణకు కృష్ణా జలాల్లో కొత్తగా కేటాయింపులు చేయడానికి బ్రిజేష్ ట్రిబ్యునల్ తాజాగా వాదనలు వినాలని డిమాండ్ చేసింది.
నీటి వాటాల కేటాయింపులో ఇరుగు పొరుగు రాష్ర్టాలతో అన్యాయం జరిగిందని, లేదా నష్టపోతున్నామని ఏ రాష్ట్రమైనా భావిస్తే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్-3 ప్రకారం కేంద్ర జలసంఘం ముందు మొదట ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదును తీసుకున్న కేంద్రం అన్ని రాష్ర్టాలను పిలిపించి సమావేశం ఏర్పరిచి నీటి కేటాయింపులపై తెలంగాణ చేసిన ఫిర్యాదుపై చర్చించాల్సి ఉంటుంది. తెలంగాణ వాదనతో ఇరుగు పొరుగు రాష్ర్ర్టాలు ఒప్పుకోని పక్షంలో ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై తాజా వాదనలు వినాల్సి ఉంటుంది. లేదా తాజా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి.
గతంలో జరిగిన నష్టం.. రాబోయే కాలంలో జరగబోయే నష్టాన్ని అంచనావేసిన తెలంగాణ ప్రభుత్వం నిర్దిష్టమైన అంశాలతో ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో కృష్ణా జలాలపై జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ గడువును రెండేండ్ల వరకు పొడిగించారు. అది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోసమే పొడిగించారు. విభజన చట్టం సెక్షన్ 89ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల మధ్య ప్రాజెక్ట్‌లవారీగా నీటి కేటాయింపులు జరగకపోతే వాటిని కేటాయించడం, నీటి కొరత ఉన్నప్పుడు వాటాలను ఎలా పంచాలనే రెండు అంశాలపైనే బ్రిజేష్ ట్రిబ్యునల్ దృష్టి సారించనుంది. కానీ ఒక్క లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌తోనే కాదు అప్పర్ రైపేరియన్ స్టేట్ కర్ణాటక, మహారాష్ట్రలతో కూడా వివాదాలున్నాయని, వాటిని తాజా వాదనల్లో తేల్చుకోవాల్సి ఉందని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది.
కృష్ణా బేసిన్‌ను ఇందుకు ప్రధాన అంశంగా ఎంచుకుంది. బేసిన్ అవతల అక్రమ ప్రాజెక్ట్‌లపై గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తప్పుడు, పక్షపాత విధానాలపై ఫిర్యాదు చేసింది. బేసిన్ ప్రకారం కాకుండా తమకు కేవలం 309 టీఎంసీలను మాత్రమే కేటాయించారని, అది కూడా సరిగా అందడం లేదని, న్యాయంగా తమకు అదనంగా మరో 581 టీఎంసీలను ఇవ్వాలని తెలంగాణ సర్కార్ వివరించింది.
కృష్ణా బేసిన్ బారానా.. పంచింది చారానా..
కృష్ణా బేసిన్ ప్రకారం తమకు నీటి వాటా కావాలని, జస్టిస్ బ్రిజేష్ నేతృత్వంలోని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తాజాగా నాలుగురాష్ర్టాలకు కేటాయింపులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది. ఏ ప్రాజెక్ట్‌కైతే నీరు కేటాయించలేదో ఆ ప్రాజెక్ట్‌లను పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఒరిగేదేమీలేదని స్పష్టం చేస్తున్నది. పైగా వరద, మిగులు జలాల పంపకంలో స్పష్టత లేకుండా లోటులో వాటా పంచాలనడం అన్యాయమని సర్కార్ వాదిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపి ట్రిబ్యునల్ ముందు సరిగ్గా వాదించకపోవడం వల్ల తమకు ఎంత అన్యాయం జరిగిందో సర్కార్ తన నివేదికలో సవివరంగా తెలిపింది.
తెలంగాణను రైపేరియన్ స్టేట్‌గా గుర్తించి కృష్ణా బేసిన్ ప్రకారం తాజాగా కేటాయింపులు ఎంత చేయాలనే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన నివేదికను అందజేసింది. వాస్తవానికి తెలంగాణ భూభాగంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 52,229 చదరపు కిలోమీటర్లు అంటే 68.50 శాతంగా ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరీవాహక ప్రాంతం కేవలం 9997 చదరపు కిలోమీటర్లు (13.11 శాతం), రాయలసీమ 14,021 చదరపు కిలోమీటర్లు (18,39శాతం)గా ఉంది. కానీ నీటి కేటాయింపులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు 298.96 టీఎంసీలు (36.86శాతం) ఇస్తే బ్రిజేష్ ట్రిబ్యునల్ నికరజలాల్లో 9 టీఎంసీలు మాత్రమే కేటాయించింది. దీంతో మొత్తం కలిపి తెలంగాణకు 307.96 టీఎంసీల వాటా దక్కింది. కానీ అసలు బేసిన్‌లో లేని రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీటిని కేటాయించి తెలంగాణకు అన్యాయం చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కేవలం 13.11 శాతం పరీవాహక ప్రాంతం ఉన్న ఆంధ్రకు 367.34 అంటే 43.27 శాతం నీరిచ్చి, 18.39 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్న రాయలసీమకు 20.48 శాతం నీరివ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తిచూపింది. తెలంగాణకు అన్ని బేసిన్ లోపలే ఇచ్చినా బేసిన్ అవతల ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్ట్‌లకు 390 టీఎంసీలను కేటాయించడం అన్యాయమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాబేసిన్ లోపల ఉన్న ప్రాజెక్ట్‌లకు 150.90 టీఎంసీలను కేటాయిస్తే బేసిన్ అవతల 390.1 టీఎంసీలను కేటాయించడంపై అభ్యంతరం లేవదీసింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ 75 శాతం, 65 శాతం నీటి లభ్యత ఆధారంగా సరాసరి లెక్కలను తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలను కేటాయించగా అందులో కేవలం 9 టీఎంసీలు తెలంగాణకు కేటాయించడమేమిటని ప్రశ్నిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపి ట్రిబ్యునల్ ముందు సరిగ్గా వాదించకపోవడం వల్ల తమకు ఎంత అన్యాయం జరిగిందనే విషయంపై సర్కార్ నివేదిక సిద్ధం చేసింది. తెలంగాణను రైపేరియన్ స్టేట్‌గా గుర్తించి కృష్ణా బేసిన్ ప్రకారం తాజాగా కేటాయింపులు చేయాలని ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించింది.
తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయించినప్పటికీ కేవలం 113.22 టీఎంసీలు మాత్రమే వినియోగంలోకి వస్తున్నాయని వివరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యంవల్ల కోయిల్‌సాగర్, డిండి, మూసీ, కోటిపల్లివాగు, శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్ట్‌ల కింద సరైన నీరు లేక ఆయకట్టు ఏ విధంగా కుంచించుకుపోయిందో విశ్లేషించింది. 11వ శతాబ్దంలో కాకతీయుల పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం తర్వాత ఏ విధంగా పతనమైందో వివరించింది. శ్రీశైలం కుడికాలువ కింద పోతిరెడ్డిపాడుద్వారా 400 శాతం ఎక్కువ నీటిని తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ వాటాకు గండికొట్టిందని వివరించింది.
11,150 క్యూసెక్కులకు బదులు 55,150 క్యూసెక్కులను రాయలసీమకు ఎలా తరలించుకుపోతున్నదో కేంద్రానికి తెలిపింది. శ్రీశైలం నుంచి ఎక్కువ నీటిని తరలించుకుపోవడానికి కనిష్ఠ నీటి మట్టాన్ని 834 నుంచి 854 అడుగులకు పెంచిందని, నల్లగొండలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటి కోసం శ్రీశైలం ఎడమకాలువ ద్వారా 150 టీఎంసీలను అందించాలని పథకం రూపొందిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్ దానిని కేవలం 30 టీఎంసీలకు కుదించిందని ఫిర్యాదు చేశారు. బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్ట్‌ల కోసం కాకుండా బేసిన్ అవతల ఉన్న గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్ట్‌ల కోసం ఆంధ్ర ప్రభుత్వం వాదించిందని, ట్రిబ్యునల్‌ను పక్కదోవ పట్టించిందని వివరించింది.
వాస్తవానికి హైదరాబాద్ నగరానికి సమీప భవిష్యత్‌లో 70 టీఎంసీల నీరు కావాల్సి ఉంటుందని తెలిసినా గత ప్రభుత్వాలు ట్రిబ్యునల్ ముందు వాదించలేదని ఫిర్యాదు చేసింది. తెలంగాణను రైపేరియన్ స్టేట్‌గా గుర్తించి కృష్ణా బేసిన్ ప్రకారం తాజాగా కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌కు 70 టీఎంసీలు, శ్రీశైలం ఎడమకాలువ విస్తరణకు 92 టీఎంసీలు, కల్వకుర్తి రెండో దశకు 68, కొడంగల్- నారాయణ్‌పేట్ ఎత్తిపోతలకు 32, జూరాల-పాకాలకు 60, పాలమూరు ఎత్తిపోతలకు 70 టీఎంసీలు, మున్నేరు ప్రాజెక్ట్‌కు 5.5, కలికోటకు 3.5, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలను, పరిశ్రమలు, పశుసంపద కోసం 150 టీఎంసీలను మొత్తం కలిపి అదనంగా 581 టీఎంసీలను కేటాయించాలని తెలంగాణ సర్కార్ వివరించింది. కృష్ణావాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ - 2 (బ్రిజేశ్ ట్రిబ్యునల్) ముందు కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తాజా వాదనలు వినాలని రాష్ట్రం కోరుతున్నది.
నాలుగు రాష్ర్ర్టాలను కలిపి తాజాగా కేటాయింపులు చేస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నది. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న నిర్ణయాలు, కేటాయింపులను సమీక్షించి కొత్త రాష్ట్రం ఏర్పడిన క్రమంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలంటున్నది. బ్రిజేష్ మధ్యంతర తీర్పుపై ఆంధ్రప్రదేశ్ గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్‌లో ఉండటం తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా మారింది. ఎస్‌ఎల్‌పీపై తీర్పు ఇచ్చేంతవరకు బ్రిజేష్ తుదితీర్పును కేంద్రప్రభుత్వం గెజిట్‌లో ప్రచురించరాదని ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల బ్రిజేష్ తీర్పు అమలులోకి రాలేదు. తుదితీర్పు అమలులోకి రాలేదు కాబట్టి తాజా కేటాయింపులు కోరడానికి తెలంగాణకు అవకాశం లభించింది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి