గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 11, 2014

పోలవరంపై సుప్రీంకు వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం...!

పోలవరం ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన
ఐదో రోజు పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ ఈమేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్టాప్ పోలవరం, జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు ఒడిషా, చత్తీస్‌గఢ్ ఎంపీలు గళం కలపడంతో లోక్‌సభ ఆందోళనలతో దద్దరిల్లింది.

పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం:ఎంపీ వినోద్
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఐదో రోజు లోక్‌సభ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ 1 మార్చి 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మే 29 న కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగవిరుద్ధమని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ర్టాల సరిహద్దులు మార్చేటపుడు ఆయా రాష్ర్టాల అభిప్రాయాలు తీసుకోవాలన్న నిబంధనను కేంద్రం పాటించలేదని ఆరోపించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో మొదట చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలవరం డిజైన్ మార్చాల్సిందే: ఎంపీ గుత్తా
గిరిజనుల పొట్టగొట్టే పోలవరం డిజైన్ ను మార్చాల్సిందేనని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ మందబలంతో పోలవరం ఆర్డినెన్స్‌ను పాస్ చేయించొద్దని హెచ్చరించారు. పోలవరంపై నాలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఎంపీల అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. ఏకపక్షంగా పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించడం రాజ్యాంగవిరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం ముందు నిరసన తెలిపారు. బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఎంపీలకు మద్దతుగా ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కుట్రపూరితమైన ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఖమ్మంలోని ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనమయ్యాయి. కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, పీలేరుపాడు, వీఆర్‌పురంలోని 211 గ్రామాలు ఆంధ్రాలో విలీనమవనున్నాయి. దీంతో 3,267 హెక్టార్ల అటవీ ప్రాంతం ఆంధ్రాలో కలవనుంది. బిల్లు ఆమోదంతో భద్రాచలం పట్టణం మినహా మిగతా ప్రాంతాలు ఏపీలో విలీనం కానున్నాయి. 34 వేల కుటుంబాల్లోని 1,67,796 మంది గిరిజనులు ముంపునకు బలవనున్నారు.

‘గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిన్రు’
పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించి గిరిజనులకు తీవ్రమైన అన్యాయం చేసిన్రని న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలకు బీజేపీ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. వనరులను కాజేసేందుకే ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారని మండిపడ్డారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

‘పోలవరం ఆర్డినెన్స్‌ను చట్టం చేయడం బాధాకరం’
పోలవరం ఆర్డినెన్స్‌ను చట్టం చేయడం బాధాకరమని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం డిజైన్ మార్చి తెలంగాణకు నష్టాన్ని తగ్గించేలా ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్రం మాట్లాడాలని సూచించారు. ఆర్డీఎస్ పనులు జరిగేందుకు ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఘర్షణ చేస్తే తీవ్ర పరిస్థితులుంటాయని హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వం పోలీసు బందోబస్తు పెట్టైనా పనులు జరిపించాలన్నారు. ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడుతానని స్పష్టం చేశారు.

స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించిన్రు:ఎంపీజితేందర్‌రెడ్డి
పోలవరం ఆర్డినెన్స్ విషయంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో నడుస్తున్నది మోడీ సర్కారా లేదా చంద్రబాబు సర్కారా అని అనుమానం వస్తున్నదని విమర్శించారు.

‘మూడు రాష్ర్టాల హక్కులను కేంద్రం కాలరాసింది’
పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించి కేంద్రం తెలంగాణతోపాటు ఒడిశా,ఛత్తీస్‌గఢ్ ప్రజల హక్కులను కాలరాసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్ 3ను ఉల్లంఘించి ఎన్డీఏ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఎంత పోరాటం చేసినా కేంద్రం మందబలంతో వారి గొంతు నొక్కేసిందని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీలు విప్ జారీ చేసి పంతం నెగ్గించుకుంటే టీటీడీపీ, బీజేపీ ఎంపీలు అడ్డుకొని ఉండాల్సిందన్నారు. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడాన్ని టీఆర్‌ఎస్ మొదటి నుంచి వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. పోలవరం డిజైన్‌ను మార్చాలని తానే స్వయంగా కేంద్రాన్ని, రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేసినా కేంద్రం మొండిగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. భద్రాచలంలోని ఏడు మండలాలను కాపాడుకునే విషయంలో ఎలాంటి కార్యాచరణను రూపొందించుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యమం ఇంకా అయిపోలేదు: మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని తెలంగాణపై సీమాంధ్రుల దోపిడి ఇంకా కొనసాగుతోందని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలపై చంద్రబాబు దాడి ఇంకా కొనసాగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ వనరులను దోచుకుపోయేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. విద్యా, ఉద్యోగాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని అన్నారు. సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మనం ఇవ్వాలని అనడం సరికాదన్నారు. 

చంద్రబాబు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడని, తెలంగాణకు కరెంట్ లేకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీలేరు పవర్ ప్రాజెక్టు కోసం 7 మండలాలను ముంచారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మనకు మిగిల్చింది సమస్యలేనని తెలిపారు.

చంద్రబాబు సూచనల మేరకే బిల్లు పాస్: డీఎస్
పోలవరం ఆర్డినెన్స్‌ను బిల్లుగా మార్చుతూ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే లోక్‌సభలో బిల్లును ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఆప్రజాస్వామికంగా ఆమోదించారని దుయ్యబట్టారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపడాన్ని 3 రాష్ర్టాలు వ్యతిరేకించినా ఆగమేఘాల మీద ఆమోదించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. కేంద్రం పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ఎవరినీ సంప్రదించకుండా కీలక నిర్ణయాలు ఎలా తీసుకుంటారని విమర్శించారు. అసలు చర్చ జరుగకుండా బిల్లును ఆమోదించడం దారుణమన్నారు. నిర్ణయం తీసుకునే ముందు పోలవరం ముంపు బాధితుల ఆమోదం ఉండాలన్నారు. రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా సరిహద్దులను ఎలా మారుస్తారని నిలదీశారు. పోలవరం ముంపు ప్రాంతాలకు చెందిన గిరిజనుల జీవితాలకు విలువే లేకుండా పోయిందా? అని మండిపడ్డారు.

గిరిజనులకళ్లలో ఎన్డీఏ ప్రభుత్వంమట్టికొట్టింది: ఈటెల
పోలవరం ఆర్డినెన్స్‌ను ఆమోదించి ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనుల కళ్లలో మట్టికొట్టిందని మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. చంద్రబాబు కుటిల నీతి వల్లే బిల్లు ఆమోదం పొందిందని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయినా సమైక్యవాదుల కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని దుయ్యబట్టారు. గిరిజనుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. రాష్ట్రం విడిపోయినా సమైక్యవాదుల కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంచు భూమిని కూడా వదులుకోం: మంత్రి పోచారం
తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్క ఇంచు భూమిని కూడా వదులుకునే ప్రసక్తేలేదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ లోక్‌సభలో ఎన్డీఏ ప్రభుత్వం బిల్లును పాస్ చేయడంపై మంత్రి మండిపడ్డారు. తెలంగాణ జిల్లాలకు చెందిన ఇంచు భూమిని వేరుచేసినా ఊరుకోమని అన్నారు. ముంపు మండలాలను రక్షించుకునేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

పోలవరంపై సుప్రీంను ఆశ్రయిస్తాం: బాల్క సుమన్
పోలవరంను కాపాడుకోవడానికి తాము న్యాయపోరాటం చేస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఇవాళ లోక్‌సభలో పోలవరం బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ముంపు మండలాలను కాపాడుకుని, గిరిజనుల హక్కులను రక్షించేందుకు తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. బీజేపీ, టీడీపీలు కుమ్మకై గిరిజనుల హక్కులను కాలరాశాయని దుయ్యబట్టారు. ఇందుకు తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.

ఏపీకి అండగా కేంద్రం పోలవరం కుట్ర
పోలవరం ముంపు గ్రామాల విషయంలో అంధ్రప్రదేశ్‌కు అండగా కేంద్ర సర్కారు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఇవాళ లోకసభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఎన్‌డీఏ ఆమోదించింది. బీజేపీ, తెలుగు దేశం ఎంపీలకు విప్ జారీ చేసి మందబలంతో బిల్లును ఆమోదించారు. మూడు రాష్ర్టాల ప్రజల హక్కులను హరిస్తూ అప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకుంది. 

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఎంపీల అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. ఏకపక్షంగా పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించడం రాజ్యాంగవిరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం ముందు నిరసన తెలిపారు. బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఎంపీలకు మద్దతుగా ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కుట్రపూరితమైన ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఖమ్మంలోని ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనమయ్యాయి. కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, పీలేరుపాడు, వీఆర్‌పురంలోని 211 గ్రామాలు ఆంధ్రాలో విలీనమవనున్నాయి. దీంతో 3,267 హెక్టార్ల అటవీ ప్రాంతం ఆంధ్రాలో కలవనుంది. బిల్లు ఆమోదంతో భద్రాచలం పట్టణం మినహా మిగతా ప్రాంతాలు ఏపీలో విలీనం కానున్నాయి. 34 వేల కుటుంబాల్లోని 1,67,796 మంది గిరిజనులు ముంపునకు బలవనున్నారు.

‘పోలవరంపై టీ బీజేపీ, టీ టీడీపీ వైఖరేంటో చెప్పాలి’
పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఎన్డీఏ సర్కారు బిల్లు చేయడంపై టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. బిల్లు పాస్ కావడం వెనుక బీజేపీ, సీమాంధ్ర పార్టీ టీడీపీ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేస్తోన్న బీజేపీ టీడీపీపట్ల తెలంగాణ బీజేపీ నేతలు, తెలంగాణ టీడీపీ నేతలు తమ వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ముంపు మండలాలను కాపాడుకునేందుకు తాము న్యాయ పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

‘పోలవరం విషయంలో న్యాయపోరాటం చేస్తాం’-ముఖ్యమంత్రి కేసీఆర్
పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్‌సభ ఆమోదించటంపై న్యాయపోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం విషయంలో కేంద్రం తీరు అప్రజాస్వామికమన్నారు. కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

పోలవరంపై సుప్రీంకు వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం
పోలవరం ముంపు మండలాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పోలవరం ప్రాంతాలను రక్షించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. మూడు, నాలుగు రోజుల్లో పోలవరం బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు న్యాయ నిపుణులతో సంప్రదించి పిటిషన్ ముసాయిదాను రూపొందిస్తోంది. ఏపీ పునర్విభజన బిల్లులో లేని అంశాలతో ఆర్డినెన్స్‌ను రూపొందించారని కోర్టుకు తెలుపనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని ఉల్లంఘించిన తీరును కోర్టుకు వివరించనుంది.


రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు తెలంగాణ జేఏసీ పిలుపు
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టంపై తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు ఈ చట్టాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ఇవాళ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విలేకరులతో మాట్లాడారు. బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్‌ను బంద్ నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులపై దాడి చేసిందని మండిపడ్డారు. లోక్‌సభలో ఇవాళ జరిగింది అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.



రేపు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ నిరసనలు
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఉద్యమం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రేపటి టీ జేఏసీ బంద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ నేతలు కోరారు.


తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ మద్దతు
రేపటి తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. ఈమేరకు పార్టీ నేతలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టాన్ని నిరసిస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ, వామపక్షాలు ఇచ్చిన తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ మద్దతునిస్తుందని వెల్లడించారు. ఈ బంద్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

రేపటి బంద్‌కు కాంగ్రెస్, టీయూఎఫ్ మద్దతు
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించడంపై యావత్ తెలంగాణ నిరసనలు వ్యక్తం చేస్తోంది. బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ జేఏసీ, వామపక్షాలు ఇచ్చిన రేపటి బంద్‌కు కాంగ్రెస్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌లు మద్దతు ప్రకటించాయి. తాము బంద్‌లో పాల్గొంటున్నామని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, టీయూఎఫ్ నేత విమలక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి