-నిబంధనల మార్చేందుకు ప్రభుత్వం యోచన
హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ)ని ప్రక్షాళించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీర్ఘకాలంగా హెచ్‌ఎండీఏలో తిష్ఠవేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఇంజినీర్ల అవినీతి వల్లే ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమణలకు గురైనట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్లు సమాచారం. హెచ్‌ఎండీఏను ప్రక్షాళన చేస్తే తప్పా ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడే పరిస్థితి లేదని కొందరు సీనియర్ అధికారులు సీఎంకు చెప్పినట్లు సమాచారం. దీంతో హెచ్‌ఎండీఏను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తున్నది. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం టౌన్‌ప్లానింగ్ అధికారులను ఇతర విభాగాలకు బదిలీ చేసే అవకాశం లేదు. దశాబ్దాలకుపైగా అందులోనే తిష్ఠవేసిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని ఇటీవల ప్రభుత్వ పరిశీలనలో తేలింది. హెచ్‌ఎండీఏలో ఉన్న పరిపాలనపరమైన నిబంధనలనే పూర్తిస్థాయిలో మార్చి అందులో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారులను ఇతరశాఖల్లోకి బదిలీచేసే విధంగా నిబంధనలను సవరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. హెచ్‌ఎండీఏ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్‌ను పూర్తి వివరాలతో తనకు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నిబంధనల మార్పునకు అవసరమైతే క్యాబినెట్ ఆమోదం తీసుకుని, సుదీర్ఘకాలంగా తిష్ఠవేసిన అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పనిచేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను ప్రభుత్వం ఇటీవలే బదిలీచేసింది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి