గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 22, 2014

దర్గా భూములపై కబ్జా పడగ!

-జూబ్లీహిల్స్‌లో సీమాంధ్రుల బాగోతం
-323 ఎకరాల భూములు హాంఫట్
-మార్కెట్ విలువ రూ.ఆరువేల కోట్లు!
-స్వాధీనం చేసుకోవాలని ముస్లింల డిమాండ్
హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న నివాస ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లో 323 ఎకరాల అక్రమ భూకైంకర్యం బయటపడింది. దశాబ్దాలపాటు దాచిపెట్టిన నిజం పురాతన రికార్డుల ద్వారా వెలుగు చూసింది. ఈ భూముల విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.6 వేల కోట్లని అంచనా.
darga-land01దర్గాకు చెందిన ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వక్ఫ్‌బోర్డుకు అప్పగించాలని పలువురు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే షేక్‌పేట్ మండలంలోని సర్వే నంబర్లు 92, 102 ప్రకారం హకీంపేట్ గ్రామంలోని హకీముల్ ములుక్ ముసవీ అల్ మారుఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్‌షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4448 గజాలు, దర్గా నిర్వహణ వ్యయం కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని కేటాయించారు. ఈ మేరకు కితాబుల్ అవుఖాఫ్, మున్‌తఖబ్ ప్రకారం కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ పాలకులు కూడా వక్ఫ్ భూమిగా గుర్తించారు. హిజ్‌ర్రీ సంవత్సరం 1321, ఫస్‌లీ సంవత్సరం 1903లో నిజాం ప్రభుత్వ ఉమురే మజహబీ (ధార్మిక వ్యవహారాల శాఖ) రికార్డుల ప్రకారం ఫైల్ నం 786/4 బాబుల్ అవుకాఫ్/1321 ఫసలీ, మున్‌తఖబ్ నం.1254/1321ఫసలీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1903లో నిజాం ప్రభుత్వం ఈ భూమి వక్ఫ్ భూమిగా నిర్ధారించింది.

darga-land01
ఆక్రమణలు ఇలా...

హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అనంతరం 1960 తరువాత సర్వే నిర్వహించారు. ఏం జరిగిందో తెలియదు గానీ.. సర్వేలో దర్గాకు సంబంధించిన పూర్తి భూములను వక్ఫ్ గెజిట్‌లో చేర్చకుండా కేవలం దర్గా కట్టడం, దర్గాకు ఆనుకొని ఉన్న మసీదు, దర్గా ప్రాంగణాన్ని మాత్రమే నమోదు చేశారు. వక్ఫ్ సర్వే ఫారంలోని అటాచ్ ప్రాపర్టీ కాలమ్‌ను పూర్తిగా వదిలేసి, దర్గాకు కేవలం 4,448 గజాల వక్ఫ్ భూమి ఉన్నట్లు రికార్డులో నమోదు చేశారు.

దర్గా అటాచ్ ప్రాపర్టీ 323.18 ఎకరాల భూమిని ఉద్దేశపూర్వకంగానే నమోదు చేయలేదు. వక్ఫ్ గెజిట్‌లో 323.18 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో గత నలబై ఏళ్లలో సీమాంధ్ర రాజకీయ నాయకులు, వక్ఫ్ బోర్డు ఉన్నత అధికారులు కుమ్మకై నకిలీ దస్తావేజులు సృష్టించి దర్గా భూమిని పలు సీమాంధ్ర వ్యాపార సంస్థలకు, సినిమారంగ ప్రముఖులకు, సీమాంధ్ర రాజకీయ నాయకుల బంధువులకు తక్కువ ధరలకు విక్రయించారు. ప్రస్తుతం ఆ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ, కన్వెన్షన్ సెంటర్లతో పాటు సీమాంధ్ర ప్రాంత వ్యాపారుల నివాసాలున్నాయి.

రికార్డును సరిచేసిన వక్ఫ్ బోర్డు

ఈ విషయాన్ని గమనించిన పలు ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు ఈ భూముల విక్రయాలు, కేటాయింపులపై వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేశాయి. అయితే సీమాంధ్ర పాలకులు ఫిర్యాదులను పట్టించుకోకుండా తమకు అనుకూలంగా ఉండేవారికి చౌక ధరలకే భూములను కేటాయిస్తూ వచ్చాయి. ఇదిలాఉండగా 2011లో అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖుసురోపాషా వక్ఫ్ బోర్డు టాస్క్‌ఫోర్స్‌ను పంపించి భూమికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. భూమి వివరాలు మున్‌తఖబ్, కితాబుల్ అవుఖాఫ్(వక్ఫ్ భూమి అధార పుస్తకాలు) తదితర రికార్డులన్నీ కూలంకషంగా తిరగేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మున్‌తఖబ్, కితాబుల్ అవుఖాఫ్ ప్రకారం మొత్తం భూమి 4448 గజాలు, 323 ఎకరాల 18 గుంటలు ఉన్నట్లు గుర్తించారు.

1960 అనంతరం జరిగిన సర్వేలో దర్గా కట్టడానికి సంబంధించిన భూమిని నమోదు చేసి, దర్గా మొత్తం భూమిని అటాచ్‌మెంట్ కాలంలో నమోదు చేయకపోవడంతోపాటు, వక్ఫ్ గెజిట్‌లో కేవలం 4448 గజాలుగా నమోదు చేసి తప్పు చేశారని గుర్తించారు. ఈ విషయాన్ని వక్ఫ్ బోర్డు సమావేశం దృష్టికి తెచ్చారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములు తిరిగి వక్ఫ్ రికార్డులో నమోదు చేసుకునేందుకు 1998 వక్ఫ్ యాక్టు సెక్షన్ 40 అవకాశం ఇస్తున్నది. దీంతో ఈ సెక్షన్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ చట్టానికి 2013లో అమెండ్‌మెంట్ చేసి.. సదరు భూమిని వక్ఫ్ రికార్డుల్లో నమోదు చేయాలని తీర్మానించారు. ఈ తీర్మానంలో మున్‌తఖబ్, కితాబుల్ అవుఖాఫ్‌లో ఉన్న భూమిని వక్ఫ్ గెజిట్‌లో నమోదు చేయడానికి ఈ భూమికి సంబంధించిన అధారాలతో కమిషనర్ (ప్రింటింగ్)కు పంపారు. భూమికి సంబంధించిన అధారాలను పర్యవేక్షించిన అనంతరం కమిషనర్ అన్యాక్రాంతమైన భూమికి సంబంధించిన పూర్తి వివరాలను కొత్త గెజిట్‌లో నమోదు చేస్తూ ఇటీవల ప్రచురించారు. ప్రస్తుతం కొత్త గెజిట్‌లో ఈ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

భూములు రక్షించాలి..

గ్రేటర్‌లో మాయమైన కోట్ల విలువైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని దక్కన్ వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు ఉస్మాన్‌అల్ హజ్రీ, హాస్ ఇండియా చైర్మన్ తారిక్ ఖాద్రీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర పాలకులు ఇష్టానుసారం భూములను విక్రయించి కోట్ల రూపాయలు దండుకున్నారని మండిపడ్డారు. ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్యాక్రాంతమైన వక్ఫ్‌భూములను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో తప్పు జరిగింది

గతంలో తప్పు జరగడంలో కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తి వివరాలు గెజిట్‌లో నమోదు కాలేదు. వక్ఫ్ యాక్టు సవరణతో తిరిగి ఈ భూమి వక్ఫ్ గెజిట్‌లో నమోదు అయ్యింది. ప్రస్తుతం ఉన్న పాత సర్వే నం.92, కొత్త సర్వే నం.102 వక్ఫ్ మున్‌తఖబ్, కితాబుల్ అవుఖాఫ్, కొత్త వక్ఫ్ గెజిట్ ప్రకారం 4448 గజాలు, 323 ఎకరాల 18 గుంటల భూమి వక్ఫ్ భూమిగా నమోదయ్యింది. ఈ భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ శాఖ, వక్ఫ్ బోర్డు జంట సర్వే కోసం షేక్‌పేట్ తహశీల్దార్‌కు లేఖ రాశాం. అతిత్వరలో సర్వే నిర్వహించడంతో పాటు హద్దులు నిర్ణయించి భూమిని స్వాధీనం చేసుకుంటాం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి