గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 03, 2014

ఆజామాబాద్‌లో లీజు దందా...పారిశ్రామిక లక్ష్యానికి పాతర!

-పారిశ్రామిక లక్ష్యానికి పాతర
-ఇష్టారాజ్యపు లీజులతో లక్షల కైంకర్యం
-ఉమ్మడి రాష్ట్రంలో స్వాధీనానికి వెనుకడుగు.. నోటీసులుమినహా అడుగుపడని వైనం
-విచారణల్లో అక్రమాలు బయటపడ్డా మౌనం
-136.4 ఎకరాల్లో సగం అన్యాక్రాంతం.. 30 ప్లాట్ల జాడకూడా తెలియడం లేదట

రాజధాని నడిబొడ్డున కోట్లు విలువచేసే సర్కారు భూమి అక్రమార్కుల చేతిలో బందీగా పడిఉంది. పొగగొట్టాలు, సైరన్ మోతలు, వేలమంది కార్మికులతో కళకళలాడాల్సిన ఆ ప్రాంతంలో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది. ఏ నిషిద్ధ ప్రాంతమో.. సైనిక శిబిరమో అనిపించేలా తాళాలు వేసిన రేకుల గేట్ల ముందు గూర్ఖాల బూట్ల చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు. దశాబ్దాల క్రితం పరిశ్రమలు పెడతామని నమ్మబలికి లీజుల రూపంలో ఆ భూమిని ఆధీనంలోకి తీసుకున్నవారు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడిచారు. తమకేమాత్రం అధికారంలేని ఆ భూమిని తాతల సొమ్ములాగా ఇతరులకు లీజులకు ఇచ్చుకున్నారు. ఒకడికి ఒకడు లీజు.. వాడు ఇంకొకడికి లీజు! ఇలా ఎవడి చేతిల్లో ఏ భూమి ఉందో తెలియని పరిస్థితి! పరిశ్రమలు గాలికి పోయాయి. ఆశయాలు నీరుగారిపోయాయి. కబ్జాలు పెరిగి ముఫ్పైకి పైగా ప్లాట్ల జాడే తెలియడం లేదు. కనీసం 12 కంపెనీలు ఒక్కక్షణం కూడా కొనసాగే అర్హతను కోల్పోయాయని సర్కారే నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో పరాయి బాబుల పాలైన ఆ వందల కోట్ల విలువైన భూములన్నీ ఇపుడు విముక్తి కోసం ఎదురుచూస్తున్నాయి. 
నిజాం హయాంలో పురుడుపోసుకున్న ఆజామాబాద్ పారిశ్రామికవాడకు పరాయి పీడ పట్టింది. పరిశ్రమలు పెడతామని ప్రభుత్వం వద్ద లీజుకు స్థలాలు తీసుకున్న బడాబాబులు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. సబ్ లీజుల పేరుతో దందాలు చేసుకుంటున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి లక్షలు వెనుకేసుకుంటున్నారు. పరిశ్రమలు వదిలేసి కొందరు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే మరికొందరు రూ.వందల కోట్ల విలువైన స్థలాన్ని వదలబోమంటూ భీష్మించుకొని కూర్చున్నారు. కొందరు లబ్ధిదారులు వాణిజ్య కార్యకలాపాలను నిర్వర్తిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.

industry
నిబంధనలు పాటించని వారి లీజులను ఏనాడో రద్దు చేయాల్సి ఉన్నా బాధ్యుల ఉదాసీనతతో లక్ష్యం గాడి తప్పింది. మరోవైపు లీజు కాల వ్యవధి ముగిసిన తర్వాత వెనుకకు తీసుకోవాల్సి ఉన్నా ఒక్కటంటే ఒక్క ప్లాటుకూడా వెనుకకు తీసుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్ర సర్కారు పుణ్యమా అని కనీసం 30 ప్లాట్ల జాడకూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికారులు జరిపిన సర్వేలో 12 ప్లాట్లు తక్షణం వెనుకకు తీసుకోవాల్సి ఉంటుందని గుర్తించినా నాటి సర్కారు పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల మద్దతుతో యథేచ్ఛగా రాజ్యమేలిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ర్టావిర్భావంతో గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల అక్రమాలపై ఉక్కు పాదం మోపుతున్న నేపథ్యంలో తరువాతి వంతు ఎవరిదోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రభుత్వం నుంచి స్థలాలు పొంది వినియోగించని, దారి తప్పిన వాటిని రద్దు చేయాలని ఇప్పటికే సీఎం కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వం నుంచి అగ్గువకు భూములు పొంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై త్వరలోనే చర్యలు తప్పవని ప్రభుత్వ వ్యవహారశైలి స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ స్టేట్‌లో తొలి పారిశ్రామికవాడపై ఆసక్తికర చర్చ సాగుతున్నది. దేశంలో ఎవరూ ఆలోచన కూడా చేయని కాలంలో నిజాం రాజ్యంలో పరిశ్రమలకోసం ప్రత్యేకంగా ఓ వాడ పుట్టింది. రాజధాని నగరం పరిశ్రమలతో కళకళలాడాలని ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి దొరకాలనే ఆశయంతో ప్రభుత్వమే భూములిచ్చి పరిశ్రమలకు ఆహ్వానం పలికే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకంగా ఓ ఫండ్ ఏర్పరిచి అనేక వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించిన తరుణంలోనే పారిశ్రామిక వాడ ఆలోచన పుట్టింది. దీని కోసం సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు, ఎంసీహెచ్, సిటీ పోలీసు, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ అధికారులతో కూడిన కమిటీని పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించేందుకు నియమించింది. సదరు కమిటీ ఆజామాబాద్‌లో 134.4 ఎకరాలను గుర్తించింది. ఇండస్ట్రియల్ ట్రస్టు ఫండ్‌తో నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. ఈ స్థలాన్ని 86 ప్లాట్లుగా విభజించారు. 1952 డిసెంబరు 29న సిటీ ఇంప్రూవ్‌మెంట బోర్డు ఈ ఇండస్ట్రీయల్ ఏరియాను ఇండస్ట్రియల్ ట్రస్టు ఫండ్‌కు అప్పగించింది. ఆ తర్వాత పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని ముందుకొచ్చిన అనేక యాజమాన్యాలకు స్థలాలను లీజుకు ఇచ్చారు.

వివిధ పరిశ్రమలు...

పరిశ్రమలకు ఇచ్చిన స్థలాల్లో 500 గజాల నుంచి 14 ఎకరాల వరకు ఉన్నాయి. వీఎస్‌టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు 67,444.89 గజాలు(13.93 ఎకరాలు), అగర్వాల్ ఇండస్ట్రీస్‌కు 35,332.47 గజాలు(7.3 ఎకరాలు), హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌కు 18,870.78 గజాలు(3.899 ఎకరాలు), దయారాం సురాజ్‌మాల్ లాహోటి ఆయిల్ మిల్‌కు 17,133 గజాలు(3.54 ఎకరాలు), ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్‌కు 23,489 గజాలు(4.853 ఎకరాలు), బయోలాజికల్ ఈ లిమిటెడ్‌కు 18,825 గజాలు(4.254 ఎకరాలు), కున్ లిమిటెడ్‌కు 16,714 గజాలు(3.453 ఎకరాలు), యూసుఫ్ కంపెనీకి 11,304 గజాలు(2.336 ఎకరాలు) తదితర కంపెనీలకు కేటాయించారు. ఇలా స్థలాలు లీజుకు తీసుకున్న చాలా కంపెనీలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉల్లంఘించారు. ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా(టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్) యాక్ట్ 15/1992ను యథేచ్ఛగా ఉల్లంఘించినట్లు పరిశ్రమల శాఖ చెబుతోంది. ప్రభుత్వం నుంచి స్థలాలు పొందిన యాజమాన్యాలు పరిశ్రమలు పెట్టి స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఇతరులకు సబ్ లీజులకు, కిరాయికి ఇచ్చుకున్నారు. పారిశ్రామికవాడను గిడ్డంగులకు, వాణిజ్య కార్యకలాపాలకు, నివాస ప్రాంతాలకు వినియోగించారు. ఇప్పటికీ ఎన్‌కంబరెన్స్‌లో ఈ భూమి ఇండస్ట్రీయల్‌కు మాత్రమేనని స్పష్టంగా ఉంది.

కోర్టుకెక్కిన వ్యవహారం..

అక్రమాలకు పాల్పడ్డ కొందరు స్థలాలను కాజేసేందుకు ఇండస్ట్రీయల్ ఏరియా రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టుకెక్కారు. ఐతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇది లెజిస్లేచర్‌కు సంబంధించిన అంశంగా పరిగణించింది. మార్పులు చేర్పులు కూడా ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా గుర్తించింది. ఐతే సుప్రీం కోర్టు 2000లో ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా(టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్) యాక్ట్ నెం.1/2000లో కొన్ని మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికి అపాయింటెడ్ డేట్‌గా 2000 ఫిబ్రవరి 17 గా పేర్కొంది. దాని ప్రకారం లీజు ప్రకారం నడుస్తోన్న సంస్థలకు సదరు స్థలాలను మార్కెట్ ధరలో 75 శాతం తీసుకొని ఫ్రీహోల్డ్ రైట్స్‌ను కల్పించాలని, లేదంటే లీజును పునరుద్ధరించాలని సూచించింది. అయితే ఇది ఎవరైతే అప్పటికే నిబంధనలను ఉల్లంఘించారో వారికి మాత్రం వర్తించదు.

సర్కారు వెసులుబాటు జీవోలు..

ప్రభుత్వం దీని ఆధారంగానే జీఓ నెం.87 తేదీ.20/2/2002ను జారీ చేసింది. అలాగే అపాయింటెడ్ డేట్‌ను 17-02-2000గా నిర్ణయిస్తూ మరో జీఓ నెం.67ను విడుదల చేసింది. ఆ తర్వాత 2003లో ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియాకు కొంత వెసులుబాటును కల్పించింది. ఫ్రీహోల్డ్ రైట్స్ పొందడానికి ఫీజుల ఉపసంహరణ, ల్యాండ్ యూజ్ ఫీజు రద్దు, యూఎల్సీ యాక్ట్ నుంచి విముక్తి కల్పించింది. ఎవరైనా ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పితే ఏపీఐఐసీ స్థలాలకు 15 నుంచి 20 శాతం వరకు రాయితీని ప్రకటిస్తూ పరిశ్రమల శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. 2004లోనూ మరో వెసులుబాటుకు అవకాశం కల్పించారు. పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించే వాటికి లీజు మొత్తాన్ని రద్దు చేయడం, తరలించడానికి ఆసక్తి లేని కంపెనీలపై ప్రీమియంను పెంచాలని నిర్ణయించారు. అది గజానికి రూ.500 వరకు ఉంది. మళ్లీ లీజులు/ ఫ్రీహోల్డ్ పొందేందుకు 77 దరఖాస్తులు అందాయి.

దీనిపై ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. అపాయింటెడ్ డేట్ ప్రకారం దరఖాస్తులను పరిశీలించగా 77లో కేవలం 24 మాత్రమే ఫ్రీహోల్డ్‌కు అర్హత కలిగి ఉన్నాయి. ఐదు దరఖాస్తులను పూర్తిగా తిరస్కరణకు గురయ్యాయి. మిగతా వాటిపై నేటికీ సందిగ్ధత నెలకొంది. దరఖాస్తుల్లో తొమ్మిదింటిని ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఇవ్వకుండా పక్కకు పెట్టారు. 2007 ఫిబ్రవరి 20వ తేదీన పరిశ్రమల శాఖలో దీనిపై ఓ సమీక్షా సమావేశం జరిగింది. అందులో కొందరు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను స్థాపించి కొన్ని ఏళ్ల పాటు నడిపి, ఆ తర్వాత మూసేసినట్లు పేర్కొన్నారు. దీనికి రకరకాల కారణాలను అంచనా వేశారు. మార్కెటింగ్, టెక్కికల్, ఫైనాన్షియల్ సమస్యలను పారిశ్రామికవేత్తలు చూపించినట్లు చర్చించారు. దీని ప్రకారం కొందరు మళ్లీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎలాంటి అనుమతులను ప్రభుత్వం ఇవ్వలేదు.

12 కంపెనీలపై రెడ్ మార్క్..

ప్రభుత్వం నిర్ణయించిన అపాయింటెడ్ డేట్(తేదీ.17-02-2000) ప్రకారం ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియాలో ప్లాట్లు పొందిన 12 ప్రధాన కంపెనీలు నిబంధనల ప్రకారం నడుచుకోలేదని పరిశ్రమల శాఖ నివేదికను రూపొందించింది. వాటిలో హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ(ప్లాట్ నెం.22), దిగ్విజయ్ ఇండస్ట్రీస్(ప్లాట్ నెం.14/4), బిగ్ యాపిల్ కంప్యూటర్స్(శిదాత్‌రాయ్ గులాబ్ రాయ్) (ప్లాట్ నెం.3, 3/1, 3/7), యూసుఫ్ కంపెనీ (ప్లాట్ నెం.14/1, 24/2), జేపీ అండ్ కంపెనీ (ప్లాట్ నెం.17/1), శివదత్ రాయ్ భూర్మాల్ (ప్లాట్ నెం.13/4), ఇండియన్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ వర్క్స్ (ప్లాట్ నెం.18/2), కపాడియా ఇండస్ట్రీస్ (ప్లాట్ నెం.7/3), తారకప్రభు పబ్లికేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ప్లాట్ నెం.7/1), రాం కెమికల్స్ (ప్లాట్ నెం.15/4), వెనేస్కరణ్ ఇండస్ట్రీస్ (ప్లాట్ నెం.14/1, 24/2) ఉన్నాయి. వీటితోపాటు ఇంకా అనేక కంపెనీలు కూడా మార్గదర్శకాలను పాటించలేదని సమాచారం.లీజులు రద్దు చేసి స్థలాలను వాపసు తీసుకోవాల్సిన ప్లాట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని పరిశ్రమల శాఖ అభిప్రాయపడుతోంది.

అమ్మో ఆజామాబాదా..!

ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ కారిడార్ గురించి కనీసం చర్చించడానికి కూడా పరిశ్రమల శాఖ అధికారులు భయపడుతున్నారు. దీనిపై వివరాలు అడిగేందుకు టీ మీడియా ప్రయత్నించగా వామ్మో..! దాని గురించి మాట్లాడుకోవడం బాగుండదంటూ ముఖం చాటేశారు. ఏ అంశంపైనానైనా మాట్లాడొచ్చు. దాని గురించి పట్టించుకుంటే ఇంటికి పోవడమేనని అభిప్రాయపడుతున్నారు.ఈ వ్యవహారంలో అక్రమార్కులంతా బడాబాబులు, వారికి నాయకుల వత్తాసు ఉండడమే దానిక్కారణమని సమాచారం. ప్రభుత్వమే ప్రత్యక్ష్యంగా రంగంలోకి దిగితే తప్ప ఇక్కడి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తెలుస్తోంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి