గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 09, 2015

బిరబిరా కృష్ణమ్మ తరలిపోయిన కథ!

Bheema-Project

ఒక అన్యాయం మూడు జిల్లాలు వట్టిపోయేలా చేసింది! పనిగట్టుకుని రచించిన ఒక పథకం.. న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులను తెలంగాణకు కాకుండా చేసింది! కరడుగట్టిన వివక్ష.. ఒక జిల్లాను తరతరాలు పీడించే ఫ్లోరైడ్ రక్కసి కోరల మధ్యకు నిర్దాక్షిణ్యంగా విసిరిపారేసింది! సమైక్య పాలకుల పట్టరానితనం.. దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఒక జిల్లాకు జిల్లానే వలసబాట పట్టించింది! కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు కబ్జా కథ చదివాం! ఆ కబ్జా నేపథ్యంలో శ్రీశైలానికి ఇవతలివైపున తెలంగాణలో తలెత్తిన మహా మానవ సంక్షోభానికి మచ్చుతునకలివి! గండికొట్టుకుని మరీ తరలించుకుపోయిన నీటితో ఆంధ్ర రిజర్వాయర్లు నిండి.. అక్కడ పంటలు పండితే తెలంగాణ పొలాలు ఎండిపోయాయి! కృష్ణా జలాలపై ప్రథమ హక్కులుండి.. హక్కు ప్రకారమే కనీసం పాతిక లక్షల ఎకరాలకు పారా ల్సిన జలాలు.. ఏడు లక్షల ఎకరాలను తడిపేసరికే డస్సిపోతున్నాయి! ఇది దగాపడ్డ తెలంగాణ కథ! బిరబిరా తరలిపోతున్న కృష్ణమ్మను చూసి తెల్లబోయి కూర్చున్న తెలంగాణ పొలాల వ్యథ! ఒక టీఎంసీ నీటితో రూ.25 కోట్ల విలువైన పంట పండుతుందని అంచనా! అంటే ఈ లెక్కన గడిచిన దశాబ్దాల్లో తెలంగాణ రైతు నష్టపోయింది లక్షల కోట్లు! అంతటి ఆదాయం మహబూబ్‌నగర్ పంచుకుని ఉంటే మరో కోనసీమ కాకపోయేనా! అందులో కనీసవాటా పొందగలిగితే నల్లగొండను ఫ్లోరైడ్ పట్టి పీడించేదా? ఇప్పుడు ఇదే ప్రశ్న! కృష్ణా జలాల్లో రాష్ర్టానికి రావాల్సిన ప్రతి చుక్క నీటినీ సాధించాల్సిందేనన్నది దీటైన పరిష్కారం!!
-ఆంధ్రలో నిండిన రిజర్వాయర్లు..పండిన పంటలు
-తెలంగాణలో ఎండిన పొలాలు.. జనాల వలసలు
-ఐదున్నర దశాబ్దాల సమైక్య మోసానికి
-తెలంగాణ రైతుకు లక్షల కోట్లు నష్టం

-భీమా ధీమా దక్కని పాలమూరు పొలాలు
-కుంట పొలాన్నీ తడుపని శ్రీశైలం జలాలు
-నదినే మళ్లించిన పోతిరెడ్డిపాడు
-ఇంకా కుంటి నడకనే శ్రీశైలం ఎడమ కాలువ
-పాతిక లక్షల ఎకరాలకు పారాల్సిన కృష్ణమ్మ
-ఏడు లక్షల ఎకరాలకు నీరందటమే గగనం
-కృష్ణానదిలో మన వాటా ప్రతి చుక్క రావాల్సిందే

నమస్తే తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి:సమైక్యపాలకుల మోసానికి కృష్ణానదికి ఇవతలివైపున తెలంగాణలో మహా విధ్వంసమే చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఒట్టిపోయాయి. మహబూబ్‌నగర్ ఏకంగా ఎడారిగా మారే పరిస్థితి దాపురించింది. తాగు, సాగునీరు లేక లక్షలమంది వలసపోవలసి వచ్చింది. 

Bheema-Project-inner

నల్లగొండ పశ్చిమ మండలాల ప్రజలు ఫ్లోరైడ్ భూతానికి బలికావలసి వచ్చింది. ఎందుకిలా జరిగింది? తలాపున కృష్ణా నది పారుతున్నా ఎందుకు నీటికోసం అలో రామచంద్రా అని అలమటించవలసి వచ్చింది? కృష్ణానదినుంచి హంద్రీ-నీవాద్వారా ఎక్కడో 610 కి.మీ. దూరంలోని పలమనేరుకు నీరు తీసుకుపోవడానికి ప్రణాళికలు వేసిన సమైక్య పాలకులు పక్కనే ఉన్న పాలమూరును ఎందుకు వదిలేశారు? ఎందుకంటే వారెవరికీ తెలంగాణ ఆత్మ లేదు కాబట్టి. కృష్ణా నీటిపై తెలంగాణకు ప్రథమ హక్కులు ఉన్నాయన్నది గుర్తించదల్చుకోలేదు కాబట్టి! తెలంగాణ ఏమైనా ఫర్వాలేదు కానీ.. వాళ్ల రిజర్వాయర్లు నిండితే చాలు.. వాళ్ల పొలాలు పండితే చాలు! పాలించేది ఏ సీమాంధ్రుడైనా.. లక్ష్యం ఇదే! అది తెలంగాణకు కృష్ణమ్మను కాకుండా చేసే కుట్ర. ఆ కుట్ర ఒక్కసారి.. ఒక్కరోజులో జరిగింది కాదు. కలిసిన తొలిరోజు నుంచే పద్ధతి ప్రకారం అమలైంది. హైదరాబాద్ రాష్ట్రంలో రూపుదిద్దుకున్న ఎగువ కృష్ణా, భీమా, నందికొండ ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రం కారణంగా స్థలం మారి, రూపు మారి, ఆయకట్టు తగ్గిపోయి కొరగాని ప్రాజెక్టులుగా మిగిలిపోయాయి. రెండు దశాబ్దాలుగా సీమలో పారుతున్న శ్రీశైలం ప్రాజెక్టు జలాలు ఇప్పటికీ తెలంగాణ పొలాలను తడుపలేదు.

report-bhimaproject


25లక్షలు సాగులోకి వచ్చి ఉండాలి


బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో తెలంగాణ వాటా 298 టీఎంసీలుగా తేల్చింది. అంటే అంత నీరు ఉపయోగించుకుంటే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కనీసం 25 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చి ఉండాలి. ఈ ఐదు దశాబ్దాల్లో నాలుగు జిల్లాల్లో కలిపి సాగులోకి వచ్చింది నికరంగా 7 లక్షల ఎకరాలు మాత్రమే. తాజాగా బ్రజేష్ ట్రిబ్యునల్ మరోసారి సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు 190 టీఎంసీలు అదనంగా కేటాయించింది. గతంలో బచావత్ కేటాయించిన 811 టీఎంసీలను బ్రజేష్ ట్రిబ్యునల్ 1001 టీఎంసీలకు పెంచుతూ నివేదిక ఇచ్చింది.

పరివాహక నియమాల ప్రకారం మన రాష్ట్ర నీటి వాటా తేల్చాలని మన రాష్ట్రం ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నది. అదనపు కేటాయింపుల్లో ప్రధాన వాటా మన రాష్ర్టానికే దక్కాలి. మొత్తంగా కనీసం 400 టీఎంసీలు రావాలి. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లకు తాగునీరు అందించడంతోపాటు 25 లక్షల ఎకరాలకు అవసరమైన సాగునీటిని కృష్ణానుంచే తీసుకోవాలి. కృష్ణానదిలో నీళ్లు లేవన్నది బూటకం. 2010-11లో 402.78 టీఎంసీలు, 2011-12లో 209.07 టీఎంసీలు, 2012-13లో 55.58 టీఎంసీలు, 2013-14లో 433 టీఎంసీలు బంగాళఖాతం పాలయ్యాయి. మనం కరువు సంవత్సరంగా భావిస్తున్న ఈ ఏడాది కూడా 74.33 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిశాయి. ఇవన్నీ అధికారిక లెక్కలే. కృష్ణాలో నీళ్లు లేవన్నది కేవలం తెలంగాణ ప్రజలను మాయం చేయడంకోసమే.

ప్రాజెక్టులే తరలిపోయాయి


సమైక్యపాలనలో తెలంగాణ ఎంత నష్టపోయిందంటే.. 10 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకుద్దేశించిన నందికొండ ప్రాజెక్టు కాస్తా నాగార్జునసాగర్ అయింది. రెండు ప్రాంతాలకు సమానంగా 132 టీఎంసీలు ఇవ్వాలన్న పథకాన్ని మార్చి ఎడమకాలువకింద కూడా సుమారు 37 టీఎంసీలను కృష్ణాజిల్లా ఆయకట్టుకు మళ్లించారు. తెలంగాణలో ఆయకట్టును తొలుత 7.9 లక్షల ఎకరాలుగా నిర్ణయించి, ఆ తర్వాత 6.65 లక్షల (నల్లగొండ జిల్లా 3.88 లక్షలు, ఖమ్మం జిల్లా 2.77 లక్షలు) ఎకరాలకు కుదించారు. నందికొండ గ్రామానికి ఎగువన నిర్మించవలసిన ప్రాజెక్టును దిగువకు దింపి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయంచేశారు.

నిజానికి రెండుజిల్లాల్లో కలిపి ఇప్పుడు 5 లక్షల ఎకరాలకే నీరందుతున్నది. రెండు పంటలకూ కలిపి 13 లక్షల ఎకరాలు సాగు కావలసిన నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఖరీఫ్ 5 లక్షలు, రబీ రెండు లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. గ్రావిటీద్వారా మమబూబ్‌నగర్‌కు నీళ్లు ఇవ్వాల్సిన ఎగువ కృష్ణ ప్రాజెక్టు (ఆ పేరుతో వచ్చినవే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు) మనకు కాకుండాపోయింది. ఎప్పుడో 1937లోనే రూపకల్పన చేసిన భీమా ప్రాజెక్టుకూడా మనకు దక్కలేదు. భీమా, ఎగువ కృష్ణా ప్రాజెక్టులు పూర్తయి, వాటిపై మన నీటి హక్కులను అప్పుడే సాధించుకుని ఉంటే ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 5.5 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి ఉండేది. ఈ రెండు ప్రాజెక్టులూ నిర్మించ తలపెట్టిన నదీప్రాంతాలు రెండూ ప్రతి ఏటా తప్పనిసరిగా విరివిగా నీరు లభించే ప్రాంతాలు.

మనకు కాకుండా పోయిన భీమా


భీమా ప్రాజెక్టు నిర్మాణాన్ని అనేక ప్రాంతాలను పరిశీలించిన తర్వాత యాద్గిర్ సమీపంలోని తంగడి వద్ద 6.66 కోట్లతో చేపట్టాలని అప్పటి నీటిపారుదల ఇంజినీర్లు నిజాం ప్రభుత్వానికి నివేదించారు. తంగడివద్ద ఏ సంవత్సరమైనా సగటున 243 టీఎంసీల నీరు లభిస్తుందని అంచనాలు వేశారు. అయితే ఆ ప్రాజెక్టు ఆచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత హైదరాబాద్ ప్రభుత్వం మరోసారి అధ్యయనంచేసి ప్రాజెక్టును తంగడి వద్దే నిర్మించాలని, 107 టీఎంసీల నీటిని ఉపయోగంలోకి తేవాలని భావించింది.
29.8 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 6.79 కి.మీ. పొడవు ఆనకట్టతో రిజర్వాయర్ నిర్మించాలని, 241 కి.మీ. పొడవున కాలువ నిర్మించి 5,98,579 ఎకరాలను సాగులోకి తేవాలని అప్పటి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుపై ఎడమ కాలువను ఒక్కదానినే నిర్మించాలని, కుడివైపున ఉన్న భూభాగాలకు ఎగువ కృష్ణా ప్రాజెక్టు కుడికాలువ నుంచి నీరు ఇవ్వవచ్చునని కూడా ఈ ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు. ఎగువ కృష్ణా ప్రాజెక్టు ద్వారా అప్పటి గుల్బర్గా, రాయచూర్, బీజాపూర్ జిల్లాలకు సాగునీరు అందించడంతోపాటు అలంపురం, గద్వాల తాలూకాల్లో 54 టీఎంసీల నీటితో 1.50 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని హైదరాబాద్ రాష్ట్రం సంకల్పించింది. 
1951లో జరిగిన ఇంటర్ స్టేట్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. కానీ 1956 రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ తెలంగాణ తలరాతను తిరగరాసింది. ఎగువ కృష్ణా ప్రాజెక్టు స్థలం కర్ణాటకలో కలసిపోవడంతో వారు ప్రాజెక్టు రూపురేఖలు మార్చేశారు. కనీసం భీమా ప్రాజెక్టు అయినా పూర్తి చేస్తారని తెలంగాణవాసులు ఆశించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) భీమా ప్రాజెక్టుపై ఒక నివేదిక తయారుచేసి, అప్పటి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని కోరింది. ఈ ప్రాజెక్టును ఐదేండ్లలో పూర్తి చేయవచ్చునని, దీనివల్ల కరువు పీడిత మహబూబ్‌నగర్ దశ-దిశ మారిపోతుందని సూచించింది.
సీజనుకు 3 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండించవచ్చునని పేర్కొంది. ఎకరా పొలం సాగుకు అయ్యే నీటి ఖర్చు రూ.15 ఉంటుందని, ఎకరా చెరకు పండించడానికయ్యే నీటి ఖర్చు రూ.22.50 మాత్రమేనని పేర్కొంది. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజల జీవితాలను మార్చివేస్తుందని, ఆర్థికంగా సంపద్వంతం చేస్తుందని నివేదిక సూచించింది. ఈ ప్రాజెక్టు నిర్మించే స్థలం యాద్గిర్‌కు సమీపంలోని తంగడి కన్నడ ప్రాంతంలో ఉన్నా 80% భూమి మహబూబ్‌నగర్ జిల్లాలోనే సాగులోకి వచ్చేది.
మక్తల్‌నుంచి కొల్లాపురంవరకు 4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేది. ఆ ప్రాజెక్టులేవీ చేపట్టలేదు. మహబూబ్‌నగర్‌కు దక్కాల్సిన సుమారు 150 టీఎంసీల నీరు(భీమా నుంచి 100 టీఎంసీలు, ఎగువ కృష్ణ నుంచి 50 టీఎంసీలు) సమైక్య పాలన నిర్వాకం వల్ల చేజారిపోయాయి. అప్పట్లో ప్రాజెక్టులు చేపట్టకపోవడంవల్ల ఆ తర్వాత ట్రిబ్యునళ్లలో నీటి కేటాయింపులు జరుగలేదు. జూరాలకు మాత్రం 17.84 టీఎంసీలు, రాజోలిబండకు 15.9 టీఎంసీలను కేటాయించారు. జూరాలకింద సాగు లక్ష్యం లక్ష ఎకరాలే. రాజోలిబండ మళ్లింపు కాలువకింద 87400 ఎకరాలు సాగు చేసుకునే అవకాశం ఉన్నా రాయలసీమ నేతల దౌర్జన్యాల కారణంగా ఏ సంవత్సరమూ 25000 ఎకరాలకు మించి సాగుచేసుకోలేని దుస్థితి ఏర్పడింది.

రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం శ్రీశైలం వద్ద తాను చేస్తున్న అక్రమాలనుంచి దృష్టి మళ్లించడానికి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించింది. కల్వకుర్తికింద 2.6 లక్షల ఎకరాలు, భీమాకింద 2,02 లక్షలు, నెట్టెంపాడుకింద 2 లక్షల ఎకరాలు మొత్తం 6.62 లక్షల ఎకరాలు సాగులోకి తేబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఈ రోజుకు మూడు ప్రాజెక్టుల కింద సాగులోకి వచ్చిన భూమి నికరంగా 16000 ఎకరాలే. పదేండ్లు గడచిపోయాయి. వందలకోట్లు ఖర్చు చేశారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా పనులు నిలిచిపోయాయి. జిల్లాలో మొత్తంగా ఇన్నేళ్ల తర్వాత అన్ని ప్రాజెక్టుల కింద కలిపి నికరంగా 25-30 టీఎంసీల నీటిని కూడా వాడుకోలేని దుస్థితి. మొత్తం సాగయ్యే భూమి రెండు లక్షల ఎకరాలకు తక్కువే.

పోతిరెడ్డిపాడులో ప్రవాహం.. ఎస్‌ఎల్‌బీసీ కుంటి నడక


మహబూబ్‌నగర్ ఉత్తర తాలూకాలు, నల్లగొండ జిల్లా కరువు ప్రాంతమైన దేవరకొండకునీరందించే డిండి(దుందుభి)నది ఎండిపోయి చాలా కాలమైంది. రాయలసీమకు పోతిరెడ్డిపాడు-శ్రీశైలం కుడికాలువ 20ఏండ్లుగా నీరుపారిస్తున్నా, అదేసమయంలో ఆమోదం పొందిన శ్రీశైలం ఎడమ కాలువ ఇప్పటికీ కుంటి నడక నడుస్తున్నది. ఎస్‌ఎల్‌బీసీకి ప్రత్యామ్నాయంగా తెచ్చిన మాధవరెడ్డి ప్రాజెక్టుకింద 2.2 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికీ 60వేల ఎకరాలుకూడా సాగుకావడం లేదు. మూసీ కింద సగం ఆయకట్టు మాత్రమే సాగవుతున్నది.
మూసీ మురికి కూపంగా మారిపోయింది. ఐదు దశాబ్దాల తర్వాత కూడా జిల్లాలో మొత్తం సాగవుతున్నది నాలుగు లక్షల ఎకరాలే. సుమారు 150 టీఎంసీలు వినియోగించుకునే హ క్కున్న నల్లగొండ జిల్లాలో ఇప్పుడు వినియోగించుకుంటున్నది 70-80 టీఎంసీలకు మించదు. రంగారెడ్డి జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతం. ఈ జిల్లాలో వికారాబాద్ కొండలకు పశ్చిమంవైపు మొదలయ్యే కాగ్నా నది భీమాలో కలుస్తుండగా, కొండల తూర్పు వైపు మొదలయ్యే మూసీ.. నల్లగొండ మీదుగా కృష్ణాలో కలుస్తుంది. అయినా ఈ జిల్లాకు నీరందించే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు.

తెలంగాణ రైతుకు లక్షల కోట్లు నష్టం


తెలంగాణలో ముందునుంచీ తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల ఇక్కడి రైతాంగం గతంలో కనీసం పదివేల టీఎంసీల నీటిని నష్టపోయింది. ఒక్క టీఎంసీ నీటితో పండే వరిధాన్యం విలువ కనిష్ఠంగా రూ.25 కోట్లు ఉంటుందని వ్యవసాయ, ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. ఆ విధంగా చూస్తే ఇన్నేళ్లలో ఇక్కడ రైతాంగం లక్షల కోట్లు నష్టపోయారు. 
ఇప్పటికీ నష్టపోతున్నారు. వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితికి నెట్టివేయబడ్డారు. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం కృష్ణా నదిలో మనకు హక్కుగా సంక్రమించిన ప్రతి చుక్క నీటిని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు మళ్లించడమే. ఈ ప్రయత్నంలో భాగంగానే ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కొత్తగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రూపకల్పన జరుగుతున్నది.



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి