గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 13, 2014

సీమాంధ్ర...మరో భూమి దోపిడీ...ఆస్తి కోసం పుట్టుకొచ్చిన ధార్మిక సంస్థ నకిలీ ఇస్కాన్ నాటకం!

-రూ. 250 కోట్ల బంజారాహిల్స్ భూమికి ఎసరు లక్ష్మీనరసింహుడికి శఠగోపం
-విభజన జరిగినా ఆగని సీమాంధ్ర భూ దోపిడీ

రాష్ట్ర రాజధానిలో భూముల కైంకర్యానికి సీమాంధ్రులు ఎన్ని రకాల ఎత్తులు వేశారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి నగరంలోని బంజారాహిల్స్‌లో రూ. 250 కోట్ల విలువైన ఆలయ భూమిని కొట్టేయడానికి ఏకంగా ఇస్కాన్ సంస్థకు ఓ నకిలీని పుట్టించేశారు. భూమి లీజులు చూడాల్సిన ఓ సీమాంధ్ర అధికారిణి విచిత్రంగా ఆయనను పెళ్లి చేసుకుంది. ఈ అపూర్వ దంపతులకు సీమాంధ్ర అధికారులు ఆ భూమిని అప్పనంగా లీజుకిచ్చి ఆశీర్వదించారు. విలువైన భూమిలో ఖరీదైన షాపింగ్ మాల్ లేవాల్సింది.. స్థానిక ప్రజల తిరుగుబాటుతో తప్పిపోయింది.
iscanవిషయం బజారుకెక్కినా.. లోకాయుక్త అక్షింతలు వేసినా నాటి సీమాంధ్ర ప్రభుత్వం లీజు రద్దు చేయలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సదరు అధికారిణి ఇక్కడే తిష్ఠ వేశారు. సదరు భర్త ఎత్తులు వేస్తూనే ఉన్నాడు. ఇపుడొక్కటే ప్రశ్న. స్వరాష్ట్రంలోనూ ఈ కబ్జాలు, ఆ అధికారులు కొనసాగాల్సిందేనా?
ప్రముఖ కంపెనీల వస్తువులకు అదే మాడల్ వస్తువులు సృష్టించి ప్రజలను బురిడీ కొటించినట్టే రూ. 250 కోట్ల భూమిని కైంకర్యం చేసేందుకు ఓ సీమాంధ్రకు చెందిన ఘనుడు ఏకంగా నకిలీ ఇస్కాన్ సంస్థనే పుట్టించేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆ సంస్థకు పేరుప్రఖ్యాతులతోపాటు మహా భక్తులన్న పేరు కూడా ఉండడం ఆసరాగా ఒక ఆలయాన్నే మింగేయాలని చూశాడు. హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ట్రస్ట్‌ను రిజిస్టర్ చేసిన సదరు పెద్ద మనిషి యాదగిరిగుట్ట ఆలయానికి చెందిన...బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో...5 ఎకరాల భూమిని 33 ఏండ్ల లీజుకు దక్కించుకున్నాడు. ఈ సంస్థతో తమకు సంబంధం లేదని సాక్షాత్తూ ఇస్కాన్‌సంస్థ చెప్పినా సీమాంధ్ర సర్కారు అడ్డగోలుగా భూమిని ధారాదత్తం చేసింది. దీని వెనుక సీమాంధ్ర ఉన్నతాధికారి సూత్రధారి కాగా, ఆమె భర్త పాత్రధారి కావడం గమనార్హం. ఫలితంగా అత్యంత విలువైన దేవుడికి చెందిన 5 ఎకరాల భూమి సీమాంధ్రుల చేతుల్లోకి వెళ్లింది. 
narasimhatemple
ఆ భూమి ఏమిటి.. ఏమా కథ?

బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12కు సమీపంలో 400 ఏళ్ల క్రితం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెలసింది. ఈ ఆలయానికి రోడ్‌నంబర్ 12లో సర్వేనంబర్ 129లో 47 ఎకరాల 19 గుంటల భూమి ఉన్నది. నిజాం ప్రభుత్వంలో జాగీర్దార్‌గా ఉన్న కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఈ 47 ఎకరాల 19 గుంటల భూమిని లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ధూపదీప నైవేద్యాలకు ఇచ్చారు. 2003లో రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు సర్వే నిర్వహించి 42 ఎకరాలు కబ్జాకు గురైనట్లు తేల్చారు. మిగిలిన 5 ఎకరాల భూమిని ఆలయానికి చెందినదిగా నిర్ధారించారు. 

2002లో ఈ దేవాలయాన్ని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం వారు దత్తత స్వీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ భూమి మీద కన్నేసిన దేవాదాయశాఖలోని సీమాంధ్ర ఉన్నతాధికారిణి, దేవుడికి చెందిన ఈ భూమిని...తనను పెళ్లి చేసుకున్న పతిదేవుడికి కట్నం కింద ఇవ్వడానికి పావులు కదిపారు. మొత్తం మీద ఈ ఐదెకరాల భూమిని 33 ఏళ్ల లీజుకింద రాసిచ్చేలా పావులు కదిపి సఫలీకృతులయ్యారు.

అక్రమంగా లీజు..

ఈ లీజుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. మెదక్ జిల్లా పటాన్ చెరువు అడ్రస్‌తో రిజిస్టర్ అయిన హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ట్రస్ట్ అనే సంస్థ బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 12లోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధునీకరణ, పునర్నిర్మాణం, నిర్వహణ కోసం తమకు కేటాయించాలంటూ ఏపీ దేవాదాయ కమిషనర్‌కు 2007లో ఒక విజ్ఞాపన పత్రం అందజేసింది. తమ సంస్థ ఇస్కాన్‌కు అనుబంధమంటూ తెలియజేసింది. లేఖను పరిశీలించిన అప్పటి కమిషనర్ పీ సుందర్‌కుమార్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. కమిషనర్ నివేదిక ఆధారంగా హరేకృష్ణమూవ్‌మెంట్ బంజారాహిల్స్‌లోని 5 ఎకరాల భూమిని దీర్ఘకాలిక లీజుకింద కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం 2009లో ఉత్తర్వులు జారీ చేసింది. భూములు 5 సంవత్సరాలు కానీ మరీ ఎక్కువ అంటే 11 సంవత్సరాల వరకే లీజుకు ఇవ్వాలని నిబంధనలున్నాయి. కానీ దీనికి విరుద్ధంగా ఏకంగా 33 ఏళ్ల వరకూ లీజుకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 

2010 అక్టోబర్‌లో ఈ స్థలాన్ని హరేకృష్ణ మూవ్‌మెంట్‌కు అప్పగించాలని ఎండోమెంట్ కమిషనర్ కింది స్థాయి అధికారులకు మెమోజారీ చేశారు. ఈ మేరకు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్( ఇఓ) హరేకృష్ణ మూవ్‌మెంట్ ప్రసిడెంట్ లక్ష్మీకాంతదాస్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ భూమిని ఆక్రమించుకోవడానికి దేవాలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన పేరిట వెళ్లిన ఈ బృందాన్ని స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ప్రభుత్వమే నేరుగా దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. విషయం బజారున పడడంతో లోకాయుక్త పరిశీలనకు వెళ్లింది. దేవుడి పేరుతో హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ట్రస్ట్‌కు 33 ఏళ్లు లీజుకు ఇవ్వడాన్ని లోకాయుక్త తప్పుపట్టారు. తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయితే సీమాంధ్ర సర్కారు ఏ మాత్రం స్పందించలేదు. 
సంస్థ రిజిస్టేషన్ తీరు ఇది...

అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీకాంతరెడ్డి 2009 ఫిబ్రవరి19 వ తేదీన హరేకృష్ణమూవ్‌మెంట్ హైదరాబాద్ ట్రస్ట్ అనే సంస్థ రిజిస్ట్రేషన్ కోసం పటాన్‌చెరువు అడ్రస్ పేరుతో మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శ్రీమధుపండిట్ దాస్ పేరిట దరఖాస్తు చేశారు. విచారణ అధికారి సంబంధిత అడ్రస్‌కు వెళ్లి అప్పటికప్పుడు విచారణ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఏ/147/2009 పేరుతో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అదే రోజు సెక్షన్ 43 కింద హరేకృష్ణ మూమెంట్ హైదరాబాద్ ట్రస్ట్‌ను హిందూ దేవాదాయ చట్ట ప్రకారం రిజిస్టర్ చేశారు. అయితే ఈ సంస్థ రిజిస్ట్రేషన్ కాగితాలపై లక్ష్మీకాంత్‌రెడ్డి సంతకాలు మినహా శ్రీమధు పండిట్ దాస్ సంతకం కనిపించదు. 
వాస్తవానికి ఏ సంస్థనైనా రిజిస్టర్ చేయాలంటే దరఖాస్తు చేసిన తరువాత విచారణ అధికారులు తనిఖీలు నిర్వహించి అన్ని సక్రమంగా ఉన్నాయని భావించిన తరువాత ప్రొసీడింగ్స్ ఇస్తారు. ఎంత స్పీడ్‌గా అధికారులు పని చేసినా కనీసం నెల రోజుల సమయం పడుతుంది. కానీ ఈ సంస్థను రిజిస్టర్ చేసిన తీరు ఆగమేఘాల మీద జరిగింది. సంస్థను రిజిస్టర్ చేసిన వెంటనే భూమి లీజుకు దరఖాస్తు చేశారు తప్ప ఏ ధార్మిక కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. హరే కృష్ణ మూవ్‌మెంట్ సంస్థపై అనుమానం వచ్చిన కొంత మంది లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇస్కాన్ సంస్థకు లేఖ రాయగా, తమ సంస్థకు హరేకృష్ణమూవ్‌మెంట్ హైదరాబాద్ ట్రస్ట్‌కు సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాతకూడా దేవాదాయశాఖలోని సీమాంధ్ర అధికారులు భూమిని కట్టబెట్టారు.
భూమి కోసం పెళ్లి...అందుకోసమే ఇక్కడ తిష్ఠ

ఈయన విషయం ఇలా ఉంటే ఇక దేవాదాయ శాఖలో ఓ ఉన్నతాధికారిణి వ్యవహారం మరో వింత. ఈ శాఖలో జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్న సదరు అధికారిణి ఈ ట్రస్టు బాధ్యుడు లక్ష్మికాంతరెడ్డిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి భూమి లీజుకు సంబంధం ఉందనేది పెద్ద టాక్. పెళ్లి చేసుకుంటేనే భూమి దక్కుతుందనే కండిషన్ పెట్టినట్టు, అంగీకరించిన లక్ష్మికాంతరెడ్డి పెళ్లి చేసుకున్నట్లు విచారణ రిపోర్టులో కూడా తేలింది.

పెళ్లి ఒప్పందం కుదిరిన తరువాతనే ఈ ఫైల్ వాయు వేగంతో నడిచినట్లు సమాచారం. ఈ భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఈ సీమాంధ్ర దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం వివాదం కావడంతో రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు వెళ్లకుండా సదరు అధికారిణి ఇక్కడే తిష్ఠ వేశారు. ఈ లీజును చక్కదిద్దడం కోసమే ఆమె సీటు వదలడం లేదని తెలంగాణ ఉద్యోగులు చెబుతున్నారు. దేవాదాయ భూముల ఆక్రమణలో కీలకపాత్ర వహించిన అధికారులంతా వాటిని చక్కబెట్టుకోవడం కోసం చక్రం తిప్పి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ ఉత్తర్వులకు వారం పది రోజుల ముందుగానే ఫైల్ ప్రక్రియను నడిపించారని, ఇదంతా తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండానే చేశారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

ప్రభుత్వ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి బీ వెంకటేశ్వరరావు సరిగ్గా 23 రోజుల ముందు 2014 మే12వ తేదీన ఆమెపై నిరూపితమైన ఆరోపణల వల్ల ఎంత ఆదాయానికి గండిపడింది.. అలాగే నిర్ధారణ అయిన ఆరోపణలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆమెపై విచారణ జరుగుతుందని తెలిసినా ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ... కీలకమైన బాధ్యలు అప్పగించడం పట్ల తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
హైదరాబాద్ ఇస్కాన్ సంస్థలతో సంబంధం లేదు

హైదరాబాద్‌లోని ఇస్కాన్ దేవాలయాలతో మాకు సంబంధం లేదు. మా సంస్థకు బెంగుళూరు ఇస్కాన్‌తో సంబంధాలున్నాయి. సంస్థ తరఫున పేదలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. మా సంస్థ కార్యకలాపాలను గుర్తించి ప్రభుత్వం బంజారాహిల్స్ యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహస్వామికి చెందిన భూమిని 33 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. 
- హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ట్రస్ట్ ప్రతినిధి రవిలోచన్ దాస

నకిలీదని కర్ణాటక హై కోర్టు ధ్రువీకరించింది

దేవాదాయశాఖ అధికారిణితో కుమ్మక్కై విలువైన భూమిని హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ట్రస్ట్ పేరుతో నకిలీ సంస్థ ప్రతినిధులు కాజేశారు. ఇస్కాన్ సంస్థకు అనుబంధ సంస్థగా చెప్పుకోవడంపై ముంబైలోని ఆ సంస్థ సీరియస్ అయింది. కర్ణాటక హైకోర్టులో కేసు వేసింది. కర్ణాటక హై కోర్టు బెంగుళూరు ఇస్కాన్ ఎలాంటి నిధులు సమీకరించరాదని 2011 మే 23న ఆదేశించింది. అయినా హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ట్రస్ట్ పేరుతో కోట్లాది విలువైన భూములను కొట్టేసింది. వాస్తవంగా బెంగుళూరులోని ఇస్కాన్ బెంగుళూరులో 14 ఎకరాల విలువైన భూమిని తీసుకొని షాపింగ్ మాల్, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించడానికి ప్రయత్నిస్తే కర్ణాటక ప్రభుత్వం భూములను వెనక్కు తీసుకుంది. ఇక్కడ కూడా కమర్షియల్ కార్యకలాపాల కోసమే ఈ భూమిని తీసుకున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. వెంటనే ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి 
- హరేకృష్ణ మోసాలపై పోరాటం చేస్తున్న స్థానికుడు రవికుమార్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

1 కామెంట్‌:

Perugu Balu చెప్పారు...

సమైకాంద్ర అని ఒక ఉద్యమం నడిచింది హైదరాబాద్ నది బొడ్డున ఒక సభ కూడా జరిగింది కోట్ల రూపాయలు కర్చ్చు చేసారు ఎవరి డబ్బు ఎందుకు ఇంత కర్చు భూ కబ్జాదారులు వారి వ్యపారాల ముసుగులో చేస్తున్న ఈ అక్రమాలు బయటికి వస్తాయీ అని అంత డబ్బు కర్చుపెట్టాను అంకున్నారు ఇప్పుడు అది కూడా వృధా అయ్యింది వీరి భరతం పట్టాలి చట్టపరంగా వీరింగ్ శిక్చించాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి