శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంలో ఆంధ్రబాబుల దొంగేడుపును కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కే పండిట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కళ్లకు కట్టినట్లు వివరించారు. రాష్ట్రం విడిపోయినా వాళ్లు సాగిస్తున్న జలదోపిడీని ఆధారాలతోసహా బయటపెట్టారు. నీటి విషయంలో రాజీపడేది లేదని.. తమ హక్కులను కాపాడాలని కోరారు. సోమవారం సచివాలయంలో పండిట్‌తో సమావేశమైన కేసీఆర్.. సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్లు నదీ జలాల విషయంలో తెలంగాణ తీవ్ర అన్యాయానికి, దోపిడీకి గురైందని తెలిపారు.
-రాష్ట్రం విడిపోయినా ఆగని ఆంధ్ర అకృత్యాలు
-ఆంధ్రబాబులది దొంగేడుపే..
-నిబంధనల ప్రకారమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి
-మా హక్కులను కాపాడండి
-కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కే పండిట్‌తో సీఎం కేసీఆర్
-నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని పండిట్ హామీ
ఆంధ్ర నేతల జలదోపిడీని అరికట్టి తెలంగాణకు న్యాయంచేయాలని పండిట్‌ను సీఎం కేసీఆర్ కోరారు. కృష్ణానదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు నాగార్జునసాగర్ నుంచి పోతిరెడ్డిపాడు వరకు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. ఆంధ్ర పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రజలు వెలకట్టలేనన్ని త్యాగాలు చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నారని.. అందుకే చంద్రబాబునాయుడు కక్ష పెంచుకొని, తెలంగాణలో ఏర్పడిన తొలి ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.-ఆంధ్రబాబులది దొంగేడుపే..
-నిబంధనల ప్రకారమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి
-మా హక్కులను కాపాడండి
-కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కే పండిట్‌తో సీఎం కేసీఆర్
-నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని పండిట్ హామీ
తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ.. నీళ్లు, కరెంట్ విషయంలో నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణచట్టం ప్రకారం తెలంగాణకు 54 శాతం విద్యుత్ రావాల్సి ఉన్నా దానిని చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. సీలేరు నుంచి కరెంట్ ఇవ్వడం లేదని, ఈ విషయంలో సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.
గోదావరి రివర్ బోర్డు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెప్పినా చంద్రబాబు సీలేరు కరెంట్ ఇవ్వలేదన్నారు. కృష్ణపట్నంలో తెలంగాణ జెన్‌కో, డిస్కంలు రూ.1050 కోట్ల పెట్టుబడి పెట్టాయని, 54 శాతం విద్యుత్ తెలంగాణకు రావాలన్నారు. అయినా బాబు కరెంట్ ఇవ్వకపోగా హిందూజా నుంచి కూడా విద్యుత్ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇన్ని కుట్రలతో తెలంగాణకు కరెంట్ రాకుండా చేయడం వల్లే విద్యుత్ కొరత ఏర్పడిందని, ఈ క్రమంలో రైతులను ఆదుకొనేందుకే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం అనివార్యమయిందని ముఖ్యమంత్రి కేసీఆర్.. పండిట్‌కు వివరించారు.
నిబంధనలు అధిగమించలేదు
శ్రీశైలంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నందుకే విద్యుత్ ఉత్పత్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. రిజర్వాయర్‌లో 857 అడుగుల వరకు నీరు ఉన్నప్పటికీ అడుగంటుతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పండిట్‌కు తెలిపారు. ఈ సందర్భంగా జీవోలు 69, 107, 233ల గురించి కేసీఆర్ ప్రస్తావించారు.
వీటి ప్రకారం 834 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు. ఇన్ని జీవోలు ఉన్నప్పటికీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న తొమ్మిదేండ్లలో ఏనాడు నిబంధనలు పట్టించుకోలేదని, ఏ ఒక్క ఏడాది కూడా 834 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించలేదని ఆధారాలతో సహా ఆయన ముందుంచారు. 750 అడుగుల వరకు నీటిని వాడుకున్న విషయాన్ని కూడా పండిట్ దృష్టికి తెచ్చారు. బాబు అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అవసరాల మేరకు ఎంత నీటినైనా వాడుకున్నారని, తాము ఇప్పుడు నిబంధనల మేరకే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా గగ్గోలు పెడుతున్నారని కేసీఆర్ వివరించారు. కృష్ణానది జలాల దోపిడీ విషయంలో కూడా బోర్డు కచ్చితంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరారు.
మొదటి నుంచి కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు ఎలా అన్యాయం జరుగుతుందో కూడా సమావేశంలో వెల్లడించారు. నాగార్జునసాగర్ అసలు పేరు నందికొండ ప్రాజెక్టు అని, ఇప్పుడున్న ప్రాజెక్ట్ కన్నా 19 కిలోమీటర్ల ఎగువన నిర్మించడానికి మొదట ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. కానీ సమైక్య రాష్ట్రంలో కేటాయింపులు, ప్రాజెక్ట్ డిజైన్ మార్చి తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పారు. మొదట తెలంగాణకు 160 టీఎంసీలు, ఆంధ్రకు 80 టీఎంసీలు కేటాయించగా.. చివరికి తెలంగాణకు 25 టీఎంసీలు కూడా దక్కే అవకాశం లేకుండా చేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇక సాగర్ ఎడమ కాలువ నిర్మాణం మొదట ఇల్లెందు, గార్ల దాకా చేయాలని నిర్ణయించినప్పటికీ చివరికి ఆ కాలువ పాలేరు రిజర్వాయరు వద్దకే చేరిందన్నారు. అక్కడి నుంచి కృష్ణా నీటిని మళ్లీ ఆంధ్రకే తరలించడానికి కుట్ర చేశారని తెలిపారు.
జల దోపిడీ ఆగలేదు
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆంధ్ర సర్కారే అక్రమంగా నీటిని వాడుకుంటున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలుగుగంగ ద్వారా 15 టీఎంసీలు, శ్రీశైలం కుడి కాలువ ద్వారా 19 టీఎంసీలు మాత్రమే వాడుకునే హక్కు ఉన్నప్పటికీ దాదాపు 338 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనువైన రిజర్వాయర్లను నిర్మించుకున్నారని, పోతిరెడ్డిపాడు ద్వారా జలదోపిడీ యథేచ్ఛగా సాగుతున్నదన్నారు.
తెలంగాణలో జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, ఆర్డీఎస్‌లాంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని, అదే ఆంధ్రలో మాత్రం ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకున్నా ప్రాజెక్టులు పూర్తయ్యాయని పండిట్‌కు చెప్పారు.
ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల కృష్ణా నీటిలో తెలంగాణకు ఉన్న వాటాను వినియోగించుకోలేకపోతున్నామని సీఎం వివరించారు. కృష్ణానది జలాల్లో కేటాయింపుల్లోనే అన్యాయం జరిగిందని, బచావత్ ట్రిబ్యునల్‌లో తెలంగాణ వాదనలు వినిపించే అవకాశం కూడా రాలేదని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే తెలంగాణకు ఇప్పుడైనా న్యాయం చేయాలని ఎస్కే పండిట్‌కు విజ్ఞప్తిచేశారు. 29న కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరుగుతున్నందున తెలంగాణకు జరిగిన అన్యాయంపై సవివరంగా చర్చించాలని కోరారు. రాష్ట్రం తరఫున బోర్డు సమావేశానికి సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్‌రావు హాజరవుతారని సీఎం తెలిపారు. సాగర్ పూర్తి స్థాయిలో నీటిపారుదల ప్రాజెక్టు అయితే, శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు అని.. దీనికనుగుణంగా నీటి వాడకం విషయంలో కచ్చితమైన ఆపరేషన్ రూల్స్ రూపొందించాలని కోరారు.
మా హక్కులు కాపాడండి
శ్రీశైలంలో నీటిని వాడుకొనే, విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే హక్కు తెలంగాణకు ఉందని.. ఈ హక్కును కాపాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణానది యాజమాన్యబోర్డు చైర్మన్ పండిట్‌ను కోరారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాగిందని, అలాంటిది నీటి విషయంలో తాము రాజీపడే ప్రశ్నేలేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. శ్రీశైలం నీటి వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలన్నీ తప్పని, ఇదే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2002 సంవత్సరంలో హైకోర్టులో సమర్పించిన రిట్ పిటిషన్‌లో నీటి వాడకం విషయంలో ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉందని చెప్పిన విషయాన్ని కేసీఆర్.. పండిట్ దృష్టికి తీసుకువచ్చారు.
ముఖ్యమంత్రి చెప్పిన విషయాలన్నీ సావధానంగా విన్న పండిట్.. బోర్డు సమావేశంలో ఈ అంశాలన్నింటినీ తప్పకుండా చర్చించి, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి