గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 04, 2014

పట్టణ గృహనిర్మాణ ప్రాజెక్టు పీ వో బాధ్యతల్లో ఆంధ్రాకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్!

-రంగారెడ్డి జిల్లాలో 12 ఏండ్లుగా కొనసాగుతున్న తంతు
-ప్రాజెక్టు ఆఫీసర్‌గా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి పోస్టు
-ఉన్నతాధికారులపై పెత్తనం.. అప్పనంగా కోట్లు మెక్కుతున్న వైనం!

ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉన్న ఉద్యోగి.. ఎనిమిది నెలలు తిరిగేసరికి జిల్లాస్థాయి అధికారిగా అవతారమెత్తిన వైనమిది. వడ్డించేవాడు మనవాడైతే...అన్న చందంగా ఉన్నతాధికారులు తమ ప్రాంతంవారే కావడంతో ఓ సీమాంధ్ర వ్యక్తి.. నిబంధనలకు విరుద్ధంగా అందలమెక్కాడు. ఉన్నతాధికారులను బుట్టలో వేసుకొని.. 12 ఏండ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. కంప్యూటర్ ఆపరేటర్ నుంచి రంగారెడ్డి జిల్లాలో పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టు అధికారిగా రూపాంతరం చెందిన జే శ్రీనివాస్‌రెడ్డి బాగోతాన్ని వింటే ఎవరైనా ఔరా అనక తప్పదు!!.. కోస్తాంధ్రకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి 2001లో ఔట్‌సోర్సింగ్ ద్వారా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్‌లోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరాడు. 8 నెలలపాటు అదే ఉద్యోగంలో పనిచేశాడు. అతడి పనితీరును గుర్తించిన జిల్లా అధికారులు రాజేంద్రనగర్ డివిజన్ నుంచి రాజీవ్ గృహకల్ప రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. రాజీవ్ గృహకల్పలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరి కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు.

ఈ క్రమంలో 2001లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ పేదలకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లకు ఈ పథకం భారంగా మారుతుందన్న ఉద్దేశంతో.. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు గృహ నిర్మాణ ప్రాజెక్టులను రూపొందించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి ఈ ప్రాజెక్టుల రిపోర్టులను ఎప్పటికప్పుడు అందిస్తూ.. వారిని బుట్టలో వేసుకున్నాడు. దీంతో 2001లో అప్పటి కలెక్టర్ సూచనల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్.. శ్రీనివాస్‌రెడ్డికి రంగారెడ్డి జిల్లా పట్టణ హౌజింగ్ ప్రాజెక్టు బాధ్యతలను అప్పగించారు. అప్పటినుంచి జిల్లాలో రాజీవ్ గృహకల్ప, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (వైఏఎంబీఏవై), జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ పునరావాస మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) పథకాల కింద చేపట్టే గృహ నిర్మాణ పథకాల బాధ్యతలను నిర్వహిస్తూ.. జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌గా చలామణి అవుతున్నాడు. కంప్యూటర్ ఆపరేటర్‌గా రూ. 7వేలు వేతనం పొందిన శ్రీనివాస్‌రెడ్డి 12 ఏండ్ల నుంచి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ హోదాలో రూ. 40 వేల వేతనం అందుకుంటున్నాడు. వాహనం అలవెన్సుల కింద నెలకు మరో రూ.25 వేలు రాజీవ్ గృహకల్ప నుంచి అందుతున్నాయి. ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి నెలకు రూ.40వేల వేతనంతోపాటు అలవెన్సులు ఇవ్వడం, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక ప్రత్యేక గది వంటి వసతులు కల్పించడంపై తెలంగాణ హౌజింగ్ శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధం:

రాష్ట్రంలో ఎక్కడైనా పట్టణ గృహనిర్మాణ పథకాన్ని గృహనిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ) పర్యవేక్షిస్తారు. పలు పథకాల్లో లబ్ధిదారుల జాబితాను పీడీ రూపొందిస్తే.. కలెక్టర్ ఆమోదించి.. వారికి ఇళ్లు మంజూరు చేస్తారు. కానీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారుల ఎంపిక కొనసాగింది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టును సృష్టించి దానిలో ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని నియమించారు. జిల్లాస్థాయి అధికారి అయిన పీడీతో సంబంధం లేకుండా అతను నేరుగా లబ్ధిదారులను ఎంపికచేసి నేరుగా కలెక్టర్‌కు జాబితాను పంపి మంజూరు చేయించుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. కాగా, శ్రీనివాస్‌రెడ్డి 12 ఏండ్లుగా కేటాయించిన గృహాలు, వాటి చెల్లింపులపై విచారణ జరిపించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి