గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 27, 2014

ఇండ్ల స్కాంపై కొరడా...!

-సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం
-ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో అవినీతిని తేల్చేందుకు..
-2004-14 మధ్య అవకతవకలపై దర్యాప్తు
-త్వరలో బోగస్ రేషన్ కార్డులపైనా విచారణ!
-2006-14 మధ్య 22.40 లక్షల గృహాలపై స్పష్టత లేదు
-బాధ్యులైన 490మంది అధికారులపై గత ప్రభుత్వ వేటు
-తెలంగాణ ఏర్పడినంక 593 గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు
-రూ.235 కోట్లు దుర్వినియోగం అయ్యాయని తేలింది
-36వేల ఇండ్లు కట్టకుండానే లెక్కల్లో చూపించారు
-2008-09లోనే 75శాతం అవినీతి జరిగింది
-రూ.5500 కోట్లు ఇస్తే.. మంజూరైన ఇండ్లు13లక్షలే
-అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్
indirammaఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో వివిధ రంగాల్లో జరిగిన అక్రమాలపై విచారణలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో బలహీనవర్గాల గృహనిర్మాణ పథకంలో జరిగిన భారీ అవకతవకలపై సీఎం కే చంద్రశేఖర్‌రావు సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో రెండు మూడు రోజుల్లో బోగస్ రేషన్ కార్డుల విషయంలోనూ ప్రభుత్వం విచారణకు ఆదేశించనున్నట్లు తెలుస్తున్నది. ఇండ్ల నిర్మాణంలో అవినీతిపై సీఎం కేసీఆర్ తన చాంబర్‌లో శనివారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. 36వేల ఇండ్లు నిర్మించకుండానే నిర్మించినట్టు తప్పుడు లెక్కలు చూపించినట్టు అధికారుల విచారణలో తేలిందన్న సీఎం.. 2004 నుంచి 14 వరకు జరిగిన అవకతవకల్లో వందల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందని చెప్పారు. 

గృహ నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డ అధికారుల్లో 490 మందిని గత ప్రభుత్వ హయాంలోనే సస్పెండ్ చేశారని, మరో 285 మంది డిస్మిస్ అయ్యారని తెలిపారు. ఇదే విషయంలో పలువురు నాయకులపై కూడా కేసులు పెట్టారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. గృహనిర్మాణంలో రూ.235 కోట్లు దుర్వినియోగం అయినట్లు తేలిందని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అవినీతి ఇంకెంత స్థాయిలో ఉంటుందోనని సీఎం విస్మయం వ్యక్తం చేశారు. గతంలోనే ఈ వ్యవహారాలను శాసనసభ దృష్టికి తెచ్చి, విచారణ జరపాలని డిమాండ్ చేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 99శాతం మందికి ఇండ్లు కట్టిచ్చినట్టు లెక్కలు చూపించినా, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. 2006-14 మధ్య 22.40 లక్షల ఇండ్లపై స్పష్టత లేదని చెప్పారు. ఒక్క 2008-09 మధ్యే 75శాతం అవినీతి జరిగిందని తెలిపారు. ప్రభుత్వం రూ.5500 కోట్లు విడుదల చేస్తే 13 లక్షల ఇండ్లు మాత్రమే నిర్మితమయ్యాయని చెప్పారు.

ఆదిలాబాద్ నియోజకవర్గంలో 45వేల ఇండ్లు, మంథని నియోజకవర్గంలో 41,099 ఇండ్లు, కొడంగల్ నియోజకవర్గంలో 32,337 ఇండ్లు, పరిగిలో 30,416 ఇండ్లు కట్టినట్టు లెక్కలు చూపుతున్నా వాస్తవ లబ్ధిదారులు అంత సంఖ్యలో లేరని ప్రభుత్వాధికారుల తనిఖీల్లో తేలిందని సీఎం కుండబద్దలు కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవి మాత్రమే కాకుండా మరో 4.60 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని లెక్కలు చెప్తున్నారని సీఎం తెలిపారు. ఒక్క గృహ నిర్మాణంలో కాకుండా పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్‌కార్డుల్లో కూడా భయంకరమైన అవినీతి, అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మొత్తం అవినీతి వ్యవహారాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలా చేయకపోతే అసలైన లబ్ధిదారులకు న్యాయం జరుగదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా కట్టదల్చుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో ఇలాంటి అవతవకలు జరుగకుండా జాగ్రత్తపడాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 83.59 లక్షల కుటుంబాలకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వంలోని 4లక్షల మంది ఉద్యోగుల ద్వారా కేవలం ఒకే రోజులో సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఆగస్టు 1న రెవెన్యూ అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని ప్రకటించారు.

నేడో రేపో బోగస్ కార్డులపైనా..

రెండు మూడు రోజుల్లో బోగస్ రేషన్‌కార్డుల వ్యవహారంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే రకమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఏండ్లుగా బోగస్ కార్డుల జారీ జరిగిందని, వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రభుత్వం భావిస్తున్నది. నిజమైన లబ్ధిదారులకే రేషన్ కార్డు ప్రయోజనాలు అందాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. బోగస్ కార్డులను సరెండర్ చేయాలన్న ప్రభుత్వ హెచ్చరికతో ఇప్పటికే దాదాపు 2లక్షల కార్డులను సరెండర్ చేశారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 84,20,662 లక్షల కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు 1,47,02,479 ఉన్నాయి. అయినప్పటికీ చాలా మందికి రేషన్‌కార్డులు లేవు. అంటే రేషన్‌కార్డుల జారీలో అవకతవకలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఏటా ప్రభుత్వం 1800 కోట్లు ఖర్చు చేస్తున్నది. జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లోకి వస్తే మరో వెయ్యి కోట్ల వరకూ ప్రభుత్వంపై భారం పడనుంది. ఈ నేపథ్యంలో బోగస్ కార్డులను ఏరివేసి, నిజమైన లబ్ధిదారులకు న్యా యం చేసేలా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. బోగస్‌కార్డులను ఏరివేస్తే ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. వృథాపోతున్న వ్యయాన్ని నియంత్రించుకోవడం ద్వారా ఖజానాపై భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇదే అంశంపై ఇటీవల పౌర సరఫరాల శాఖ సమీక్షా సమావేశంలో చర్చించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి