గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 03, 2014

తల్లి.. తండ్రి..కొడుకు.. మనిషికొక్క ఇల్లు...అంతా అవినీతిమయం...!

-ఇందిరమ్మ ఇళ్లలో కట్టుతప్పిన అవినీతి
-రికవరీలు నామమాత్రం.. సస్పెన్షన్లు పూజ్యం
-ఉత్తుత్తి విచారణలు, ఉత్తుత్తి చర్యలు
-యాక్షన్ తీసుకున్నట్టు యాక్టింగ్, నాలుగు రోజులకే పోస్టింగ్
రాజధాని చుట్టూతా ఉన్న మూడు జిల్లాల్లోనూ నాయకులు అధికారులు నిర్భీతిగా ఇష్టారాజ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భ్రష్టు పట్టించారు. దొరికినంత మేరా వాటాలు పంచుకున్నారు. అడక్కుండా ఇండ్లు మంజూరు చేసిన వైనాలు, తెలీకుండానే ఇండ్ల నిధులు కైకంర్యం చేసిన వైనాలు రాజధానికి సమీపంలోని జిల్లాల్లోనే చోటు చేసుకున్నాయి. పాత ఇంటికి ఓసారి, రంగులేసి మరోసారి బిల్లులు లేపారంటే ఏ స్థాయికి ఆ అవినీతి చేరిందో చెప్పుకోవచ్చు. చివరకు గహనిర్మాణ సంస్థ శాంపిల్ విచారణలో ఒక్కో గ్రామంలో యూభైలు వందల ఇండ్ల కథ బోగస్ అని బయటపడడంతో ఆశ్చర్యపోవాల్సిన స్థితి. ఇంత జరిగినా అక్రమార్కుల మీద తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఉత్తుత్తి చర్యలతో మమ అనిపించారు. ఫలితంగా అలా వెళ్లిన అధికారులు ఇలా విధుల్లోకి వచ్చేశారు. కొన్ని కేసుల్లో పదోన్నతులు లభించడం దీనికి పరాకాష్ఠ.

మెదక్ జిల్లాలో శాంపిల్ అవినీతే రూ.26 కోట్లు..

మెదక్‌జిల్లాలో గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇండ్ల పథకంలో అవకతవకలపై, శాంపిల్‌గా కేవలం 36 గ్రామాలలో కట్టిన 1787 ఇండ్లను పరిశీలిస్తేనే రూ.26.1 కోట్ల అవినీతి బట్టబయలైంది. జిల్లాలో మొత్తం1225 గ్రామాలలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే కనీస పక్షం రూ.800 కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుందని అంచనా. కాగా రెవెన్యూ రికవరీ చట్టం కింద అవినీతి సొమ్ము వసూలు చేయాలని 36 గ్రామాలకు అదేశాలు ఇస్తే వసూలైంది రూ.6.95 లక్షలు. ఈ అవినీతిలో 60 మంది అధికారులు భాగస్వాములు కాగా 17 మంది అధికారులపై చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. ఇందులో ఆరుగురు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు చెప్పారు. ఒక అధికారిపై క్రిమినల్ కేసు , మిగిలిన 10 మంది అధికారులపై సస్పెన్షన్ వేసినట్లు చూపించారు. కాగా కొద్ది రోజులకే ఈ అధికారులపై డిపార్ట్‌మెంట్ అధికారులకు, సీమాంధ్ర సర్కారు పెద్దలకు ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకువచ్చి 11 మంది అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ అధికారుల అవకతవకలు పరిశీలిస్తే.. జహీరాబాద్ మండలంలోని ధనసిరి గ్రామంలో 61 మంది అర్హతలేని వారికి, భూచెనెల్లి గ్రామంలో 171 మంది అనర్హులకు నిధులు విడుదల చేసినందుకు ఆ ఏరియాలో పని చేసిన అసిస్టెంట్ ఇంజనీర్(ఎఇ) ఉద్యోగం నుంచి ప్రభుత్వం 2009 నంబర్16వ తేదీన సస్పెండ్ చేసింది.

indirammaవిచారణ పూర్తి కాకుండానే 2010 అక్టోబర్ 14వ తేదీన తిరిగి విధుల్లోకి తీసుకుంది. దీంతో అవినీతికి పాల్పడే అధికారులకు ధీమా పెరిగింది. వట్టినాయక్ తండాలో 397 మంది అనర్హులైన లబ్దిదారుల పేరుతో బిల్లులు విడుదల చేసినందుకు మరొక ఏఇని 2008 నవంబర్12వ తేదీన సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసు కూడా నమోదైంది. కేసు విచారణలో ఉండగానే సమైక్య సర్కారు ఎన్నికలకు ఏడాది ముందు 2013 ఏప్రిల్ 30వ తేదీన తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని మంచి పోస్టింగ్ కూడా ఇచ్చింది. పుల్కల్ మండలంలోని కోడూర్ గ్రామంలో అవినీతికి వర్కింగ్ ఇనిస్పెక్టర్‌గా పని చేసిన ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ఇదే అక్రమాలలో భాగస్వాములైన ముగ్గురు డిప్యూటీ ఇఇలు, ఇద్దరు ఏఇలను మాత్రం సస్పెండ్‌చేసి విచారణ పెండింగ్‌లో ఉండగానే 2013 ఫిబ్రవరి 10వ తేదీన తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. వాస్తవంగా ఈ జిల్లాలో 6,66,764 ఇండ్లున్నాయి. ఇందులో 4,35,278 మంచి ఇండ్లు కాగా, 2,07,013 నివాసయోగ్యమైనవి. 24,473 శిథిలావస్థలో ఉన్నాయని జనాభా లెక్కల సర్వేలో తేలింది. ఈ జిల్లాలో 3,03,083 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 1,88,440 ఇండ్లు నిర్మించినట్లు రికార్డుల్లో చూపించారు.

రంగారెడ్డి జిల్లాలో రాని ఇంటికి రికవరీ నోటీస్

860 గ్రామాలున్న రంగారెడ్డి జిల్లా రాజధానికి ఆనుకొని ఉన్నది.. రాజధానిలో ఎలాంటి నిర్ణయాలు జరిగినా వెంటనే అమలయ్యేది ఈ జిల్లాలోనే. ఇక్కడ ఇంటి కోసం ఎదురు చూస్తున్న సామాన్యుడికి కట్టిన ఇల్లుకు డబ్బులు వాపస్ ఇవ్వమని ప్రభుత్వం నోటీస్‌లు జారీ చేయడం ఈ జిల్లాలో జరిగిన అవినీతికి పరాకాష్ఠ. అధికారులు, నాయకులు పలు గ్రామాల్లో ప్రజల పేర దొంగ ఐడీకార్డులు, రేషన్ కార్డులు సృష్టించి ఇండ్లు మంజూరు చేయించి, వచ్చిన నిధులను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే విచారణలో అనర్హులకు ఇండ్లు కేటాయించారని తేలి అధికారులు రికవరీ నోటీసులు జారీ చేస్తే అవి అసలు యజమానికి చేరి రచ్చరచ్చయింది. లబోదిబోమని అధికారుల వద్దకు వెళ్లినా వారు డబ్బులు కట్టాల్సిందేనంటున్నారు. ఈ సంఘటనలు తాండూరు, చేవెళ్ల, ధారూర్, దోమ, వికారాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో జరిగాయి. ఇక్కడ విచారణ అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి విచారణ జరపలేదని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన నివేదికను పరిశీలిస్తే అర్థమవుతుంది. కంటి తుడుపుగా 20 గ్రామాలలో విచారణ జరిపినట్లు చూపించి కొంత మంది అధికారులకు షోకాజ్ నోటీస్‌లు, మెమోలు జారీ చేసి వదిలేశారు. సదరు అధికారుల నుంచి వివరణలు రాకున్నా రాజకీయ నేతల ప్రమేయంతో పట్టించుకోలేదు. ఈ జిల్లాలో అవినీతికి పాల్పడ్డారని ఆధారాలతో సహా రుజువైన కేసుల్లో కూడా కనీస చర్యలు కూడా తీసుకోలేకపోయారు. హౌసింగ్ కార్పొరేషన్ శాంపిల్‌గా 20 గ్రామాలలో చేపట్టిన విచారణలో ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది.

వికారాబాద్ మండలంలోని బూరుగుపల్లిలో ఎలాంటి ఇంటి నిర్మాణాలు చేపట్టకుండానే, లబ్ధిదారులకు ఎలాంటి సమాచారం లేకుండానే రూ.6.63 లక్షలు దొంగ బిల్లులు పెట్టి డ్రా చేసినట్లు విచారణలో తేలింది. యాలాల్ మండలంలోని జక్కెపల్లి, బెన్నూర్ గ్రామాలలో డిప్యూటీ ఇఇ, ఎంఏసీ అధికారులు ఇద్దరు కలిసి రూ.5 లక్షల అవినీతికి పాల్పడినట్లు నివేదిక ఇచ్చినప్పటికీ కనీస చర్యలు తీసుకోలేదు. సొమ్మునూ రాబట్టలేకపోయారు. పైగా యాక్షన్ తీసుకోవాల్సిన ఫైల్‌ను తొక్కిపెడుతున్నారు. ఈ జిల్లాలోనే అనేక గ్రామాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే పాత ఇండ్లకు రంగులు దిద్ది పెద్దమొత్తంలో డబ్బులు డ్రా చేసుకున్నట్లుగా నివేదికలు చెపుతున్నాయి. చేవెళ్ల మండలంలోని కాన్పూర్, మీర్జాగూడ గ్రామాలలో రూ.18.35లక్షల అవినీతిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినప్పటికీ నేటికి ఎలాంటి చర్యలు చేపట్టకుండానే సదరు అధికారులను రక్షిస్తున్నారు. ఈ జిల్లాలో మొత్తం 12,63,714 ఇండ్లు ఉండగా, మంచి ఇండ్లు 10,11,828 ఉన్నాయి. నివాసయోగ్యమైన ఇండ్లు 2,37,809 ఇండ్లున్నాయి. శిధిలావస్థలో కేవలం14,077 ఇండ్లు మాత్రమే ఉన్నాయని జనాభా లెక్కల సర్వే చెపుతున్నది. కానీ ఇప్పటి వరకు ఈ జిల్లాలో 3,07,684 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,21,413 ఇండ్లు నిర్మించినట్లు అధికారులు చెపుతున్నారు. ఇంకా 1,49,271 ఇండ్లకు పనులు కూడా మొదలు పెట్టలేదని అంటున్నారు.

పాలమూరు జిల్లాలో ఒకే ఇంటికి నాలుగు బిల్లులు..

కూటి కోసం ఎల్లలు దాటి వలసలు పోయే అమాయక పాలమూరు జిల్లా ప్రజలను కూడా దయలేని దగుల్బాజి అధికారులు అందిన కాడికి దోచుకున్నారు. 1477 గ్రామాలున్న ఈ జిల్లాలో ఇండ్ల నిర్మా ణంలో శాంపిల్‌గా 53 గ్రామాలలోని 1227 ఇండ్లపై హౌసింగ్‌కార్పోరేషన్ అధికారులు విచారణ చేపట్టగా రూ.28.03 కోట్ల భారీ అవినీతి జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ జిల్లాలో అధికారులు, నాయకులు కలిసికట్టుగా మరో రకం అవకతకలకు దిగి రికార్డు సృష్టించారు. ఎక్కడా లేని విధంగా ఒకే కుటుంబంలోని తల్లి, తండ్రి, కొడుకులకు రేషన్ కార్డులు సృష్టించి ఒక్కళ్లకు ఒక్కో ఇల్లు మంజూరు చేశారు. ఒకే ఇంటికి మూడు నాలుగు సార్లు బిల్లులు సృష్టించి దండుకున్న వైనం బయటపడింది. గద్వాల మండలంలోని అనేక గ్రామాలలో నిర్మాణాలు కూడా చేపట్టకుండానే బిల్లులు అధికారులే డ్రా చేసుకున్న వైనం వెలుగు చూసింది. పాత ఇండ్లకు ఒకసారి, రంగులు వేయించి మరోసారి ఇలా ఒకే ఇంటికి డబుల్ బిల్లులు తీసుకున్నారు. అయితే ఈ బిల్లుల సొమ్ము లబ్ధిదారులకు కాకుండా నాయకులకు, అధికారులకు చేరినట్లు నివేదికలో పొందుపర్చారు. మహబూబ్‌నగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న శివారు గ్రామాలలో చేపట్టిన ఇండ్లనిర్మాణంలో రూ.28.22లక్షల మేరకు అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయింది. నాగర్ కర్నూల్ డివిజన్‌లోని గుమ్మకొండ, అలీపూర్, శైన్‌పల్లి, నగనూల్, నాగర్ కర్నూల్, పెద్దముద్దనూర్, తాళ్లపల్లి, తెల్కపల్లి, వెల్దండ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై చేపట్టిన విచారణలో రూ.1.71 కోట్లు భారీ అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయింది. కానీ నేటి వరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద కేవలం రూ. 17.55 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు.

నాగర్ కర్నూల్, బిజినేపల్లి, కొల్హాపూర్ సబ్‌డివిజన్లలోని అనేకమంది రాజకీయ నాయకులు, అధికారులపై క్రిమినల్ కేసులునమోదు అయినప్పటికీ సొమ్మును తిరిగి రాబట్టడంలో గృహనిర్మాణశాఖ ఘోరంగా విఫలమైనట్లు నివేదికలు చెపుతున్నాయి. అయితే ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతిలో 45 మంది అధికారులు, నలుగురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు భాగస్వాములవుతూ కేవలం 10 మంది అధికారులను మాత్రమే సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. వీరిలోనూ తిరిగి ఏడుగురు అధికారులను ఉద్యోగాలలోకి తిరిగి తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపైనే వేటు వేశారు. ఈ తతంగం అంతా ఇద్దరు రాజకీయ నాయకుల కనుసన్నలలో జరిగినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. వాస్తవంగా ఈ జిల్లాలో మొత్తం 8,73,859 ఇండ్లు ఉండగా, మంచి కండిషన్‌లోఉన్న ఇండ్లు 5,70,203 ఉన్నాయి, నివాసయోగ్యమైన ఇండ్లు 2,54,888 ఉండగా, శిథిలావస్థలో ఉన్నవి కేవలం 48,768 మాత్రమే ఉన్నాయని జనాభా లెక్కల సర్వే చెపుతున్నది. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఈ జిల్లాలో 5.81 లక్షల ఇండ్లు మంజూరు కాగా 3 లక్షల ఇండ్లు పూర్తి చేసినట్లు అధికారులు చెపుతున్నారు. 1.91లక్షల ఇండ్లు ఇంత వరకు ప్రారంభించలేదని, 87 వేల ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయని అధికారులు చెపుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి