భద్రగిరి మునగాలలఁ బలువిధముల
నెందఱో రాజు లంది, పాలించఁగాను,
కీర్తిఁ గన్నట్టి తెలగాణ కృపను గొన్న
యా నిజాం రాజులే, దయ నందఁ జేయఁ,
గొన్న మదరాసు ప్రెసిడెన్సి నున్న దొరలు
పాలనము చేసి నట్టివై వఱలిన యవి,
మనకు స్వాతంత్ర్య మబ్బిన మంచి సమయ
మందు మదరాసు రాష్ట్రమ్మునందు, నట్లె
యాంధ్ర రాష్ట్రమ్ములో నుండి, యంతలోనఁ
దరలె నాంధ్రప్రదేశమ్ముదౌచు మఱల!
మా తెలంగాణ పాలనమందు నుండి
తరలి పోయిన గ్రామాలు తిరిగి వచ్చి,
మా తెలంగాణముం జేరె మహితముగను!
ఆంధ్ర పాలన మందున నవియ యాఱు
వత్సరములున్న కారణావసరముననె
"మావె యా గ్రామము"లటన్న, మఱియు నవియె
వందలేండ్లుగఁ దెలగాణ మందుఁ బాలి
తములుగా నుండె మేమేమి తఱచి యనఁగ
వలెను? మావె యవియ కావె? వలదు చర్చ!
మా తెలంగాణ నడ్డఁగా మంచి యోచ
నమ్మె! "యీ గ్రామములు మావె, నమ్ముఁ"డనుచు,
విషముఁ జిమ్మెడి వాక్కులు! వేగిరమున
నిట్లు పల్కఁగ నఱువ దేండ్లెచట నుండ్రి?
యెన్నఁడైనను నంటిరే? "యివియ మావి"
యనుచు! నఱువ దేండ్ల క్రితము నట్టి వాని
మా తెలంగాణలోఁ ద్రోచి, మఱలి చూడ
కుండఁ జేతులు దులిపితిరండి మీరు!
అఱువ దేఁడుల నుండియు నాదరించి,
పెంచి, పెద్దఁ జేసిన యట్టి పెద్దవారి
పెంపకము నాదరించెడి విధ మిదేనె?
యెట్టి యభివృద్ధి చేసితి విట్టివాని?
ఆదరించని యమ్మయే యఱ్ఱుఁ జాచి,
నటనఁ జేయుచుఁ బల్కఁగా, నవియె యిచట
మా తెలంగాణలోఁ జేరి, మమతఁ బొంది,
యైక్యతనుఁ జాటుచుండఁగ, నయ్యొ, యయ్యొ!
మావి యెట్టులు కావయ్య? మతియ లేదె?
నోరు మూయుఁడు! మాటలు మీఱఁ బోక,
పరువు దక్కించుకొనుఁడయ్య పలుకుఁ దక్కి!
పుట్టి పెరిగెను తెలగాణ! మెట్టెను మద
రాసులో! స్వతంత్రమ్మదె రాఁగ, నాంధ్ర
రాష్ట్రమందున మూఁడేండ్లు క్రాఁగి క్రాఁగి,
పిదప మీ దుష్ట రాజకీయ దమన కృత
ముననె యాంధ్రప్రదేశాన మూఁడు నేండ్లు!
మొత్త మాఱేండ్లె పాలన మ్మొదుగ, మీరు
వానిఁ బాలింపఁగా నిష్టపడక తిరిగి
మా తెలంగాణలోఁ జేర్చి, మఱల యిపుడు,
కుట్రపూరిత యోచనఁ, గోరి, వాని
"మావి మావి" యనంగనే, మీవి యగునె?
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్లు:
How about bellari? And others in Karnataka n Maharashtra y r u not asking for them.
అయ్యా అజ్ఞాతగారూ! భద్రాచలం, మునగాలల్లోని ప్రజలు తమ మానాన తాము బతుకుతుంటే, వాళ్ళ ఊళ్ళు మావేనని ఆంధ్రావాళ్ళు దుష్టరాజకీయం చేస్తుండడం వల్లనే వచ్చింది ఈ గొడవంతా. ఈ గ్రామాల వాళ్ళు తమని ఆంధ్రాలో కలపవద్దు, తెలంగాణాలోనే కొనసాగించాలంటూ ఉద్యమించారు.
అలాగే బళ్ళారిలాంటి ఊళ్ళ విషయంలో ఆంధ్రావాళ్ళు వేలుపెడితే...వాళ్ళు..మేం తెలంగాణతోనే కలిసుంటాం అంటే, అవి మావే కాబట్టి, మా తెలంగాణలో కలుపుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు.
చిక్కంతా కపటాంధ్ర నాయకులవల్లా, పెట్టుబడిదారులవల్లా వస్తున్నది. వాళ్ళపైనే మా వ్యతిరేకత అంతా. మాకు అన్యాయం చేయని సీమాంధ్రులపై మాకు ఎలాంటి ద్వేషమూ లేదు. అన్యాయం చేసినవాళ్ళపై మా వ్యతిరేకత తప్పకుండా ప్రకటిస్తాం.
సమంజసమైన ప్రజాభీష్టాన్ని గౌరవించాల్సింది ప్రభుత్వం. అట్టి ముఖ్యమంత్రే తెలంగాణ ప్రజా వ్యతిరేకి కావడం దురదృష్టకరం. ఇన్ని జరుగుతున్నా సీమాంధ్ర పక్షపాతంతో, తెలంగాణ ప్రాంతాల పట్ల వివక్ష చూపుతున్నారు. తెలంగాణలోని ప్రాంతాలు కొంతకాలం ఇతరప్రాంతాలతో కలుపబడి, కొంతకాలానికి స్వంతప్రాంతంలో కలుపబడినా, మావే అనే ఆంధ్ర నాయకులకు సర్ది చెప్పవలసిన ముఖ్యమంత్రి మిన్నకుండటం దీన్ని ధ్రువపరుస్తోంది.
పోనీండి. ఏం చేద్దాం. ఎదుర్కోక తప్పదు.
స్పందించినందుకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి