01
విద్యయన తెలివిగా ♦ విదితమగును;
తెలివియన విద్యయనియునుఁ ♦ దెలియఁదగును;
విద్యయే జ్ఞానమగు వేద ♦ విద్యయగును;
విద్యయే శాస్త్రమగు లోక♦వేద్యమగును!
02
చోరులు గాంచని ధనమయి,
మీఱిన సుఖమిచ్చునదియు, ♦ మేదినిలోనన్
దోరముగఁ బంచియిడిననుఁ
బేరిమితో వృద్ధియౌను ♦ విద్యయె సుమ్మీ!
03
ప్రళయ సమయమందైనను
ఖిలమునుఁ గాకుండునదియుఁ ♦ గీరితినిడి, కే
వల మంతర్ధనముగ నిల
వెలసియుఁ బరిమళము లిడును ♦ విద్యయె సుమ్మీ!
04
భూతమును శోధనముఁ జేసి, ♦ పుటముఁ బెట్టి,
వర్తమానమ్ము వెల్గించి, ♦ ప్రగతిఁ బంచి,
భావితరములవారికిఁ ♦ బ్రాణమగుచు,
యుగయుగమ్ములు జీవించు ♦ "యోగి" విద్య!
05
బడినిఁ దల్లి యొడిగఁ ♦ బరిగణించును విద్య;
గురుని మాతృసముగఁ ♦ గూర్చు విద్య;
జీవనమునుఁ గడపు ♦ త్రోవఁ జూపును విద్య;
హితము, ధనము, కీర్తి ♦ నిచ్చు విద్య!
06
అగుణు సగుణుఁ జేయు ♦ ననువర్తనమె విద్య;
రూపులేనివాని ♦ రూపు విద్య;
కడఁగియుఁ బరదేశ ♦ గౌరవమ్మిడు విద్య;
ధనములేనివాని ♦ ధనము విద్య!
07
దరికిఁ జేర్చి కాఁచు ♦ దైవమ్మెయగు విద్య;
పదుగు ఱెదుట గౌర♦వమ్ము విద్య;
ఘనులలోనఁ బరమ ♦ ఘనతఁ దెచ్చును విద్య;
యిష్టములను నిచ్చు ♦ హితుఁడె విద్య!
08
పాప మార్గములనుఁ ♦ బరిమార్చునదె విద్య;
ధర్మ మార్గ మిడును ♦ కూర్మి విద్య;
మంచి చెడుల మర్మ ♦ మందించునదె విద్య;
సత్ప్రవర్తక పరి♦జనమె విద్య!
09
కూడు, గూడును, గుడ్డయుఁ ♦ గూర్చు విద్య;
సరళమౌ నీతి బోధించు ♦ గురుఁడు విద్య;
బాధ్యతలఁ దెల్పి, నిను మార్చు ♦ బ్రతుకు విద్య;
ఇహపరమ్ముల సుఖము నీ♦కిచ్చు విద్య!
10
ధనమదాంధుల దర్ప ద♦ళనము విద్య;
స్వార్థపరులను సరిచేయు ♦ సరణి విద్య;
భజనపరులను భంజించు ♦ పవియె విద్య;
గర్వులనుఁ జీల్చి చెండాడు ♦ కత్తి విద్య!
11
కొండెగాండ్రకుఁ దలమీది ♦ కొఱవి విద్య;
సోమరుల కెప్డు సూచించు ♦ సూది విద్య;
వంచకుల చర్య లరికట్టు ♦ బడితె విద్య;
నీచులనుఁ గాల్చి నొప్పించు ♦ నిప్పు విద్య!
12
సర్వ కాలాల నిన్నంటు ♦ శక్తి విద్య;
తాను వెలుఁగుచు వెలిఁగించు ♦ తపము విద్య;
పామరునిఁ బండితుం జేయు ♦ పదవి విద్య;
విద్య లేనట్టివాఁడెపో ♦ వింత పశువు!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి