గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఏప్రిల్ 25, 2016

పాలనకు ప్రజామోదం...

తెలంగాణ కొత్త రాష్ట్రమైనందు వల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. అయినా ఇంత తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను కదం తొక్కించి అభివృద్ధి, సంక్షేమ రంగాలలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. కొత్త రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందుకే సమర్థిద్దాం. సమయమిద్దాం అన్న వివేకం ప్రజల్లో ఉంది. అది ప్రతిపక్షాలకు లేకపోవడం విచారకరం.

sridar
సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే సమయానికి తెలంగాణలో సాధారణ ఎన్నికల ప్రక్రియ సాగింది. అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న జాతీయపార్టీలు, ప్రాంతీయ పార్టీలు మోహరించిన వేళ తెలంగాణ రాష్ట్ర సమితి ఒంటరిగా బరిలోకి దిగింది. మొత్తం 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఎవరికి తోచిన విధంగా వారు టీఆర్‌ఎస్‌ను తక్కువ అంచనా వేసి ఫలితాల నాటికి బొక్కబోర్లా పడ్డారు. 11 లోక్‌సభ సీట్లు, 63 అసెంబ్లీ సీట్లు తెచ్చుకుని టీఆర్‌ఎస్ అజేయశక్తిగా అవతరించింది. అనితర సాధ్యమైన ప్రజామోదంతో ఈ రెండేళ్లు అప్రతిహత ప్రస్థానాన్ని కొనసాగించింది.

2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. తర్వాత మూడు నెలలకే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే ప్రజామోదం పొందడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుండటం విశేషం. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చతికిలబడింది. హర్యానాలోనూ అధికార ఎన్డీఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు సాధించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించినా, ఏడాదిన్నరకే బీజేపీ దెబ్బకు కుప్పకూలిపోయింది.

దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాలలో అధికార పార్టీల పరిస్థితి బాగా లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బెంగళూరు కార్పోరేషన్ ఎన్నికల్లో భంగపడింది. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. గుజరాత్‌లోనూ అదే పరిస్థితి. గత సాధారణ ఎన్నికల్లో 24 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన క్రమంలో అధికారంలో ఉన్న బీజేపీ పది మాత్రమే గెలిచుకొని పద్నాలుగు చోట్ల ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తమ సీటును కాపాడుకున్నా, సాధారణ ఎన్నికల్లో రెండు వేల ఓట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో ఏకంగా 24 వేలు సాధించింది.

ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణలో జరిగినన్ని ఎన్నికలు మిగతా రాష్ర్టాల్లో ఎక్కడా జరగలేదు. 2014 సెప్టెంబర్‌లో మెదక్ ఉపసఎన్నిక మొదలుకొని ఈ నెల సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల వరకు ప్రజలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఓటర్లు మొత్తం కోటికి పైగానే. 43 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజామోదం ఈ ఎన్నికల్లో వెల్లడైంది. అంటే రాబోయే సాధారణ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ లాంటివే. ఈ రెండేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజామోదానికి ఈ ఎన్నికలు అద్దం పట్టాయి. అసాధారణ రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాలు నమోదు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశాయి. సిద్ధాంతాలు పక్కనపెట్టి పొత్తులు కుదుర్చుకున్నప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత మీద, కాలవైపరీత్యాల మీద నమ్మకం పెట్టుకున్నప్పటికీ ప్రతిపక్షాలకు అవేవీ కలిసి రాలేదు సరికదా 2014 సాధారణ ఎన్నికల కంటే దీనాతి దీనమైన స్థితికి దిగజారిపోయాయి.

2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీతోపాటు మెదక్ లోక్‌సభకు పోటీ చేశారు. లోక్‌సభకు రాజీనామా చేయడంతో నాలుగు నెలలకే మెదక్ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తన ఆధిక్యతను అదేస్థాయిలో నిలబెట్టుకుంది. విశేషమేమిటంటే నరేంద్రమోదీ రాజీనామా చేసిన వడోదర ఉప ఎన్నికలు అప్పుడే జరిగాయి. కానీ బీజేపీ మెజారిటీ రెండున్నర లక్షలు తగ్గింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని టీఆర్‌ఎస్ బద్దలు కొట్టింది. టీడీపీ, బీజేపీలకు ఒక్క వార్డూ దక్కలేదు. శాసనమండలి ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల్లో 11 స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.

వీటిలో ఆరు సీట్లను టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోవడం విశేషం. గత నవంబర్‌లో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితం సంచలనం సృష్టించింది. 2014లో టీఆర్‌ఎస్‌కు 3 లక్షల 92 వేల మెజారిటీ వస్తే, ఇటీవల ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి దయాకర్‌కు 4 లక్షల 60 వేల మెజారిటీ లభించింది. 64 ఏళ్ల దేశ ఎన్నికల చరిత్రలో అత్యధికమెజారిటీ సాధించిన మొదటి 10 మందిలో ఒకరిగా దయాకర్ చరిత్రకెక్కాడు. టీడీపీ బలపరిచిన బీజేపీ, కేంద్ర మాజీ మంత్రిని రంగంలోకి దింపిన కాంగ్రెస్ సహా మిగతా పార్టీలకు డిపాజిట్లు రాలేదు. నారాయణఖేడ్‌లోనూ అదే జోరు. తొలిసారిగా టీఆర్‌ఎస్ 53 వేల మెజారిటీతో విజయం సాధించింది. ఆరు దశాబ్దాల నారాయణఖేడ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇది రికార్డు మెజారిటీ.

హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని డివిజన్లను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. మూడు నియోజకవర్గాల్లో ఒక్కొక్క డివిజన్‌ను మాత్రమే కోల్పోయినా టీఆర్‌ఎస్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. పాతబస్తీలో సైతం ఎంఐఎంకు దీటుగా నిలిచింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 150లోని 99 డివిజన్లను భారీ మెజారిటీతో గెలుచుకుని టీఆర్‌ఎస్ చరిత్ర సృష్టించింది. ఇదే క్రమంలో వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌కే పరిమితమైన మజ్లిస్ మినహా విపక్షాల మనుగడ ప్రశ్నార్థంగా మారింది.

తెలంగాణ కొత్త రాష్ట్రమైనందువల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. అయినా ఇంత తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను కదం తొక్కించి అభివృద్ధి, సంక్షేమ రంగాలలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. కొత్త రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందుకే సమర్థిద్దాం. సమయమిద్దాం అన్న వివేకం ప్రజల్లో ఉంది. అది ప్రతిపక్షాలకు లేకపోవడం విచారకరం.
-(ఈ నెల 27న ఖమ్మంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతున్న సందర్భంగా)




జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



జై 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి