గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 30, 2014

ఉమ్మడి అడ్మిషన్ల విధానానికి.. ఆంధ్రా సర్కార్ తూట్లు!

- ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై ఏకపక్ష నిర్ణయం
- ఏపీ ఒత్తిడితో ఉన్నత విద్యామండలి నిర్ణయం
- కౌన్సెలింగ్‌ను వ్యతిరేకించిన 9 మంది సభ్యులు
- ఎంసెట్ అడ్మిషన్లపై సుప్రీంలో కొనసాగుతున్న విచారణ
- షెడ్యూల్ ప్రకటించడం కోర్టు ధిక్కారమే!
- తాజా పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం!
- ఎవరికీ అన్యాయం జరగదన్న మంత్రి జగదీశ్‌రెడ్డి
రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్ర పాలకులు మాత్రం తమ ఆధిపత్యధోరణిని విడనాడటం లేదు. విద్యుత్ పీపీఏలు, కృష్ణా నీటి పంపిణీలో తెలంగాణకు అన్యాయం చేయాలని ప్రయత్నించి విఫలమైన ఆంధ్రబాబులు తాజాగా విద్యారంగంలోనూ వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి విద్యా విధానానికి తూట్లు పొడుస్తూ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏపీ సన్నాహాలు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండురాష్ర్టాలలో ఇంజినీరింగ్, మెడికల్, ఎంబీఎ, ఎంసీఏ, బీఎడ్‌వంటి వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల్లో పదేండ్లపాటు ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి అడ్మిషన్ల విధానానికి ఆంధ్ర సర్కారు తూట్లు పొడిచింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తేదీలపై సోమవారం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న తొమ్మిదిమంది సభ్యులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. అవేవీ పట్టించుకోకుండా ఆంధ్రప్రభుత్వ ఒత్తిడితో ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం ఆగస్టు 7 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో సిబ్బంది విభజనకు సంబంధించిన పనులు పూర్తికాలేదు. దీంతో ఆయా ప్రభుత్వ విభాగాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతోపాటు ఫీజుల పథకంలో కొన్ని మార్పులు చోటుచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గడువును అక్టోబర్ నెలాఖరువరకు పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి అక్టోబర్ 4న కేసు విచారణకు రానుందని, అందుకే కౌన్సెలింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకున్నా అది కోర్టు ధిక్కారం అవుతుందని వారు అంటున్నారు. ఇదేవిషయాన్ని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. అయినప్పటికీ ఉన్నత విద్యా మండలి అధికారులు పెడచెవిన పెట్టారు. విద్యా మండలి చైర్మన్ ఆంధ్ర ప్రభుత్వం చెప్పినట్టు ఆడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

సీఎం కేసీఆర్ ఆగ్రహం!

కౌన్సెలింగ్ తేదీల షెడ్యూల్‌ను ప్రకటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగకుండా చూడాలని ఆదేశించినట్టు తెలుస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించినట్టు సీఎం కార్యాలయ వర్గాలు చెప్పాయి. అడ్మిషన్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగనివ్వమని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

సర్టిఫికెట్ల పరిశీలనకు సహకరించం: టీ పాలా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నతమండలి తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ పాలిటెక్నికల్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (టీ పాలా) ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల 7 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ల పరిశీలనా ప్రక్రియను తాము బహిష్కరిస్తున్నామని టీ పాలా రాష్ట్ర నాయకులు ఎంనాగరాజు, తారాసింగ్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చెబితేనే తాము కౌన్సెలింగ్‌కు సహకరిస్తామన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి