-తీవ్రంగా విభేదిస్తున్న టీ విద్యుత్ ఉద్యోగులు
రాష్ట్ర విభజన సమయంలోనూ తెలంగాణ విద్యుత్ సంస్థల్లో సీమాంధ్ర పెద్దలు కొందరు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో, తెలంగాణ జెన్‌కోల పేరిట కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు(ఇన్‌కార్పొరేట్)కు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వాటిల్లోనూ తామే డైరెక్టర్లుగా ఉంటామంటూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలపై ఒత్తిళ్ళు తీసుకువస్తుండడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఏర్పాటుచేస్తున్న ట్రాన్స్‌కో, జెన్‌కోలలో సీమాంధ్రుల వాసనలే ఉండకూడదని టీ విద్యుత్ ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుత ఏపీ జెన్‌కో.. విభజనలో భాగంగా తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీ జెన్‌కో) పేరిట రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వద్ద రిజిస్టర్ చేసింది. సంస్థకు డైరెక్టర్లుగా చూపిన ఏడుగురిలో రాయలసీమకు చెందిన డైరెక్టర్ (ఫైనాన్స్) పేరును చేర్చడాన్ని టీ విద్యుత్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. సీఎం కిరణ్ హయాంలో ఎంపికైన సదరు డైరెక్టర్ చిత్తూరు జిల్లాకు చెందినవారు. ఆయనను తెలంగాణ జెన్‌కోలో డైరెక్టర్‌గా ఏ విధంగా ప్రతిపాదిస్తారని ప్రశ్నిస్తున్నారు. సంస్థలో ఎంతోమంది తెలంగాణ ఉన్నతాధికారులు అందుబాటులో ఉన్నా సీమాంధ్ర డైరెక్టర్‌కు అవకాశం ఇవ్వడంలో ఉద్దేశ మేమిటని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు.
విద్యుత్‌రంగంలో సీమాంధ్రుల పెత్తనం వల్లే తెలంగాణకు అన్ని రకాలుగా అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. తక్షణమే తెలంగాణ జెన్‌కోలో ప్రతిపాదించిన సీమాంధ్ర డైరెక్టర్ స్థానంలో తెలంగాణ అధికారి పేరు ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ జెన్‌కో సంస్థలో డైరెక్టర్లుగా ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ పీ వీ రమేష్, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఏపీ జెన్‌కో డైరెక్టర్ (థర్మల్ ప్రాజెక్ట్స్) బలరాం, ఏపీ జెన్‌కో డైరెక్టర్ (ఫైనాన్స్) సత్యమూర్తి, ఏపీజెన్‌కో చీఫ్ ఇంజనీర్(ఐపీసీ) సచ్చిదానందం పేర్లను ప్రతిపాదించారు. తెలంగాణ జెన్‌కో అధికారిక రిజిస్ట్రేషన్ కోసం రూ.5లక్షల స్టాంప్‌డ్యూటీతోపాటు, రూ. 1,500కోట్ల ఆథరైజేషన్ క్యాపిటల్, రూ.2.5 కోట్ల అనాథరైజ్డ్ క్యాపిటల్ (ఆర్వోసీ ఫీజు) చెల్లింపులకు జెన్‌కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి