గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 08, 2014

లోకాయుక్త చెప్పినా కదలని అధికారులు...!

-ఎగవేస్తే ఏందట!
-సీమాంధ్ర అక్రమ మైనింగ్‌పై అంతా గప్‌చుప్
-రూ.32 కోట్లు ఎగవేసినా చర్యలు శూన్యం
-పోయేది తెలంగాణ సొమ్మేగా?
-పోతూపోతూ తెలంగాణ ఆదాయానికి గండిపెట్టిన సీమాంధ్ర మంత్రి
-సొంత సామాజికవర్గ కంపెనీకి భారీగా మేలు
-అక్రమ మైనింగ్‌లో రికవరీపై స్టే
-స్టే ఎత్తివేసి సొమ్మును రాబట్టాలని ఆదేశించిన లోకాయుక్త
-ఆదేశాలు వచ్చి నెలయినా పట్టించుకోని అధికారులు

సీమాంధ్ర మైనింగ్ బాబులు తెలంగాణను అడ్డంగా దోచుకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో వారు ఇష్టారాజ్యంగా మైనింగ్ చేసి నిబంధనలకు గండి కొడుతుంటే నోట్లో వేలేసుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో ఒక్క రాక్‌శాండ్ సంస్థనే మైనింగ్ చేసి ప్రభుత్వానికి రూ. 32.84 కోట్లు ఎగవేసింది. చివరకు ఈ వ్యవహారాలపై మండిపడ్డ లోకాయుక్త.. వారి ఆగడాలను అరికట్టేందుకు ఆదేశాలు ఇచ్చినా అధికారుల్లో చలనం రావడంలేదు. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయల గండి పడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సాగిన దోపిడీ స్వరాష్ట్రంలో కూడా కొనసాగడంపై తెలంగాణ వాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మాస్త్రంలాంటి ఆదేశాలను లోకాయుక్త ఇచ్చినా కదలిక లేని అధికారులను దుమ్మెత్తిపోస్తున్నారు.

mining
లోకాయుక్త దృష్టికి..

ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలైంది. దీనిపై లోకాయుక్త విచారణకు ఆదేశించారు. లోకాయుక్తకు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం రాక్‌శాండ్ మినరల్స్ రూ.32.84 కోట్లు ఎగవేసినట్లు వెల్లడైంది. మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు కంపెనీపై చర్యలకు ఆదేశించినా క్షేత్రస్థాయి అధికారి ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామూల్ జాకబ్ ఈ కంపెనీకి ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించారని బయటపడింది. దీని ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలో నష్టం వాటిల్లింది. ఇక ఈ కంపెనీ శంషాబాద్ ఎయిర్ పోర్టు అథారిటీ పరిధిలో కూడా కొంత మైనింగ్ కార్యకలాపాలు చేస్తున్నది. ఇందుకు నిబంధనల ప్రకారం హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఆ ఆనవాయితీ కూడా పాటించలేదు. ఇక అగ్రిమెంటు ప్రకారం 248 సర్వే నంబర్‌లోని 8 ఎకరాల బిట్‌లో 1,84,922 క్యూబిక్ మీటర్లు మాత్రమే మైనింగ్ చేయాల్సి ఉండగా 8,52,913 క్యూబిక్ మీటర్లు అక్రమంగా మైనింగ్ చేశారు. ఇదే సర్వే నంబర్‌లోని 15 ఎకరాల బిట్‌లో 1,86,756 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ ఉంటే 3,72,929 క్యూబిక్ మీటర్లు అక్రమంగా మైనింగ్ చేశారు. మైనింగ్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు గీర్మాపూర్‌లోని ఈ సంస్థ క్వారీకి చెందిన చాలానా పుస్తకాలు 47,148,149లను పరిశీలించి అక్రమంగా కార్యకలాపాలు చేశారని ప్రభుత్వ అధికారులు నిర్దారించారని నివేదికలో పేర్కొన్నారు.

సీమాంధ్ర మంత్రి ఘనకార్యం...

అయితే ఈ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యవహారం అంతకు ముందే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి రాగా రాక్‌శాండ్ మినరల్ సంస్థ అక్రమ కార్యకలాపాలు చేసినందున మొత్తం రికవరీ వెంటనే చేయాలని ఈ శాఖ డైరెక్టర్ ఆదేశించారు. అయితే ఆనాడు మైనింగ్ శాఖ మంత్రిగా సీమాంధ్రకు చెందిన గల్లా అరుణకుమారి ఉన్నారు. తన సొంత సామాజికవర్గానికే చెందిన ఈ కంపెనీ యజమానులకు మేలు చేసేలా ఆమె తన అధికారాన్ని ఉపయోగించి అధికారులు ఇచ్చిన రికవరీ ఆదేశాలపై స్టే ఇచ్చారు. నాలుగు రోజులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడనున్నందున పోతే తెలంగాణ సొమ్మేగా అన్నట్టు నిరంతరాయంగా దోచుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు.

ఫలితంగా కోట్లాది రూపాయల విలువైన భూగర్భ సంపద కొల్లగొట్టబడింది.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా సీమాంధ్రుల దోపిడీ ఆగలేదు. ఆ అక్రమార్కులను కాపాడడానికి సీమాంధ్ర ప్రభుత్వం ఇచ్చిన స్టే ఆర్డర్‌ను లోకాయుక్త తప్పు పట్టింది. వెంటనే స్టే ఎత్తివేసి, ఎగవేసిన సొమ్మును రికవరీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సదరు సంస్థ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని కూడా ఆదేశించింది. సర్కారు భారీ ఎత్తున ఆదాయాన్ని ఎగవేసిన రాక్‌శాండ్‍కు కొత్త మైనింగ్ లీజులు ఇవ్వవద్దని ఆదేశించింది. కంపెనీ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయించాలని, సహకారం అందించిన అందరు అధికారులపై చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వీటన్నింటిపైన తమ ఆదేశాలపై చేపట్టిన చర్యలపై పూర్తి స్థాయి నివేదికను జూలై 22వ తేదీలోగా ఇవ్వాలని ఆదేశించింది. లోకాయుక్త ఆదేశాలు వెలువడ్డ రెండు రోజులకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

అధికారులు కదుల్తారా?..

అయితే ఆదేశాలు వచ్చిన నెల రోజులు దాటినా అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అసలు ఎగవేసిన సొమ్మును వసూలు చేస్తారా? అన్న సందేహాలు తెలంగాణ వాదుల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సర్కారుకు ఆదాయం రాబట్టాలని ఫోరమ్ ఫర్ రూల్ ఆఫ్ లా, తెలంగాణ యువశక్తి పార్టీ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది, లోకాయుక్త పిటిషనర్ బీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ అక్రమదారులపై తెలంగాణ ప్రభుత్వం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను దోచుకునే వారిని ఏమాత్రం ఉపేక్షించవద్దన్నారు.

ఎక్కడిదీ రాక్‌శాండ్?

కృష్ణా జిల్లాకు చెందిన పీ పూర్ణచంద్ అనే వ్యక్తి ఎండీగా ఉన్న కంపెనీ రాక్‌శాండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ కంపెనీకి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కొంగరకలాన్‌కు చెందిన సర్వేనంబర్ 300లో 7 ఎకరాల 20 గుంటలు, సర్వేనంబర్ 300/1లో 7 ఎకరాల 20 గుంటల భూమిలో క్వారీ నిర్వహించడానికి లీజుకు ఇచ్చారు. ఇదే తీరుగా మేడ్చల్ మండలం బండమేడారం 248 సర్వేనంబర్‌లో ఒకచోట 15 ఎకరాలు, మరోచోట 8 ఎకరాల భూమి, ఇదే మండలానికి చెందిన గీర్మాపూర్ రెవెన్యూ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 345లో 19 ఎకరాల 20 గుంటల భూమిని సీమాంధ్ర సర్కారు లీజుకు ఇచ్చింది. అధికారం వారిది. సర్కారు వారిదన్నట్టు అంతా ఇష్టారాజ్యంగా ఆగమేఘాల మీద సాగిపోయింది. లీజు అగ్రిమెంట్ల ప్రకారం ఎంత మైనింగ్ చేస్తే ఆంత రాయల్టీ (సీవరేజి ఫీజు) ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ఈ కంపెనీ వారు అక్రమ పద్ధతుల్లో మైనింగ్ చేపట్టారు. దానికితోడు కోట్ల రూపాయల మేర ఫీజులు ఎగ్గొట్టారు. అయినా నాటి ఉమ్మడి సర్కారు వారికి అభయమిచ్చింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి