గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 04, 2015

"మనసు చంపుకొని పనిచేస్తున్నం!" - ఏపీలోని టీఉద్యోగుల గోడు

- ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల గోడు.. ఉమ్మడి రాష్ట్ర పాపాలకు బలి
- స్టేట్ క్యాడర్.. మల్టీజోనల్‌గా పరిగణన
- రాష్ట్రపతి ఉత్తర్వులనే మార్చిన వైనం
- ఏపీలో ఇరుక్కుపోయిన ఉద్యోగులు
- ప్రభుత్వం దృష్టి పెట్టాలని వినతి


తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి ఏడాది దాటుతున్నా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల కష్టాలు తీరడం లేదు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఏర్పడిన ప్రతిష్టంభన వారిలో అంతులేని నైరాశ్యాన్ని నింపుతున్నది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నపుడు రాష్ట్రపతి ఉత్తర్వులకు వక్రభాష్యం పలికి చేసిన పోస్టింగులు ఇపుడు ఏపీలో పనిచేసే తెలంగాణ ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించాయి. ఓపెన్ క్యాటగిరీ మాత్రమే కాకుండా జోనల్ నియామకాలు పొందిన వారు సైతం ఈ ఉల్లంఘనల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అధికారులు కూడా ఆంధ్రలో పోస్టింగుల కారణంగా మానసికంగా సతమతమవుతున్నారు. కొందరు మనసు చంపుకుని పనిచేయలేక దీర్ఘకాల సెలవులో వెళ్లిపోయారు. 


మిగిలిన వారు అక్కడ భయంభయంగా రోజులు లెక్కపెట్టుకుంటూ పని చేస్తున్నారు. కమల్‌నాథన్ కమిటీకి ఎన్ని విన్నపాలు చేసినా బధిర శంఖారావంలాగా మిగిలిపోతున్నది. ఓపెన్ క్యాటగిరీ విషయం అలా ఉంటే మిగిలిన క్యాడర్ విషయంలోనూ ఇటు తెలంగాణ జిల్లాల్లో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులు, అటు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే తెలంగాణ ఉద్యోగులు స్వరాష్ర్టాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నా కమల్‌నాథన్ కమిటీ పట్టించుకోవడంలేదు. 


రాష్ట్రపతి ఉత్తర్వులకే పంగనామాలు..


ఉమ్మడి రాష్ట్రం ఉనికిలో ఉన్నపుడు కొన్ని శాఖల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను ఏకపక్షంగా మార్చారు. కార్మిక శాఖలో లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పోస్టును లోకల్ క్యాడర్‌గా పేర్కొంటూ మల్టీజోన్ పోస్టుగా నోటిఫై చేశారు. ఆ తర్వాత దాన్ని లేబర్ ఆఫీసర్‌గా మార్చారు. దానికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేశారు.


కానీ రాష్ట్రపతి అనుమతి తీసుకోలేదు. అలాగే రాష్ట్ర స్థాయి పోస్టుగా ఉన్న సహాయ కార్మిక కమిషనర్ పోస్టును మల్టీ జోనల్ స్థాయి పోస్టుగా చూపారు. దీనిపై కార్మిక శాఖ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే సుదీర్ఘ విచారణ తర్వాత ఎలాంటి ఆమోదం లేకుండా చేసిన మార్పులు చెల్లవని తీర్పు వెలువడింది. అయినా 2013 నుంచి ఎలాంటి సమీక్ష జరుగలేదు. ఇప్పుడు కొనసాగుతున్న విభజన ప్రక్రియలోనూ సహాయ కార్మికశాఖ కమిషనర్ పోస్టును మల్టీ జోనల్ పోస్టుగానే పరిగణిస్తున్నారు. దాంతో ఏపీలో పని చేస్తోన్న నలుగురు తెలంగాణ అధికారులు అక్కడే ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. 


ఇవీ సమస్యలు...


- సమాచార శాఖలో ఓ అధికారి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆయనను వైజాగ్‌కు బదిలీ చేశారు. ఇపుడు రాష్ట్రం వచ్చింది. అయితే ఆయన పోస్టింగ్ అక్కడే ఉంది. దానితో మనసు చంపుకొని అక్కడ పని చేయలేక ఏడాదిగా విధులకు గైర్హాజరు అవుతున్నారు. కమల్‌నాథన్ కమిటీ ఎటూ తేల్చడం లేదు. ఆంధ్రా సర్కారు రిలీవ్ చేయడం లేదు. దాంతో జీతంభత్యం లేక ఆర్థికంగా చతికిలపడ్డారు. 


కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరుగు రాష్ట్రంలో పని చేయనని భీష్మించారు. ఆయన భార్య తోటి అధికారులకు ఫోన్లు చేసి మా భర్త పరిస్థితి ఏమిటంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. దీనికి కారణం.. ఓపెన్ కేటగిరిలో ఉద్యోగాన్ని పొందడమే. అప్పట్లో 5, 6 జోన్లల్లో ఖాళీలు లేవని ఒకటో జోన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. జోనల్ స్థాయి పోస్టులపై ప్రభుత్వం గానీ, కమల్‌నాథన్ కమిటీ గానీ దృష్టి పెట్టలేదు. 


-మరో ఉద్యోగిది ఇంకో సమస్య. ఆయన చేసేది స్టేట్ క్యాడర్ పోస్టు. కానీ సమైక్య రాష్ట్రంలో సదరు పోస్టును మల్టీజోనల్ పోస్టుగా చూపారు. దాంతో కమల్‌నాథన్ కమిటీ దృష్టి సారించడం లేదు. కార్పొరేషన్ల విభజన పర్వంలో రెండు రాష్ర్టాల మధ్యన పచ్చగడ్డి భగ్గుమనే పరిస్థితుల్లో అక్కడే పని చేయా ల్సి వస్తోంది. ఇంకెన్నాళ్లు తానిక్కడ పని చేయాలో అంతుచిక్కని దీనస్థితిని తోటి అధికారులతో చెప్పుకొని బాధ పడుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్షణం కూడా అక్కడ పని చేయడం ఇష్టం లేదు. కానీ క్షణమొక యుగంగా వెళ్లదీస్తున్నారు. 


-మరో అధికారిది వేషం, భాష.. వ్యవహారం అన్నీ తెలంగాణ. ఉద్యమంలోనూ భాగస్వామి. కానీ ఆయనదీ ఇదే దుస్థితి. ఓపెన్ కేటగిరిలో ఉద్యోగం సంపాదించారు. 5, 6 జోన్లల్లో ఖాళీలు లేవని నాల్గో జోన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా ప్రభుత్వం అతడిని అక్కడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్యన పని చేసే పోస్టింగ్ ఇవ్వడంతో దిక్కుతోచని స్థితి. కానీ కుటుంబం గడవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకొని భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. 


ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగమే శాపమా!..


తెలంగాణకు చెందిన వారు ఉద్యోగాలు పొందడమే గగనం. అలాంటి కాలంలో ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం పొందిన వారికి ఇపుడు అదే శాపంగా పరిణమించింది. ఇక్కడ ఖాళీలు లేవన్న నెపంతో 1, 2, 3, 4 జోన్లల్లో పోస్టులు ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పని చేయాలన్న ఆకాంక్ష ఉంది. అలా 15 వేల మంది వరకు ఆంధ్రాలో పని చేస్తున్నారు. తెలంగాణలో దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వారు, ఓపెన్ లేదా నాన్‌లోకల్ కింద 1.40 లక్షల మంది వరకు పని చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. 


అక్కడ పని చేసే తెలంగాణ వారందరూ ఇక్కడికి, ఇక్కడ పని చేసే ఆంధ్రా వారు అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేసే సీమాంధ్ర వారు తప్ప తెలంగాణ మిగతా జిల్లాల్లోని ప్రాంతేతరులంతా వారి స్వస్థలాలకు వెళ్తామని వారి సర్కారుకు మొర పెట్టుకున్నారు. కానీ ఏపీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు తెలంగాణ ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.వందల కోట్ల భారం పడుతున్నది. స్థానికత ఆధారంగా ఎక్కడివారిని అక్కడికి బదిలీ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి