గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, నవంబర్ 18, 2014

మన రాష్ట్రం...మన చిహ్నాలు...

PALAPITTA


-రాష్ట్ర అధికార చిహ్నాల ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్ర ..
-తెలంగాణ సంప్రదాయానికి ప్రాధాన్యం
రాష్ట్ర అధికారిక చిహ్నాలు ఖరారయ్యాయి. చిహ్నాల ఎంపికపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా కసరత్తు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా...

రాష్ట్ర జంతువుగా జింక
రాష్ట్ర పక్షిగా పాలపిట్ట
రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు(శమీవృక్షం)
రాష్ట్ర పుష్పంగా తంగేడి పువ్వు 
లను ఎంపిక చేశారు. 

Tealanganastate-symbols

అంతకు ముందు అటవీశాఖ అధికారులు రాష్ట్ర జంతువుగా అడవిదున్న, పక్షిగా పాలపిట్ట, చెట్టుగా ఇప్ప లేదా పువ్వుగా మోదుగపూవును ప్రభుత్వానికి ప్రతిపాదిన పంపించారు. ఇందులో పాలపిట్టను ఖరారు చేసిన సీఎం మిగతా వాటిలో మార్పులు చేశారు. తెలంగాణ జీవనానికి, మనో భావాలకు అనుగుణంగా చిహ్నాలను నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర కోణంలో చిహ్నాల ఖరారు జరిగిందని, స్వరాష్ట్రంలో మన చరిత్ర నేపథ్యాన్నే పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం అవసరమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. తెలంగాణ ప్రకృతితో ముడిపడిన అంశాలతోపాటు ప్రజల విశ్వాసాలు, పురాణాల నేపథ్యం, శుభాశుభాలు తదితర అంశాలపై లోతైన పరిశీలన జరిపిన తర్వాతే ముఖ్యమంత్రి చిహ్నాలపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ ఏ చిహ్నాలను ఎందుకు ఖారారు చేయాల్సి వచ్చిందో సీఎం వివరించారు.

TANGEDU-PUVVU


జమ్మిచెట్టు ఆశీర్వాదం..



Tealanganastate-symbols

జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవనంలో అంతర్భాగం. రాష్ట్రంలో గొప్పగా జరుపుకునే పండుగ దసరా. ఆ రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి ఆకును బంగారంగా భావించి స్వీకరిస్తారు. మిత్రులు బంధువులతో అలయ్‌బలయ్ చేసినా పెద్దలకు నమస్కరించినా, పాదాభివందనం చేసినా జమ్మిఆకును సమర్పించి వందనం చేయడం తెలంగాణ విశిష్ట సంప్రదాయం. ఉన్నది అందరూ పంచుకోవడం అనే తెలంగాణ సంస్కృతికి ప్రతీక. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఆయుధాలను జమ్మిచెట్టుపై భద్రపరిచారు. దసరా రోజునే శమీవృక్ష పూజ అనంతరం ఆయుధాలు దించి యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. జమ్మి చెట్టు శక్తి, ఆశీర్వాదం వల్లనే పాండవుల విజయం సాధ్యమైందనేది పురాణగాథ. ఇవాళ తెలంగాణ ప్రజల విజయానికి జమ్మి చెట్టు ఆశీర్వాదం అవసరముంది. జమ్మిచెట్టు అధికారిక చిహ్నంగా ఉండటం మేలు చేస్తుంది. అందుకే అది మన చెట్టయింది.

JAMMI-CHETTU


పాలపిట్ట శుభసూచకం..



పాలపిట్టకు తెలంగాణ సంస్కృతికి దగ్గరి బంధం ఉంది. దసరా పండుగ నాడు పాలపిట్టను దర్శించుకోవడం ఇక్కడి ప్రజలు పుణ్యకార్యంగా భావిస్తారు. ఏ పనిలోనైనా పాలపిట్ట కనిపిస్తే శుభసూచకమని తెలంగాణలో విశ్వాసం. లంక నగరంపై దండెత్తే ముందు శ్రీరాముడు పాలపిట్టను దర్శించుకున్నాడని జనశ్రుతి. తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాలలో విజయపథాన నడవడానికి శుభసూచకంగా పాలపిట్టను ఎంపిక చేశారు. 

DEER


తంగేడు పువ్వు.. మన అందరి పువ్వు..



పసుపుపచ్చ రంగుతో ప్రకృతికే వన్నె తెచ్చే తంగేడి పువ్వు ఇప్పుడు మన రాష్ట్ర పుష్పంగా రికార్డుకెక్కుతోంది. తెలంగాణ సంస్కృతికి తంగేడు పువ్వు నిలువుటద్దం. అదిలేని బతుకమ్మ పండుగను ఊహించలేం. తంగేడు పువ్వు సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా తెలంగాణ మహిళలు ఆరాధిస్తారు. ఈ కారణంగానే తంగేడు పువ్వును అధికారిక పుష్పంగా ముఖ్యమంత్రి ఖరారు చేశారు.

జింక ఎందుకంటే..



ఇక రాష్ట్ర జంతువు ఎంపికలో తెలంగాణ వాసుల మనస్తత్వాన్ని సీఎం పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రం దాదాపు అన్ని ప్రాంతాల చిట్టడవుల్లో సైతం జింకలు విరివిగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు సున్నిత మనస్కులు, అమాయకులు. జింక కూడా అత్యంత సున్నితమైనది, అమాయకమైనది. జింకకు భారతదేశ చరిత్రతో, పురాణాలతో గాఢమైన అనుబంధం ఉంది. రామాయణంలో జింకకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కారణంగా జింక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జంతువైంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి