-ఆంధ్రాకు హైదరాబాద్‌లో వాటా
- విభజనలో అధికారిక కుట్రకు తెర
- వత్తాసు పలుకుతున్న అపెక్స్ కమిటీ
- నాలుగు రోజులు సాగిన సమీక్షలు
రాష్ట్ర విభజన జరిగి నెలన్నర దాటింది. కానీ ప్రభుత్వరంగ సంస్థలన్నీ ఇంకా ఉమ్మడిగానే కొనసాగుతున్నాయి. ఏడాదిపాటు ఉమ్మడిగానే కొనసాగించవచ్చునని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపర్చిన అంశాన్ని ఆధారంగా చేసుకొని విభజనకు ససేమిరా అంటున్నారు. వీటి విభజన ఎలా ఉండాలన్న దానిపై కేంద్రం నియమించిన అపెక్స్ కమిటీ సంస్థల డీమెర్జర్ ప్రణాళికలను పరిశీలించింది. ఈ నెల 18 నుంచి 21 వరకు కంపెనీలు, కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీల విభజనకు మార్గదర్శకాలను రూపొందించే ప్రక్రియ చేపట్టింది.- విభజనలో అధికారిక కుట్రకు తెర
- వత్తాసు పలుకుతున్న అపెక్స్ కమిటీ
- నాలుగు రోజులు సాగిన సమీక్షలు
హైదరాబాద్‌లోని పరిశ్రమల భవన్లో కొనసాగుతోన్న ప్రణాళికల పరిశీలన యావత్తూ తెలంగాణ రాష్ర్టాన్ని నిండా ముంచేవిధంగా కొనసాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి కంపెనీ, కార్పొరేషన్‌లో ఆస్తుల విభజన, ఉద్యోగుల కేటాయింపుల్లో రాష్ర్టానికి అన్యాయం జరిగేందుకు ఆస్కారమిచ్చారు. అపెక్స్ కమిటీ ఏపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల డీమెర్జర్ ప్లాన్‌లో అపెక్స్ కమిటీ కొత్త వాదనలను వినిపించింది. ఏపీకి మాది మాకే.. మీదీ మాకే అన్నట్లుగా ఆస్తులను చూపించారని తెలిసింది.
13 జిల్లాల్లో ఉన్న ఆస్తులన్నీ ఏపీకే చెందుతాయని, అలాగే హైదరాబాద్‌లోనూ 58 శాతం వాటా రాసివ్వాలన్న అభిప్రాయాన్ని అపెక్స్ కమిటీ చైర్మన్ షీలాబిడే వ్యక్తం చేశారు. తిరుపతి, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి వంటి నగరాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తులను వారికే కేటాయిస్తూ హైదరాబాద్‌లో ఉన్న వాటిని మాత్రం తెలంగాణకు దక్కకుండా చేస్తుండడం విడ్డూరం. తెలంగాణకు 9 జిల్లాల్లోని ఆస్తులను మాత్రమే ఇచ్చేందుకు తెర వెనుక కుట్ర సాగిస్తున్నారు. పైగా చట్టంలో అదే ఉందంటూ సంస్థలకు చెబుతున్నారు.
టీఎస్‌ఐఐసీ, ఆప్కో, వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ వంటి వాటికి నగరంలో ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే మెజార్టీ ఆస్తులను సొంతం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అలాగే హైదరాబాద్‌లోని ఆస్తులను 58:42 శాతంగా పంపిణీ చేస్తే తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలు మనుగడ సాగించలేవని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాప్యానికి ఊతం: ప్రభుత్వ రంగ సంస్థలను తక్షణం విభజించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ అపెక్స్ కమిటీ వ్యవహార శైలి మరింత జాప్యానికి ఊతమిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు ఆర్ సుధీర్‌బాబు, బీ రాజేశం ఆరోపించారు. ఆస్తుల విభజనలో రాష్ర్టానికి అన్యాయం చేయాలని చూస్తున్నారని చెప్పారు. ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులను ఆ ప్రాంతానికే కేటాయించాలని డిమాండ్ చేశారు.
లేదంటే అక్కడి నగరాల్లోని ఆస్తుల్లో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలని కోరారు. ఈ నెల 21వరకు కంపెనీలు, కార్పొరేషన్ల డీమెర్జర్ ప్లాన్లను అపెక్స్ కమిటీ పరిశీలించింది. ప్రస్తుతం మార్గదర్శకాల రూపకల్పనపై దృష్టి సారించింది. ఇప్పటివరకు కీలకమైన అన్ని సంస్థల ఆస్తులు, ఇతర అంశాలపై చర్చించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి