గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 17, 2014

కేసీఆర్ మాట...వరాల మూట...

-ఇచ్చిన మాటపై నిలిచిన గులాబీ నేత
అందరికీ అన్నీ..

- లక్షలోపు రైతు రుణాలన్నీ మాఫీ
- రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర స్కేళ్లు..స్టేట్ ఇంక్రిమెంట్
- ప్రతి అమరుడి కుటుంబానికి 10 లక్షలు
- 2001నుంచి ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత
- దళిత, గిరిజన అమ్మాయిల పెండ్లిండ్లకు కల్యాణ లక్ష్మి పథకం
- రాష్ట్ర పండుగలుగా బతకమ్మ, బోనాలు
- దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి
- తెలంగాణ విద్యార్థుల ఆర్థిక సాయానికి ఫాస్ట్ పథకం
- జయశంకర్ సారు పేరిట వ్యవసాయ వర్సిటీ
- పీవీ పేరిట తెలంగాణకు వెటర్నరీ యూనివర్సిటీ
KCR01తెలంగాణ ఇంటి పార్టీ.. తన పేరు సార్థకం చేసుకున్నది. పేదలు మొదలుకుని.. వృత్తిదారుల దాకా.. ఉద్యోగులు మొదలుకుని పోలీసులదాకా.. విద్యార్థులు మొదలుకుని.. మహిళల దాకా.. రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకూ ప్రయోజనాలు కల్పిస్తూ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణ ప్రజలపై ఒక్కుమ్మడిగా వరాల వర్షం కురిపించి.. ఆనందంలో తడిపేసింది. తెలంగాణకు ఒక ఇంటి పార్టీ ఏమేం చేయగలదో మొదటి ప్రయత్నంలోనే చూపించింది. దాదాపు ఐదున్నర గంటలపాటుసాగిన కేబినెట్ సమావేశం.. 43 అంశాలపై లోతైన చర్చ.. వాటిపై విలేకరుల సమావేశంలో 69 నిమిషాలపాటు సుదీర్ఘ వివరణ! తన మౌనం కూడా శక్తిమంతమైనదని నిరూపించుకున్న కేసీఆర్.. తాను మీడియాకు దూరంగా ఉన్న ఈ 45 రోజుల వ్యవధిలో ప్రభుత్వం తరఫున ఎంత కృషి జరిగిందో చెప్పకనే చెప్పారు.

ఈ రోజు తెలంగాణ సొంత అస్తిత్వం కలిగిన రాష్ట్రంగా ఏర్పడేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులకు సముచితంగా నివాళులర్పిస్తూ రాష్ట్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. అమరుల కుటుంబాలకు పది లక్షల చొప్పున సహాయం అందించడమే కాకుండా.. వారి కుటుంబాలను పరిపూర్ణంగా అదుకుంటామని ప్రతిన చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి కార్యాచరణరూపం కల్పిస్తూ తెలంగాణ ఆత్మ ఆవిష్కృతమైంది. కేసీఆర్ చెప్పిన శుభవార్తలతో తెలంగాణ ఆనందడోలికల్లో తేలియాడింది. ఇది ఆరంభం మాత్రమేనన్న ముఖ్యమంత్రి.. మరికొద్ది రోజుల వ్యవధిలోనే మరిన్ని అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. అక్రమార్కులపై జాలి లేదన్న ఆయన.. తన కక్ష అన్యాయాలు, కుంభకోణాలపైనేనని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తయారు చేసే క్రమంలో రానున్న రోజుల్లో ఉగ్ర నరసింహావతారాన్ని చూస్తారని కబ్జాకోరులను హెచ్చరించారు.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీన ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తొలి పూర్తిస్థాయి సమావేశం గురువారం సాయంత్రం సచివాలయంలో జరిగింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన దాదాపు ఐదున్నర గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో 43 కీలక అంశాలపై లోతైన చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకున్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆచరణలోకి తెచ్చేందుకు నిర్ణయాలు, కార్యాచరణ ప్రణాళికలు ప్రకటించారు. పలు కొత్త పథకాలు తీసుకువచ్చారు. అత్యంత కీలకమైన రైతు రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని విలేకరుల సమావేశం అనంతరం కేసీఆర్ ప్రకటించారు. బంగారం కుదువబెట్టి తీసుకున్న రుణాలకు సైతం మాఫీ వర్తిస్తుందని శుభవార్త చెప్పారు.

రుణమాఫీ అమలువల్ల 39,07,409 కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై 17-19వేల కోట్ల ఆర్థికభారం పడుతుందని, దీన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలకు గుర్తింపుగా వారి కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఇంటి మూల స్తంభాలను కోల్పోయి బిక్కుబిక్కుమంటున్నవారి కుటుంబాల్లో అంధకారానికి తావేలేదని తేల్చి చెప్పారు. మలి విడత ఉద్యమంలోనే కాకుండా.. తొలి విడత 1969 ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆ కుటుంబాల్లో అర్హులైనవారు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇంటిల్లిపాదికీ ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. అమరుల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తామని తెలిపారు.

వ్యవసాయ ఆధారిత కుటుంబాలై ఉంటే వారి జీవనోపాధి కోసం మూడెకరాలు వ్యవసాయభూమి ఇస్తామని ప్రకటించారు. విద్యార్థులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) పేరుతో కొత్త పథకాన్ని తెచ్చారు. దళిత, గిరిజన కుటుంబాల్లో కళ్యాణ వేదికలు కళకళలాడాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా కల్యాణ లక్ష్మి పథకం తీసుకువచ్చారు. దీని ప్రకారం దళిత, గిరిజన అమ్మాయిల పెండ్లిండ్లకు రూ.50వేల చొప్పున అందించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. వృద్ధులు, వితంతువులు వెయ్యి చొప్పున, వికలాంగులకు 15వందల చొప్పున పెన్షన్లు ఇస్తామని చెప్పారు. వారికి బ్యాంకు ఖాతాలు తెరిచి, ఒకటో తేదీకల్లా సదరు మొత్తం ఖాతాలోకి ఆటోమేటిక్‌గా వెళ్లిపోయేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. దసరా నుంచి దీపావళి మధ్యలో కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు అందించే పింఛన్లతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, వలస ప్రభుత్వం నిర్బంధానికి గురైన ఉద్యమకారులు, విద్యార్థులపై అన్ని కేసులూ ఎత్తేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయం 2001 నుంచి వర్తిస్తుందని చెప్పారు.

మేనిఫెస్టోలో చెప్పినట్లే ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు వాహన పన్ను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 5,17,000 మందికి లబ్ధి కలిగే ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.56 కోట్ల భారం పడుతుందని కేసీఆర్ చెప్పారు. గతంలో వాహన పన్నులకు సంబంధించిన బకాయిలు రూ.76 కోట్లను కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులకు మేలు చేకూర్చే పలు నిర్ణయాలు ప్రకటించిన కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్కేళ్లను వర్తింపజేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ప్రత్యేక కేసులు ఉంటే సడలింపులు కూడా ఇస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నా.. వారందరినీ క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. దళిత కుటుంబాల్లో మహిళ పేరిట మూడెకరాల వ్యవసాయ భూమి ఇచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని దళిత అభివృద్ధి శాఖను ఆదేశించినట్లు సీఎం చెప్పారు.

వక్ఫ్ ఆస్తులను రక్షించేందుకు జుడిషియల్ అధికారాలతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడంతోపాటు.. ముస్లింల అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరం వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ అధికార చిహ్నంలో మూడు సింహాల బొమ్మ, సత్యమేవ జయతే అన్న వాక్యం వేర్వేరుగా ఉన్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ సూచనమేరకు మూడు సింహాల బొమ్మ కిందే సత్యమేవ జయతే అనే వాక్యం ఉండేలా మార్పు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 125 గజాల్లో పక్కా ఇళ్ళు నిర్మిస్తామని, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ నిర్మించి ఇస్తామని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణం ఒక ప్రహసనంగా మారిందరి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం దొంగలకు వరంగా మారిందన్నారు. ఈ పథకంలో అక్రమాలకు పాల్పడినవారిని వదిలేదని లేదని, వారిని జైళ్లకు పంపుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. గృహనిర్మాణశాఖ తన వద్ద ఉందన్న సీఎం.. అర్హులైన అందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పారు. సోషల్ ఆడిట్ ఆధారంగా గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో డంపింగ్ యార్డుల కోసం రెండు వేల ఎకరాల భూమి అవసరమని, దీనికోసం అన్వేషిస్తున్నామని సీఎం తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కమతాల ఏకీకరణకు కృషి చేస్తుందని కేసీఆర్ తెలిపారు. నిజాం కాలంలో ఉన్న రద్దో బదలును పునరుద్ధరిస్తామని చెప్పారు. దీని వల్ల వేర్వేరు చోట్ల ఒక రైతుకు ఉన్న భూభాగాలు ఒకే చోటికి వచ్చే వెసులుబాటు ఉంటుందని చెప్పారు.

రాష్ట్రంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయన్న కేసీఆర్.. ప్రతి రంగంలో అవినీతి వేళ్లూనుకుందని చెప్పారు. రాష్ట్రంలో 24 లక్షల కుటుంబాలుంటే.. 91 లక్షల రేషన్ కార్డులున్నాయన్నారు. నగరంలో 60వేల పైచిలుకు అనుమతుల్లేని భవనాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని భవనాలు కూల్చివేస్తుంటే ఒక్కో పార్టీ ఒక్కో రకంగా మాట్లాడుతున్నదన్న కేసీఆర్.. అక్రమ నిర్మాణాలు కూల్చితే వారికి ఎందుకంత బాధో అర్థం కావడం లేదని అన్నారు. తన కక్ష అక్రమార్కులపైన, అన్యాయంపైనేనని స్పష్టం చేశారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ క్రమంలో త్వరలో ఉగ్రనరసింహ అవతారం చూడబోతారని అక్రమార్కులకు, కబ్జాదారులకు ఆయన హెచ్చరిక జారీ చేశారు.

సాధారణ ప్రజలపై ప్రభుత్వానికి కక్షసాధింపు చర్యలుండబోవని, ప్రభుత్వం అంత హీనంగా దిగజారబోదని చెప్పారు. న్యాయంగానే ముందుకు పోతుందని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న పేకాట క్లబ్‌లు మూసివేస్తామని చెప్పారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారన్న కేసీఆర్.. వారి కోసం నగరాన్ని రెగ్యులేటెడ్ సిటీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న వర్షం వస్తే చాలు.. రాజ్‌భవన్ ముందు నీళ్లే. సీఎం కార్యాలయం ముందు నీళ్లే, సిస్టం మొత్తం మార్చాల్సి ఉంది. అధికారులను అడిగితే నాలాలు మొత్తం మార్పిడి చేయాలంటున్నారు. సచివాలయానికి కూతవేటు దూరంలోనే అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయం కేంద్రం చూసుకుంటుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఉద్యోగుల వయో పరిమితి పెంచే యోచన ప్రస్తుతానికి లేదన్నారు.

kcr-standingమన కోసం.. మన ప్రభుత్వం
ఇవీ క్యాబినెట్ నిర్ణయాలు

1.తెలంగాణ అమరుల కుటుంబాలకు పది లక్షల చొప్పున నగదు సాయం. ఇంట్లో అర్హులుంటే ఒకరికి ఉద్యోగం. కుటుంబానికి ఉచితవైద్యం. ఇల్లు లేకపోతే గృహ వసతి. అమరుల పిల్లలకు ఉచితంగా విద్య. వ్యవసాయ ఆధారితి కుటుంబాలైతే.. భూమి లేకుంటే కుటుంబానికి మూడెకరాల భూమి.
2.లక్షలోపు రైతు రుణాల మాఫీ. 39,07,409 కుటుంబాలకు లబ్ధి. బంగారంపై తీసుకున్న రుణాలకూ మాఫీ వర్తిస్తుంది. ఈ నిర్ణయం అమలువల్ల రాష్ట్ర ప్రభుత్వాంపై 17 నుంచి 19వేల కోట్ల భారం.
3.వృద్ధులకు, వితంతువులకు వెయ్యి చొప్పున పెన్షన్. వికలాంగులకు 1500 పెన్షన్. పెన్షన్‌దారులకు కార్డులు. బ్యాంకు ఖాతాలు తెరిచి, నెలాఖరుకల్లా పెన్షన్ సొమ్ము ఖాతాలో ఆటోమేటిగ్గా వెళుతుంది. దసరా, దీపావళి మధ్యలో కార్డుల జారీ ఉంటుంది. బీడీ కార్మికులకు నెలకు వెయ్యి భృతి.
4.తెలంగాణలో దళిత, గిరిజన యువతుల వివాహాలకు కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.50వేలు ఇవ్వాలని నిర్ణయం.
5.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై 2001 నుంచి ఇప్పటి వరకూ ఉన్న అన్ని కేసులూ ఎత్తివేత.

6.ఆటో రిక్షాలు, వ్యవసాయ ట్రాక్టర్లు, వ్యవసాయ ట్రాలీలకు రవా ణా పన్ను మొత్తం తక్షణమే రద్దు. ట్రాలీలు, ఆటోల యజ మానులు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ.76 కోట్లు మాఫీ.
7.గిరిజనులకు తాండాలు గ్రామపంచాయితీలు చేయాలని ఆందోళన చేశారు. చెంచు పెంటలు, గూడెలు, తండాలను 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన గ్రామం ఇకపై గ్రామ పంచాయతీ.
8.తెలంగాణలోని అన్ని డిపార్ట్‌మెంట్లలో ఉన్న అందరు తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.
9.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్థాయి స్కేళ్లు.
10.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంట్.

11.భూమిలేని దళిత మహిళలకు మూడెకరాల భూమి.
12.మైనార్టీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక అధ్యయనం.
13.వక్ఫ్ ఆస్తులు రక్షించడానికి జ్యుడిషియల్ అధికారాలతో ప్రత్యేక ట్రిబ్యునల్.
14.గల్ఫ్ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలకు కేరళ తరహాలో సంక్షేమ నిధి ఏర్పాటు.
15.అగ్రవర్ణాల్లోని ఈబీసీలు సహా తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) పేరుతో కొత్త పథకం ప్రారంభం. అర్హులైన తెలంగాణ విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం.

16.దసరానాటికి జంట నగరాల్లో కల్లు దుకాణాల పునరుద్ధరణ.
17.రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ, బోనాలు. త్వరలో జీవో.
18.ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీని విభజించి ప్రొఫెసర్ జయ శంకర్ పేరిట తెలంగాణకు ప్రత్యేకంగా విశ్వ విద్యాలయం.
19.భారతదేశంలోనే నంబర్ వన్‌గా ఉండేలా సింగిల్ విండో అనుమతులకు ఉద్దేశించిన పారిశ్రామిక విధానం. ఇందుకు అనుగుణంగా ఏపీ ఇండస్ట్రియల్ సింగిల్ విండో యాక్ట్ -2002కు సవరణలతో తెలంగాణ చట్టం. మార్గదర్శకాల తయారీకి ఆదేశం.
20.హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా మాస్టర్‌ప్లాన్. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీల సహకారం తీసుకోవాలని తీర్మానం.

21.రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటానికి నిపుణులు, నిష్ణాతులు, మేధావులు, సంపాదకులు, జర్నలిస్టులతో స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు. ఫలితాలను బట్టి జిల్లాల్లోనూ సలహా సంఘాల నియామకం.
22.ప్రభుత్వ చిహ్నంలో మూడు సింహాల బొమ్మ కిందే సత్యమేవ జయతే అనే వాక్యం వచ్చేలా కేంద్ర హోంశాఖ సూచన మేరకు స్వల్ప మార్పు.
23.సత్వరమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు.
24.తెలంగాణ గిరిజనుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు. ఇందు కు అనుగుణంగా చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయం.
25.ముస్లింల సంక్షేమానికి 2014-15 సంవత్సరానికి వెయ్యి కోట్ల కేటాయింపు.

26. ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ కమిషన్ చట్టం-1988కు సవరణ.
27.త్వరలోనే తెలంగాణ రాష్ర్టానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు.
28.శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని విభజించి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరుతో తెలంగాణకు ప్రత్యేక వెటర్నరీ విశ్వవిద్యాలయం ఏర్పాటు.
29.దేవాలయాల ట్రస్టీల నియామకాల మార్గదర్శకాల్లో మార్పులు తెస్తూ త్వరలో ఆర్డినెన్స్.
30.పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు త్వరలో తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.

31.గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే పీఎంపీలు, ఆర్‌ఎంపీలకు శిక్షణ, సర్టిఫికెట్ల జారీ.
32.ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటుకు ఆమోదం.
33.పవర్‌లూమ్ కార్మికుల వ్యక్తిగత రుణాలు రూ.6.50 కోట్లు మాఫీ.
34.వ్యవసాయ మార్కెటింగ్ చట్టం-1966, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ నిబంధనలు-1969లకు స్వల్ప మార్పులతో తెలంగాణ చట్టాలు.
35.షెడ్యూల్ 9లో పొందుపర్చిన 89 కార్పొరేషన్లకు తక్షణమే తెలంగాణ రాష్ట్రం పేరు జోడింపు.

36.గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవికి కర్నె ప్రభాకర్ ఎంపిక.
37.అసెంబ్లీకి ఆంగ్లో ఇండియన్ కోటాలో రాయిడిన్ రూచ్ నియామకం.
38.హైదరాబాద్, సైబరాబాద్‌లలో పోలీసులకు 3883 వాహనాల కొనుగోలుకు రూ.340 కోట్లు కేటాయిస్తూ చేసిన నిర్ణయానికి ఆమోదం. ఈ వాహనాలు నడిపేందుకు 3620 మంది డ్రైవర్లు, కానిస్టేబుళ్ల నియామకానికి అనుమతి.
39.డీఎస్పీలుగా పని చేస్తూ, రివర్టయినవారి గౌరవం కొనసాగించేందుకు 134 సూపర్ న్యూమరీ పోస్టుల కల్పన.
40.తెలంగాణ రాష్ట్రం కోసం ప్రభుత్వ నిర్వహణ నియమాలు, సచివాలయ నిబంధనల రూపకల్పన.
41.రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా కే రామకృష్ణారెడ్డి నియామకానికి ఆమోదం.
42. ఎస్టీలకు, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించే అంశాన్ని అధ్యయనం చేయడానికి సిటింగ్ జడ్జి నేతృత్వంలో రెండు వేర్వేరు కమిషన్లు.
43. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ చట్టం- 1966 సెక్షన్ 5కు సవరణ చేస్తూ తెలంగాణకు అనుగుణంగా చట్టం తీసుకురావడానికి ఆర్డినెన్స్.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి