గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 22, 2014

టీ బిల్లును చించి, తొక్కి మంటల్లో వేసినవారు తెలంగాణ ఉద్యోగులా?


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు -2014 ప్రకారం ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీ మంగళవారం శ్రీకారం చుట్టింది. సెక్రటేరియట్‌లో 1885 మంది ఉద్యోగులతో తాత్కాలిక జాబితాను విడుదల చేసింది. ఇందులో 1065 మంది ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులని, 800 మంది తెలంగాణ ఉద్యోగులని పేర్కొంటూ ప్రొవిజనల్ జాబితాను విడుదల చేశారు. తెలంగాణ బిల్లును చించి, కాళ్లతో తొక్కి, మంటల్లో వేసినవారిని, తెలంగాణవారిపై దాడులు చేసి, రెచ్చగొట్టిన ఉద్యోగులను తెలంగాణవాసులుగా పేర్కొంటూ ప్రొవిజినల్ జాబితాలో చేర్చడం దుమారం రేపుతోంది. ఈ జాబితా విడుదల చేసిన కొద్దిగంటలలోనే సచివాలయ తెలంగాణ ఉద్యోగులు భగ్గుమన్నారు. సీమాంధ్రప్రాంత ఉద్యోగులను తెలంగాణ జాబితాలో చేర్చడంపై మండిపడుతున్నారు.

నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో అన్యాయాల వల్లే తెలంగాణ ఉద్యమం మొదలైందని, రాష్ట్రం విడిపోయినా ఆ కుట్రలు అలాగే కొనసాగుతున్నాయని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొందరు ఉద్యోగులను కుట్రపూరితంగా తెలంగాణకు కేటాయిస్తూ జాబితాను తయారుచేశారని వారు మండిపడుతున్నారు. ప్రొవిజినల్ జాబితా విడుదలైన వెంటనే తెలంగాణ ఉద్యోగుల వేదిక, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, సెక్రటేరియట్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్, సెక్రటేరియట్ గెజిటెడ్ అధికారుల సంఘం, సెక్రటేరియట్ టీఎన్జీవో సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రొవిజనల్ జాబితాలో పేర్కొన్న విధంగానే ఉద్యోగుల విభజన చేస్తే పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ప్రొవిజనల్ జాబితాను జిల్లాల ప్రాతిపదికగా రూపొందించారు. ఇలా చేయడం వల్ల తెలంగాణ పోస్టులు కూడా భారీగా తగ్గాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇక సోమవారం అర్ధరాత్రి జాబితా విడుదల చేసి, బుధవారం మధ్యాహ్నంలోగా అభ్యంతరాలు, విజ్ఞప్తులను చెప్పాలని కోరడం కూడా కుట్రలో భాగమేనని వారు విమర్శిస్తున్నారు.

సెక్రటేరియట్‌లో ఉద్యోగాల సంఖ్య 4417. ఇందులో 1379 ఖాళీలు ఉండటంతో ప్రస్తుతం 3038 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఏనాడూ పెద్ద మనుషుల ఒప్పందాల ప్రకారం సచివాలయంలో నియామకాలను జరుపలేదని తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సచివాలయంలో నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను, రాజ్యాంగాన్ని, న్యాయసూత్రాలను, హైకోర్టు తీర్పులను, స్థానిక నిబంధనలను ఉల్లంఘించారని, 50 సంవత్సరాలలో అడిషనల్ సెక్రటరీ కేటగిరీలో ఒక్క తెలంగాణ అధికారిని కూడా నియమించకపోవడమే ఇందుకు నిదర్శనమని వారంటున్నారు. దీనిపై ఉద్యోగులు ఉద్యమాలు చేయడంతో, 2007లో సెక్రటేరియట్, హెచ్‌వోడీ, రాష్ట్రవ్యాప్త ఉద్యోగులు తమ సర్వీసుబుక్‌లలో విధిగా తమ స్థానికతను పొందుపరచాలని, అందుకు సంబంధించిన పత్రాలను పొందుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు తమ బొనాఫైడ్ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి స్పెషల్ క్యాజువల్ లీవులను కూడా మంజూరు చేశారు. ఇంత జరిగినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వేలమంది ఉద్యోగులు స్థానికతను రికార్డు చేయలేదన్న ఆరోపణలున్నాయి. సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువమంది తమ స్థానిక వివరాలను అందజేయలేదని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. 

ప్రొవిజనల్ లిస్ట్‌పై ఆగ్రహజ్వాలలు:
తెలంగాణ ఉద్యోగుల జాబితాలో సీమాంధ్రులను చేర్చి మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితులను కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు అనే ప్రధాన డిమాండ్‌ను అధికారులు బేఖాతర్ చేశారు. మార్గదర్శక సూత్రాల పేరుతో అన్యాయం జరిగితే తెలంగాణ భగ్గుమంటది. తస్మాత్ జాగ్రత్త.
- జి దేవీప్రసాద్, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు

సచివాలయ తెలంగాణ ఉద్యోగుల జాబితా పేరుతో ప్రభుత్వం తప్పుడు జాబితాను ప్రకటించింది. టీ బిల్లును తొక్కి, చించి మంటల్లో వేసిన వారిని తెలంగాణ ఉద్యోగులుగా పేర్కొంటున్నారు. వారు తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం పాలుచేశారు. ఇదే విధానం కొనసాగితే తాడోపేడో తేల్చుకుంటాం. సచివాలయ తెలంగాణ ఉద్యోగుల జాబితాను మేమే తయారు చేసి గవర్నర్‌కు అందజేస్తాం 
- ఎం నరేందర్‌రావు, సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా కనిపిస్తున్నది. 800 మంది తెలంగాణ ఉద్యోగులని తేల్చిన జాబితాలో 200 మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారు. వారి పుట్టుపూర్వోత్తరాలన్నీ మాకు తెలుసు. విభజన పేరుతో జరుగుతున్న కుట్రలను ఛేదిస్తాం. పాలకులను నిలదీస్తాం. స్థానికతను చెప్పలేని ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఎలా చెల్లిస్తోంది. 
- ఏ పద్మాచారి, తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు

విభజనలో స్థానికత ప్రాతిపదిక కావాలని, ఇప్పటికే చాలా సార్లు విభజన కమిటీలకు విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ స్థానికేతరులతో తెలంగాణ సెక్రటేరియట్ జాబితాను ప్రకటించారు. ఇందులో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులందరినీ లెక్కకట్టి వారి రాష్ట్రానికి కేటాయించే దాకా ఉద్యమిస్తాం. 
- కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి

తెలంగాణ ఉద్యోగులను, ఉపాధ్యాయులను తెలంగాణకే కేటాయించాలని, స్థానికేతరులను వారి సొంత  రాష్ట్రానికి పంపించాలని గత మూడు నెలలుగా గగ్గోలు పెడుతున్నాం. ఇంతచేసినా వినిపించుకోకుండా తెలంగాణ జాబితా పేరుతో సీమాంధ్రులను మా మీద బలవంతంగా రుద్దుతున్నారు. 
- ఎం మణిపాల్‌రెడ్డి, టీఆర్టీయూ అధ్యక్షుడు

ఎక్కడివాళ్లు అక్కడే ఉంటారని విభజన మార్గదర్శక సూత్రాలను ఇవ్వడం అన్యాయం. దీనితో రెండు రాష్ట్రాల్లో పాలన సంక్షోభంలో పడుతుంది. తెలంగాణలో 3,400 మంది సీమాంధ్ర అధికారులు రాష్ట్రస్థాయి కేడర్‌లో ఉన్నారు. సీమాంధ్రలో 1,400 మంది తెలంగాణ అధికారులు పనిచేస్తున్నారు. అక్కడి అధికారులను ఇక్కడికి, ఇక్కడివారిని అక్కడికి పంపించాలని పలు సందర్భాలలో విజ్ఞప్తి చేశాం. ఎక్కడి అధికారులు అక్కడేనన్న నిబంధనలను పాటిస్తే పరిపాలనలో సంక్షోభం తప్పదు. 
- పి మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి