గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 11, 2014

ఈ ఐపీఎస్‍లు తెలంగాణలోనే ఉంటారట...ఆంధ్రకు పోరట...!



-తెలంగాణను స్థానికతగా చూపుతున్న ఖాకీలు
-ఆంధ్రాకు వెళ్లబోమంటూ సీమాంధ్ర పోలీసుల ఆప్షన్
-ఉద్యమంపై అక్కసు చూపినవారు ఎలా ఉంటారంటున్న తెలంగాణ ఐపీఎస్‌లు

తెలంగాణ ఉద్యమం సందర్భంగా అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించిన సీమాంధ్రకు చెందిన ఐపీఎస్‌లు సైతం ఇక్కడే తిష్ఠవేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై లాఠీచార్జీలు, బాష్పవాయు గోళాలతో విరుచుకుపడి.. ఉద్యమంపై అక్కసు వెళ్లగక్కిన పోలీసు అధికారులూ తమ ఆప్షన్ ఇక్కడే అంటున్నారు. 

ఆప్షన్ అవకాశాన్ని ఆధారంగా చేసుకొని సీమాంధ్రకు చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులు తెలంగాణలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వీరిలో డీజీ స్థాయి నుంచి డీఐజీ స్థాయి వరకు అధికారులున్నారు. సీమాంధ్రలో పుట్టిపెరిగిన వీరి తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా రాజధాని హైదరాబాద్‌లో ఉండిపోయారు. ఇదే ఆధారం చేసుకొని మేమూ తెలంగాణ వారిమే. హైదరాబాద్‌లో చదువుకున్నాం.. ఇక్కడే ఉద్యోగాల్లో చేరాం. ఇక్కడే ఆప్షన్ ఇస్తాం అని వాదిస్తున్నారు. 

వ్యతిరేకిస్తున్న టీ ఐపీఎస్‌లు..
ఇన్నాళ్లూ తెలంగాణ ఉద్యమం అంటే ఏమాత్రం గిట్టనివిధంగా.. సీమాంధ్ర అనుకూల భావజాలంతో వ్యవహరించిన ఐపీఎస్‌లు సైతం ఇక్కడే ఆప్షన్ ఇస్తామనడాన్ని తెలంగాణ ఐపీఎస్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమాన్ని అణగదొక్కి.. లాఠీచార్జీలు, ఫైరింగ్‌లతో విద్యార్థుల చావుకు కారణమైన వారిని తెలంగాణలో కొనసాగించడమంటే.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని అభిప్రాయపడుతున్నారు. మిలియన్ మార్చ్, సాగరహారం వంటి ఉద్యమాల సందర్భంగా.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలప్పుడు అత్యుత్సాహంతో వ్యవహరించి.. రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయు గోళాలను ప్రయోగించిన సీమాంధ్ర పోలీసు అధికారులు ఎలా ఇక్కడ ఆప్షన్ ఇస్తారని తెలంగాణ ఐపీఎస్‌లు నిలదీస్తున్నారు. 

హైదరాబాద్ స్థానికతగా..
ఏళ్ల కిందట సీమాంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబాల నుంచి కూడా పలువురు ఐపీఎస్‌లుగా ఎంపికయ్యారు. వీరు కూడా తెలంగాణనే తమ స్థానికతగా చూపబోతున్నారు. వీరిలో ఏకెఖాన్, కృష్ణప్రసాద్, సీతారామాంజనేయులు, స్టీఫెన్ రవీంద్ర వంటి వారు ఉన్నారు. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన వీరు ఆప్షన్ ఏ ప్రాంతానికి ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. సర్వీస్ సమయాన్ని బట్టి నిర్ణయించుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. స్టీఫెన్ రవీంద్ర, సీతారామాంజనేయులు వంటి కొందరు అధికారులైతే తెలంగాణ ఉద్యమంపై విచక్షణారహితంగావ్యవహరించి.. విద్యార్థులపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. 

వీరే తెలంగాణ అధికారులు
తాతముత్తాతల నుంచి తెలంగాణలో పుట్టిపెరిగి.. ఇక్కడి నుంచే ఐపీఎస్‌గా కొలువుదీరిన వారు 30లోపే ఉన్నారు. ఇక్కడినుంచి తక్కువ మంది ఐపీఎస్‌లు ఉండటం.. సీమాంధ్ర సెటిలర్ ఐపీఎస్‌లకు అదనుగా మారింది. విభజన తర్వాత తెలంగాణకు 112 ఐపీఎస్ పోస్టులు అవసరం అవుతాయి. కాబట్టి ఈ ఉన్నత కొలువుల్లో ఉండేందుకు సర్వీస్‌బుక్స్‌లో హైదరాబాద్ స్థానికతగా చూపించి తెలంగాణలో పాగా వేసేందుకు సీమాంధ్ర ఐపీఎస్‌లు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ నుంచి డైరెక్ట్ రిక్రూటీస్ కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. 20 మంది ప్రమోటీస్ ఐపీఎస్‌లున్నారు. 

తెలంగాణ ఐపీఎస్ అధికారుల వివరాలివి:
డైరెక్ట్ రిక్రూటీస్ 
అరుణ బహుగుణ, తేజ్‌దీప్ కౌర్, 
మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, 
ప్రవీణ్‌కుమార్, అవినాశ్ మహంతి, అభిషేక్ మహంతి

ప్రమోటీస్
నవీన్ చంద్, వై గంగాధర్, మల్లారెడ్డి, 
ఎంకే సింగ్, సుమతి, విశ్వనాథ రవీందర్, 
శివశంకర్‌రెడ్డి, జనార్దన్, చంద్రశేఖర్‌రెడ్డి, 
శశిధర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, శివకుమార్, ప్రభాకర్‌రావు, సుధీర్‌బాబు, విశ్వప్రసాద్, 
కమలాసన్‌రెడ్డి, ఎం రమేష్, ఎ శ్రీనివాస్, 
ఎం శ్రీనివాసులు, రంగనాథ్

***     ***     *** 

ఇదే అంశంపై నేను గతంలో (13 మార్చి, 2014) రాసిన టపా:
(ఇందుకు సంబంధించిన వార్తాకథనం కూడా చదవండి)

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి