గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 17, 2014

తెలంగాణ ఆర్టీసీ ఆస్తులు కొల్లగొట్టే నివేదిక...ఒక కుట్ర!


-ఆస్తులన్నింటిలోనూ వాటా కావాలట
-అల్లుళ్లలా వసతి గహాలు కూడా కట్టాలట
-సీమాంధ్రుల డిమాండ్లకు బోర్డు తందానా
-తెలంగాణ కార్మికుల అభిప్రాయాలకు చోటే లేదు
-బోర్డు వైఖరిపై మండిపడ్డ టీఎంయూ

నిజాం కాలంనాటి ఆర్టీసీ ఆస్తులు కొల్లగొట్టే నివేదికకు ఆర్టీసీ పాలకవర్గం ఓటు వేసింది. ఆస్తులన్నీ రెండు భాగాలు చేయడాన్ని ఆమోదించింది. బోర్డులో సీమాంధ్రులదే మెజారిటీ కావడం.. ఉన్న తెలంగాణ వారు మౌనవ్రతం పాటించడంతో కళ్లెదుట తెలంగాణ సంపద కొల్లగొడుతున్నారు. ఈ నిర్ణయాలతో తెలంగాణ ఆర్టీసీకీ తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ కార్మికుల, కార్మిక సంఘాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా అవి అరణ్య రోదనలవుతున్నాయి. బోర్డు నిర్ణయంతో తెలంగాణ ఆర్టీసీకీ సుమారు రూ. 2 వేల నుంచి 2 వేల 5 వందల కోట్లు నష్టం వాటిల్లే అవకాశముంది. 

కార్మికుల ఓట్లతో నెగ్గిన తెలంగాణ మజ్ధూర్ యూనియన్‌కు విభజన సమయంలో జరుగుతున్న ఇటువంటి కీలక సమావేశంలో ప్రాతినిథ్యం లేదు. 15 మంది సభ్యులున్న ఈ బోర్డులో తెలంగాణ వారు నలుగురు మాత్రమే ఉన్నారు. ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీసీ అడ్మిన్‌తోపాటు గుర్తింపు సంఘానికి బోర్డులో ప్రాతినిథ్యం వహిస్తున్న కార్మిక నేత కూడా సీమాంధ్రకు చెందినవారే కావడంతో తెలంగాణ ఆర్టీసీకీ అన్యాయం జరుగుతోంది. తెలంగాణకు చెందిన ముగ్గురు ఈడీలలో ఒకరు జూలైలో పదవీ విరమణ పోందుతుండటం, మరో ఈడీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు చెందడంతో వారు నోరు మెదపలేదని తెలిసింది.

నివేదికలో అంశాలు..
ఆర్టీసీ ప్రధాన పరిపాలన కార్యాలయమైన బస్‌భవన్‌ను ఇరు రాష్ర్టాలకు విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బస్‌భవన్‌ను రెండు భాగాలుగా విభజించి ఏ వింగ్‌ను ఏపీఎస్ ఆర్టీసీకీ, బీ వింగ్‌ను టీజీఎస్ ఆర్టీసీకీ కేటాయించారు. అదేవిధంగా తార్నాక ఏరియా ఆస్పత్రి, ట్రాన్స్‌ఫోర్టు అకాడమిని రెండు భాగాలుగా విభజించారు. కళ్యాణమండపం, బ్యాంకు, ఏటీఎం ద్వారా వచ్చే అదాయాన్ని ఇరు ప్రాంతాలు సమానంగా పంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టులను కూడా ఇరు రాష్ర్టాలకు సమానంగా పంపిణీచేసారు. ఇప్పటికిప్పుడే పంచడానికి వీలులేని ఆస్తులను ఇరు రాష్ర్టాల ఆర్టీసీకీ పంపిణీచేయడంతోపాటు సీమాంధ్ర ఆర్టీసీకీ హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులపై హక్కు కల్పించారు. తార్నాకలోని రేడియాలజీ డిపార్ట్‌మెంట్, బ్లడ్‌బ్యాంకు, ఆపరేషన్ థియేటర్‌తోపాటు, మియాపూర్‌లోని బస్‌బాడీ ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాపు, ప్రింటింగ్‌ప్రెస్, ఐటీ సర్విసెస్ ఓపీఆర్‌ఎస్, సీఐఎస్, వీటీఎస్‌తోపాటు అనంతపురంలోని విండ్ ఎనర్జీ ప్రాజెక్టు ఆదాయంతోపాటు, ఈ ఆస్తులపై ఇరు రాష్ర్టాల ఆర్టీసీకీ హక్కు కల్పించారు. 

అల్లుళ్లలా చూసుకోవాలా?..
తెలంగాణ ప్రాంతానికి వచ్చే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలనే విపరీత డిమాండ్ మాత్రమే కాక, ఆ ప్రాంత డ్రైవర్, కండక్టర్ల విశ్రాంతికోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని సీమాంధ్ర ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ నిర్ణయాలపై తెలంగాణ కార్మిక వర్గం భగ్గుమంటోంది. మిగతా రాష్ర్టాల వారికిఎవరికైనా ఈ 60 ఏళ్లలో ఇలాంటి సౌకర్యాలు కల్పించారా? అని నిలదీస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని భవనాలే కట్టి తమకు ఇవ్వాలనడం సీమాంధ్ర కుటిల బుద్ధికి అద్దం పడుతోందని అంటున్నారు. 

సీమాంధ్రలో ఉన్న కార్యాలయాలను, ఆస్తులను సీమాంధ్ర ఏపీఎస్ ఆర్టీసీకీ కేటాయించి, తెలంగాణ ఆస్తులపై మాత్రం ఏపీఎస్ ఆర్టీసీకీ భాగస్వామ్యం కల్పించడమేమిటని ప్రశ్నిస్తోంది. హైదరాబాద్, ఆంధ్ర ఆర్టీసీలు విలీనం కాకముందే ఇక్కడ ఉండిన తెలంగాణ ఆస్తులను ఈ విభజన పరిధిలోకి చేర్చవద్దని వారంటున్నారు. తార్నాక ఆర్టీసీ ఆస్తి ప్రస్తుత విలువ సుమారు. రూ. 6 వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతోపాటు కళ్యాణమంటపం ఆదాయంలో షేర్ కావాలనడం ఇక్కడి కార్మికులకు రుచించడం లేదు. పదేళ్ళు ఉమ్మడి రాజధాని అంటే పరిపాలన సౌలభ్యం కోసం ఇక్కడి భవనాలను మాత్రమే వాడుకోవాలని జీవోఎంలో స్పష్టంగా పేర్కొన్నా..నిబంధనలకు వ్యతిరేకంగా హక్కు కల్పిస్తూ నివేదిక తయారుచేసారు. సీమాంధ్ర ఎంప్లాయిస్ యూనియన్ నాయకులతోపాటు, నేషనల్ మజ్ధూర్ సీమాంధ్ర విభాగం ఆస్తులను 58ః42 నిష్పత్తితో పంచాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ మజ్ధూర్ యూనియన్ తెలంగాణ ఆస్తులు తెలంగాణకే చెందాలంటున్నది.

తెలంగాణకు అన్యాయం జరగదట...
ఇవ్వాల్సిన నివేదిక ఇచ్చేసి ఇరు ప్రాంతాల ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరగదని సీమాంధ్ర అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నివేదికలో ప్రతిపాదించిన అంశాలతోపాటు, తెలంగాణ కార్మికుల అభిప్రాయాలను గవర్నర్‌కు పంపిస్తామని కంటితుడుపు మాటలు చెబుతున్నారు. డిస్ట్రిబ్యూషన్ కామన్ ప్రాపర్టీస్ పేరిట తయారు చేసిన 10,11 పేజీలను తెలంగాణ ఆర్టీసీ యూనియన్లకు ఇచ్చిన నివేదికలో తొలగించి గవర్నర్‌కు పంపించిన నివేదికలో మాత్రం అలాగే ఉంచారు. అదనంగా తెలంగాణ కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలను మాత్రం జోడించారు. ఇకపోతే పార్లమెంటులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు నెగ్గిన తర్వాత సీమాంధ్రకు చెందిన 4 వందల బస్సులకు పర్మిట్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక సీమాంధ్రకు చెందని చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ హస్తం ఉన్నట్లు తెలిసింది. దీనిని పర్యవేక్షించాల్సిన ఆపరేషన్స్ ఈడీ ఈ విషయం పట్టించుకోలేదు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి