-పర్యాటక ప్రాంతాల ప్రచారంపై ప్రత్యేక దృష్టి
-పర్యాటకులను ఆకర్షించేందుకు భారీ ప్రచారం
-దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు
-తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై అవగాహన
-రోడ్ కం రైల్ కం క్రూయిజ్ ప్యాకేజీలు
మరుగున పడిన తెలంగాణ పర్యాటక క్షేత్రాల గుర్తించి వాటి అందాలు, విశేషాలను వెలుగులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీమాంధ్ర పాలనలో తెలంగాణ అందాలకు తగిన ప్రాచూర్యం లభించలేదు. ఫలితంగా ఇక్కడున్న క్షేత్రాలు, తీర్థాలు, ప్రకృతి రమణీయత ఇతర విశేషాలు అనేకం బాహ్యప్రపంచానికి తెలియకుండా మరుగునపడ్డాయి. వీటన్నింటినీ ఇపుడు గుర్తించి వాటి విశేషాలను వివిధ రూపాల్లో ప్రచారం చేసేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నది.-పర్యాటకులను ఆకర్షించేందుకు భారీ ప్రచారం
-దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు
-తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై అవగాహన
-రోడ్ కం రైల్ కం క్రూయిజ్ ప్యాకేజీలు
వాస్తవానికి సువిశాల తెలంగాణలో దుర్గమారణ్యాలు, పర్వతశ్రేణులు, జలపాతాలు, గుహాలయాలు, వన్యప్రాణి రక్షక కేంద్రాలు, ప్రకృతి రమణీయత ఉట్టిపడే భారీ సరస్సులు, చెరువులతో పాటు చారిత్రక సంపదకు అలవాలమైన ఆలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ విశ్వవ్యాప్తం చేసే కృషిలో భాగంగా దేశంలోని ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షించేందుకు, వారిని రప్పించి తెలంగాణలోని వివిధ రకాల పర్యాటక ప్రాంతాలను చూపించేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తున్నది. ఇందుకోసం తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, తెలంగాణ సాహిత్యం, చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ టూరిజం శాఖ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నది.
ఇటీవల కర్నాటక రాజధాని బెంగళూరులో తెలంగాణ టూరిజం శాఖ ఇలాంటి రోడ్ షోలను నిర్వహించింది. త్వరలో దక్షిణ భారత దేశంలోని మరిన్ని నగరాల్లో తెలంగాణ విశిష్టతను చాటే విధంగా రోడ్‌షోలు నిర్వహించాలని భావిస్తోంది. తెలంగాణ పల్లెల్లో జాతరలా నిర్వహించుకునే బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతరల విశిష్టతలను కూడా ఈ రోడ్‌షోలు చాటి చెబుతున్నాయి. గోదావరి నదులు ప్రవహిస్తున్న తెలంగాణలో గోదావరి నదీఒడ్డున భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చదువులమ్మ తల్లి బాసర సరస్వతి దేవాలయం ప్రసిద్ధిగాంచింది. వీటితో పాటు గోల్కొండ కోట, కాకతీయుల కాలం నాటి లక్నవరం, రామప్ప చెరువు, వేయి స్థంభాల దేవాలయం పర్యాటకానికి అనువైన ప్రదేశాలపై దేశ పర్యాటకులకు అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నది.
ఇటీవల భువనగిరి కోట వద్ద అడ్వంచర్ టూరిజం కార్యకలాపాలు ప్రారంభించటంతో పాటు జన్నారం ఎకో ప్రాజెక్టులను చేరుకునేందుకు వివిధ మార్గాల్లో ప్యాకేజీలను ఏర్పాటు చేసినట్లు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది. వీటిని చేరుకునేందుకు ఇప్పటికే రోడ్ కం రైల్, రైల్‌కం క్రూజ్ ప్యాకేజీలను రూపొందించినట్లు ప్రకటించింది. తాజాగా తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పర్యాటకులకు కనీస అవసరాలు సమకూర్చటం కోసం కృషి చేస్తోంది. పర్యాటకులు తమ టూర్లలో మధురానుభూతులను పొందే విధంగా అన్ని వసతులతో ప్యాకేజీలను ప్రకటిస్తోంది.
తిరుపతిలో బాలాజీ ఉచిత దర్శనానికి కసరత్తు చేస్తూనే పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ వద్ద 63 అధునాతన వోల్వో మెర్సిడిజ్ బెంజ్ వంటి కోచ్‌లు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ ప్యాకేజీలతో పాటు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ప్యాకేజీలకు తిప్పాలని భావిస్తోంది. ఈ సేవలకు అనుసంధానంగా మరో రెండు అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. పర్యాటకులే లక్ష్యంగా ఇన్నోవా వాహనాలను కారవాన్ పేరుతో దేశంలోని మెదటి సారిగా ప్రత్యేక పర్యాటక విధానాన్ని అమలు చేయబోతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని జాతీయ రహదారులు, పర్యాటక ప్రాంతాల్లో 33 హరిత హోటళ్లు సేవలు అందిస్తున్నాయి. వీటిని మరింత విస్తరించి పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యాన్ని అందించాలని భావిస్తోంది. మరో వైపు వినూత్నంగా భవనగిరి కోట వద్ద అడ్వెంచర్ క్లబ్ పేరుతో సాహస యాత్రికులకు రాక్ ైక్లెంబింగ్, ట్రెక్కింగ్, జీప్ రైడింగ్ వంటి సాహస కృత్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్ జన్నారం ప్రాంతంలో కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి