గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 26, 2014

రైల్వేగేటా.. అదెక్కడ..?

- ఎక్కడోతప్ప కానరాని రైల్వేగేట్లు
- మృత్యుకుహరాలుగా మారుతున్న క్రాసింగ్‌లు
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైల్వేశాఖ
- ప్రమాదం జరిగితే తప్ప, స్పందించని అధికారులు
రైల్వేగేట్లు మృత్యువుకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. వాయువేగంతో దూసుకువస్తున్న రైళ్లు కన్నుమూసి తెరిచేలోపే వందలమంది ప్రాణాలను కబళిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 10వేల వరకు కాపలాలేని రైల్వే క్రాసింగ్‌లు ఉండగా, రాష్ట్రంలో 400లకు పైగా ఉన్నట్లు రైల్వే శాఖ లెక్కలు చెప్తున్నాయి. 
raiwgteadhekadaరాష్ట్రంలో కాపలాలేని రైల్వేక్రాసింగ్‌ల పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రధాన రైల్వే మార్గమైన విజయవాడ- సికింద్రాబాద్ మధ్య ఉన్న ఖమ్మం జిల్లాలో భారీగానే రైల్వే గేట్లు ఉన్నాయి. డోర్నకల్ నుంచి ఇల్లెందు వరకు, డోర్నకల్ నుంచి కొత్తగూడెం వరకు అనేక క్రాసింగ్‌లు ఉన్నా ఎక్కడా రైల్వే గేట్లు కనిపించవు. దశాబ్దాలు కిందటనే రైల్వే లైను పడినా.. గేట్ల నిర్మాణంలో రైల్వేశాఖ ఎక్కడాలేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. నిత్యం రద్దీగా ఉంటే ఇల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తీలోనే గేటు ఏర్పాటుచేయలేదంటే ఇక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ జిల్లాలో 171 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉండగా.. సికింద్రాబాద్ - బీబీనగర్ - భువనగిరి - కాజీపేట, సికింద్రాబాద్ - బీబీనగర్ - నడికుడి - గుంటూరు వెళ్లే రెండు లైన్లు ఉన్నాయి.

ఈ మార్గాల్లో క్రాసింగ్‌ల వద్ద కాపలా సరిగా లేకపోవటంతో 1994 నుంచి ఇప్పటి వరకు సుమారు 100మందికిపైగా మృత్యువాత పడ్డారు. బీబీనగర్ - నడికుడి మధ్య పగిడిపల్లి నుంచి వాడపల్లి వరకు 86 క్రాసింగులు ఉంటే.. 30కిపైగా క్రాసింగుల వద్ద గేట్లు లేవు. మసాయిపేట ఘటనతో వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రైల్వేశాఖ, జిల్లా విద్యాశాఖాధికారులు వేర్వేరుగా అత్యవసర సమావేశాలు నిర్వహించారు. లెవల్‌క్రాసింగ్‌ల వద్ద 24 గంటలు షిఫ్టుల వారీగా సిబ్బంది ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు రైల్వే గేట్లు ప్రమాదకరస్థితిలో ఉన్నాయి. మర్పల్లి మండలంలోని కొత్లాపూర్-కోటమర్పల్లి మధ్యలో రైల్వేగేటు లేకపోవడంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి.

నవాబుపేట్ మండలంలోని ముబారక్‌పూర్‌లో రైల్వేగేటు ఉన్న కాపలదారుడిని అధికారులు నియమించలేరు. కాచిగూడ- ద్రోణాచలం రైల్వేలైన్‌లో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని తిమ్మాపూర్ స్టేషన్ నుంచి ఆలంపూర్ స్టేషన్(కర్నూల్ సరిహద్దు) వరకు మొత్తం 110 రైల్వే లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటిలో కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లు 33 ఉన్నాయి. మే 5, 1995న బాలానగర్ మండలంలోని రంగారెడ్డిగూడలో కాపలా గేటులేని లెవల్ క్రాసింగ్‌వద్ద దాటుతున్న జీపును రైలు ఢీకొట్టడంతో.. అందులో శుభకార్యం నిమిత్తం వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 13మంది మృత్యువాత పడ్డారు. 1998లో దేవరకద్ర మండలంలో ఆరుగురు, 2012లో కౌకుంట్ల వద్ద ఐదుగురు ఈ తరహా ప్రమాదాల్లో మృతిచెందారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీవాడ, తలమడుగు మండల కేంద్రంలో ఒకటి, అదే మండలంలో మరో మూడు రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటికి కాపలాదారులను నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 12 చోట్ల రైల్వే క్రాసింగులు కాపలా లేకుండా ఉన్నాయి. ఇక్కడ ఎటునుంచి ఏ రైలు వచ్చి ఢీకొంటుందోనని స్థానికులు భయపడుతున్నారు.

రైలు అసిస్టెంట్ డ్రైవరే.. గేటుకీపరు: కరీంనగర్ జిల్లాలోని పలు మార్గాల్లో రైల్వే గేట్ల వద్ద కాపలాదారులు లేరు. దీంతో రైలు డ్రైవరే గేటు కీపరు పనిని చేస్తున్నారు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ఆర్మూర్ వరకు పూర్తికాగా, జగిత్యాల వరకే నడుపుతున్నారు. ఈ మార్గంలో దక్షణ మధ్యరైల్వే జీఎం సర్వే చేసినప్పుడు రైల్వే గేట్ల ఆవశ్యకతను గుర్తించి మంజూరు చేశారు.

గేట్లు వచ్చింది.. కానీ కాపలాదారుడు లేడు. దీంతో పుష్పుల్ రైలు దేశ్‌రాజ్‌పల్లి గేటుకు కాస్త దూరంలో ఆగితే.. డ్రైవర్‌కు అసిస్టెంట్‌గా ఉన్న వ్యక్తి కిందికి దిగి గేటు వేసి పచ్చజెండా ఊపుతాడు. రైలు ముందుకు కదిలాక గేటు ఎత్తి సదరు ఉద్యోగి రైలు ఎక్కుతాడు. మధ్యలో మూడు చోట్లా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ గేట్ల వద్ద కాపలాదారులను నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాసాయిపేటలో జరిగిన ఘటనే సరిగ్గా 32 సంవత్సరాల క్రితం జిల్లాలోని కొలనూరు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. మార్చి 20, 1982లో జనతా ఎక్స్‌ప్రెస్ ఓ బస్సును ఢీకొన్న ఘటనలో తీర్థయాత్రలకు వెళ్తున్న 61మంది భక్తులు మృత్యువాత పడ్డారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

రైల్వేగేట్ లేకపోవడానికి కారణం ఆంద్రోళ్ళ కుట్రే. ఏమంటారు?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

పొరబడ్డారు! ఆంధ్రోళ్ళుకారు....ఆంధ్రా అక్రమార్కులు...ఆంధ్రాస్వార్థరాజకీయులు...ఆంధ్రానేతలు...తెలంగాణలో రైల్వేగేట్లు నిర్మించకపోవడానికి కారకులు! ప్రాంతీయవివక్షతో తెలంగాణను నిర్లక్ష్యం చేశారు...ఫలితంగా ఇలాంటి దుర్ఘటనలు!
వ్యంగ్యంగా అన్నా...ఆంధ్ర అక్రమార్కుల స్వార్థం ఖచ్చితంగా ఉందని ఒప్పుకోవడం సరియైనదేనంటాను! నిక్కము వక్కాణించితివి మహోజసా...!

కామెంట్‌ను పోస్ట్ చేయండి