గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 12, 2015

వంకర మాటల వెనుక మర్మమేమిటి?





తెలంగాణలో దశాబ్దాల పాటు సాగిన పరాయి రాజకీయంతో అనేక పార్టీలు, అనేక సిద్ధాంతాలు బతికాయి తప్ప తెలంగాణ బతకలేదని పరిశోధన చేయాల్సిన అక్కరలేదు. అంతర్జాతీయ, జాతీయ, ఆంధ్రా రాజకీయాలకు తెలంగాణ కేంద్రమైంది. అవి పక్కప్రాంతాలకు, హస్తిన పాలకులకు, అంతర్జాతీయ ప్రభావాలకు వింటాయి తప్ప తమ బాగుకు ఏమేరకు ఉపయోగపడుతున్నాయని వెనక్కి తిరిగి చూసుకునే సరికి ఐదు దశాబ్దాలు గడిచిపోయాయి. తెలంగాణ వచ్చాక కొందరు మేధావుల అంతరంగం ఏమిటో కూడా బయటపడుతున్నది.

వామపక్ష మేధావులు అనేకులున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం వారికి మరింత బాగా ఉపయోగపడింది. కానీ ఈ మధ్య ఓ మేధావి తన మనసులోని అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు. మరో పదేళ్ల తర్వాత తెలంగాణ వస్తే బాగుండేది- అని ఆ మేధావి ఆమధ్య ఓ సదస్సులో అన్నట్లు మనం పత్రికల్లో, సోషల్ మీడియాలోవార్త చదివాం. ఇంతకీ పదేళ్ల తర్వాత తెలంగాణ వచ్చి ఉంటే బాగుండేదని ఆయన ఎందుకు అనుకుంటున్నట్లు? నాలుగేళ్లలోనే వందల మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి ఆయనకు తెలియదనుకోవాలా? మరి మరో పదేళ్లలో ఎంతమంది యువకులు అలాంటి ఆత్మహత్యలకు పాల్పడతారోననే ఆలోచన ఆయనకు ఏకోశానా ఎందుకు లేదు? తెలంగాణ రావడం ఆయనకు సుతారమూ ఇష్టం లేనట్లున్నదని ఓ మిత్రుడు ఒకరన్నారు. సమస్యలకు పరిష్కారాలు దొరకడం కంటే, నిరంతరం సమస్యలుంటేనే తమకు ప్రచార లబ్ధి ఉంటదని వారు భావించి వుంటారని ఆ మిత్రుడి అంచనా. 

కృష్ణా నీరు పాలమూరుకు మాత్రమే చెందాలె - అనే ఓ కొత్త వాదన వెనకాల కూడా ఇలాంటి మేధావులే ఉండడం గమనించాల్సిన విషయం. పాలమూరు వెనుకబాటును ఎవరో కాదంటున్నట్లుగా ఓ గోబెల్స్ ప్రచారానికి ఒడిగట్టడం వెనకాల పాలమూరు ప్రయోజనాలున్నాయా? పరాయి ప్రాంత ప్రయోజనాలున్నాయా?
నిజానికి జూరాల-పాకాల ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు75 శాతం పైగా సాగుతాగు నీటిని పాలమూరుకు మాత్రమే అందించనున్నాయి.


మిగిలిన సుమారు 20శాతం మాత్రమే నీరు భౌగోళిక స్థితిని బట్టి రంగారెడ్డి,నల్లగొండ జిల్లాలకు అందనున్నాయి. అయినా 75శాతంపైగా వినియోగం పాలమూరు జిల్లాకే ఉండబోతున్నది. మిగిలే 25శాతం జలాలు తెలంగాణకు దక్కకూడదని ఇలాంటి మేధావులు కనుక అనుకుంటే.. ఆ వరద జలాలు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు వెళితే వారికి అభ్యంతరం లేదనుకోవాలా? పక్కవాడు తాగితే అభ్యంతరం ఉండదు, ఇంటివాడు మాత్రం తాగకూడదనే ఈ ధోరణి వారి అసలు నైజాన్ని మనకు చెప్కనే చెప్పడంలేదా? నిత్య అసంతృప్తిని రగిలించి లబ్ధి పొందాలని ఆరాటపడేవారు, వచ్చిన తెలంగాణకు ఏ మేరకు ఉపయోగపడతారో పై విషయాలు మనకు చెప్పకనే చెపుతున్నాయి. 

ప్రజలను బతికించడానికి సిద్ధాంతాలు బతకాలి. కానీ సిద్ధాంతాలను బతికించుకోవడానికే తెలంగాణ వంటి ప్రజాకాంక్ష ఎప్పటికీ నెరవేరకూడదనుకోవడమే సమాజానికి ఒక ప్రమాదం. మరో పదేళ్ల తర్వాత వచ్చి ఉంటే బాగుండేదంటున్న వారితో తెలంగాణ సమాజంలో ఏకీభవించే వారుంటారా? తమ లబ్ధి తప్ప తెలంగాణ రావాలని, అది బాగుపడాలని కోరుకున్న వారెందరని వెదకాల్సిన పరిస్థితి రావడం నిజంగా కొంత బాధ కలిగించే విషయమే. పక్క రాష్ట్రం తప్పిదాలను పట్టించుకోకుండా, తెలంగాణ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడానికే వీరు అధిక ప్రాధాన్యమివ్వడం గమనార్హం.
వచ్చిన తెలంగాణకు పోలవరం ముంపు మండలాల అన్యాయం ఒక్కటే జరగలేదు. ఉమ్మడి రాజధాని, ఉమ్మడి ఉన్నత విద్య, ఉమ్మడి హైకోర్టు లాంటి అన్యాయాలూ ఉన్నాయి. అలాగే గత 58 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన సంక్షేమ,అభివృద్ధి దాదాపు 30 శాతం కాగా... ఇపుడు 42 శాతం అప్పులు అంటగట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టుల వాడకంలో పక్క రాష్ట్రం కలిగిస్తున్న అవాంతరాలూ ఉన్నాయి. కరెంటు వాటా విషయంలో పక్క రాష్ట్రం చేసిన ద్రోహం అందరికీ తెలిసిందే. ఇలాంటి అన్యాయాలపై తెలంగాణ పక్షాన నిలబడాల్సిన వారు ఎంతసేపూ తెలంగాణలోనే రంద్రాన్వేషణలకు పాల్పడుతుండడం బాగాలేదనే కన్నా.. అప్పట్లో వారు ఉద్యమాన్ని సమర్థించింది తమ ఉనికి కోసం తప్ప తెలంగాణ రావాలని, అది బాగుపడాలని కాదని కూడా ప్రజలు అనుకోవాల్సి వస్తుంది.


సంప్రదాయ పార్టీలు చేసే రాజకీయ విమర్శలు వేరు. కానీ కొందరు మేధావుల తొందరపాటు నిర్థారణల ఉద్దేశమేమిటో అర్థంకాదు. ఆలేరు ఎన్‌కౌంటర్‌పై ఎవరికైనా అనుమానాలుండటం సహజం. అది నిజమైన ఎన్‌కౌంటరా? బూటకపు ఎన్‌కౌంటరా? తేలాల్సివున్నది. ఆమేరకు ముఖ్యమంత్రి ముస్లిం మత పెద్దలకు హామీ కూడా ఇచ్చారు. ఒక ప్రజా ప్రభుత్వం నడపడం కొందరు మేధావులు భావిస్తున్నంత సులభం కాదు. అంతకు ముందు సూర్యాపేటలో ఇద్దరు కానిస్టేబుళ్లను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన తీవ్రవాదుల తీరు ఒక్క పోలీసులనే కాదు, యావత్ తెలంగాణ సమాజాన్ని కలవరపరిచింది. 

మరుసటి రోజు వరంగల్ జైలు నుంచి హైదరాబాద్‌లో కోర్టులో హాజరుపర్చడానికి ఐదుగురు తీవ్రవాదులను వ్యాన్‌లో తరలిస్తుండగా జరిగిన ఈ సంఘటనను ఏకపక్షంగా ఊహించడం కూడా సరికాదు. కరుడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్ మొదటి నుంచీ పోలీసులనే హతమారుస్తూ వచ్చాడని ఎవరూ మర్చిపోవద్దు.జానకీపురంలో ఇద్దరు తీవ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం వికారుద్దీన్‌కు అప్పటికే తెలుసు. ఇద్దరిని చంపగానే మీరు హీరోలయిపోయారా అని వికారుద్దీన్ పోలీసులను గేలిచేసినట్లు పత్రికల్లో చదివాం. కాబట్టి వికారుద్దీన్ గ్యాంగ్ తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండదనుకోవడం కూడా ఇప్పటికిప్పుడు సరికాదు. కాబట్టి ఏకపక్ష ఆలోచనలతో ప్రజా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటే వేరే విషయం. నిజానిజాలు తేలేదాకా ఇలాంటి మేధావులకు ఓపిక లేకపోవడమే వారి ఉద్దేశాలను తెలియజేస్తున్నది.

దేశం ప్రపంచీకరణలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు దాటిపోయింది. వెనక్కి రాలేనంత దూరం వెళ్లిపోయింది. నయా పెట్టుబడిదారీ విధానం యావత్ ప్రపంచాన్నే ఆవహించేసింది.అది పాత వ్యవస్థలను ధ్వంసం చేసి కొత్త వ్యవస్థలలో పోటీ బతుకులను తయారు చేసింది. అలాంటి దుర్వ్యవస్థలోకి జారిపోయిన దేశంలో తెలంగాణ వంటి ఒక సగటు రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా ఏం చేయగలదో ఈ మేధావులకు తెలియదనుకుందామా? అయినా..తనకున్న పరిధిలో దేశంలోని అన్ని రాష్ర్టాల కన్నా తెలంగాణ రాష్ట్రమే ఎంతో మిన్నగా పనిచేస్తున్నదనడంలో అనుమానం అక్కరలేదు. సాగు, తాగు నీటితో ఐదు దశాబ్దాలు తెలంగాణ అల్లాడింది. వచ్చిన తెలంగాణలో ఆ రెండింటికున్న ప్రాధాన్యం ఏమిటో తెలియని వారుండరు.

మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలు తెలంగాణ మనుషుల దాహార్తిని, పొలాల దాహార్తిని తీర్చడానికి ఉద్దేశించినవి. ఈ పథకాలను పూర్తి చేయగలిగితే, దేశంలో తెలంగాణ అంతటి సుసంపన్న రాష్ట్రం మరొకటుండదు. ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశంసించాల్సిందే. దేశంలో తాగునీటిని ప్రభుత్వాలు వ్యాపారం చేస్తున్నాయి. కానీ,తెలంగాణలో తాగునీటిని ప్రభుత్వమే చేపట్టి ప్రజలకు అందించనుంది. తెలంగాణకు సాగు, తాగు నీటిలోనూ శాశ్వత స్వావలంబనకై పనిచేస్తున్న ప్రభుత్వ తీరును ఈ కొందరు మేధావులు ఎన్నడైనా ప్రశంసించారా? సాలీనా ముప్ఫై వేల కోట్లు సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వమే కావడాన్ని వారు ఎప్పుడైనా మెచ్చుకున్నారా? 

టీఆర్‌ఎస్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మాటిచ్చింది. దాని అమలు ఆలస్యం కావచ్చు గానీ ప్రభుత్వం ఆ హామీని విరమించుకోలేదు. అంతేకాదు కొత్త ఉద్యోగాలను కూడా శాశ్వత ప్రాతిపదికననే ఈ ప్రభుత్వం భర్తీ చేయనుంది. కొత్త విద్యుత్‌ప్రాజెక్టులను కూడా ప్రభుత్వమే స్థాపిస్తున్నది. నిజానికి ఏరాష్ట్రం కూడా ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయలేదు. 

విద్యుత్‌ప్రాజెక్టులను ప్రభుత్వాలే స్థాపిస్తున్న రాష్ర్టాలూ లేవు. మూతపడిన పబ్లిక్‌సెక్టార్ కంపెనీలను నిర్దాక్షిణ్యంగా అమ్మకానికి పెడుతున్న రాష్ర్టాలున్నాయి తప్ప నిజాం షుగర్‌లాంటి ఫ్యాక్టరీని రైతులకే అప్పగిస్తామన్న తెలంగాణ వంటి రాష్ర్టాలు లేవు. సాధ్యమైనంత మేరకు ప్రైవేటును తరిమేసి స్వావలంబన దిశగా ఈ ప్రభుత్వం పని చేస్తున్నదా లేదా అని చూడలేని వారికి...ఈ ప్రభుత్వం పట్ల, వచ్చిన తెలంగాణ పట్ల ఉన్న ఉద్దేశాలేమిటో వేరేచెప్పనక్కలేదనుకుంటా! తెలంగాణలో మరే పార్టీ ప్రభుత్వం ఏర్పడినా ఈ దేశ ఆర్థిక విధానానికి అతీతంగా ఈ మాత్రమైనా చేయగలిగేది కాదు. అయినా.. తనకున్న పరిధిలో తెలంగాణ ప్రభుత్వం మెరుగ్గానే పని చేస్తున్నది. ఎంత మంచి ప్రభుత్వంలోనైనా తప్పులు జరగడం కూడా సహజమే. కానీ జరుగుతున్న మంచి పనులను వదిలేసి, తమకు కావలసిన అంశాలనే వెతుక్కొని విమర్శలకు దిగడాన్ని ప్రజలు ఎప్పుడూ మెచ్చుకోరు.

వెనుకటికి కామ్రేడ్లు మా బావలు అని ఎన్టీఆర్ అన్నారు. నిజంగానే తెలంగాణకు ఎవరూ చుట్టాలు లేరు. రైటిస్టు నుంచి సెంట్రిస్టు పార్టీలే కాకుండా తెలంగాణలో బతికే ప్రతి సైద్ధాంతికత కూడా కృష్ణానదికి ఆవలి ఆధిపత్యంలో ఉంటూ తెలంగాణలో బతికాయి. అందుకే తెలంగాణ వచ్చాక కూడా వాటి రంగు రుచి వాసన మారుతాయా లేదా అనే అనుమానం వెంటాడుతూనే ఉన్నది. ప్రభుత్వంలో జరిగే తప్పులను విమర్శించే, ఎత్తిచూపే హక్కును మేధావులు సద్వినియోగం చేసుకోవాలి. కానీ తెలంగాణ మరో పదేళ్ల తర్వాత వచ్చిఉంటే బాగుండేదనే స్వార్థంతో కూడిన మాటలను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారని వారు మరిచిపోవద్దు.



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి