గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 29, 2014

లోకల్‌లో బోగస్ లీల

-తప్పుడు ధ్రువపత్రాలతో తిష్ఠకు సీమాంధ్ర ఉద్యోగుల కుట్ర
-కార్మికశాఖలో డిప్యూటీ కమిషనర్ స్థానికమాయ 
-సమాచార హక్కు చట్టంతో అసలు విషయం వెలుగులోకి
-చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ ఉద్యోగులు

ఉద్యోగుల విభజనలో రోజుకో బోగస్ లోకల్ సర్టిఫికెట్ బాగోతం వెలుగు చూస్తున్నది. స్థానికత ఆధారంగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు కొట్టేయడానికి సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు చేసిన మాయాజాలం అంతా ఇంతాకాదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన క్రమంలో స్థానికతపై మాయచేసి హైదరాబాద్ ఏడో జోన్‌లోనే కొనసాగడానికి ఆయా ప్రభుత్వశాఖల్లోని అధికారులు ప్రయత్నిస్తున్నట్లు టీ మీడియా పరిశీలనలో తేలింది. ఉద్యోగుల విభజనకు స్థానికతను ప్రధానంగా పరిగణన లోకి తీసుకుంటుండటంతో కొంతమంది హైదరాబాద్‌లోనే పనిచేయడానికి నకిలీ లోకల్ సర్టిఫికెట్లను జతచేస్తున్నారు.

వాస్తవానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్‌లో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏదైనా నాలుగు విద్యాసంవత్సరాలు చదివినవారు స్థానికులవుతారు. దీనిని ఆసరాగా చేసుకుని ఎంతోమంది సీమాంధ్రులు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి హైదరాబాద్ స్థానికులమంటూ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. ఏడో జోన్ హైదరాబాద్‌లో తిష్ఠవేశారు. కొందరు నాలుగు విద్యాసంవత్సరాలు పూర్తి చేయకుండానే గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్లను తెచ్చుకున్నారు. ఇంకొందరు ఎప్పుడో మూసేసిన పాఠశాలలో చదివినట్లు, గుర్తింపులేని అనామక పాఠశాలల్లో నాలుగేళ్లు వరుసగా విద్యను అభ్యసించినట్లు సర్టిఫికెట్లను జత చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కార్మికశాఖలో ఒక అధికారి బోగస్‌లీల వెలుగుచూసింది. కార్మికశాఖలో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్ నరేశ్‌కుమార్ స్థానికతపై తప్పుడు లెక్క చూపినట్లు తెలుస్తున్నది. దీనిపై వివాదం రాజుకుంటున్నది. ఆయన 1989లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 (ఎ)ద్వారా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 

తాను హైదరాబాద్‌లో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు నాలుగు సంవత్సరాలు చదివినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు. ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్న నరేశ్‌కుమార్ రికార్డులను జాగ్రత్తగా పరిశీలిస్తే స్థానిక కోటాలోకి రారనేది స్పష్టమవుతోంది. లోకల్ స్టేటస్ ఫ్రూఫ్ స్టడీ సర్టిఫికెట్ ను సమర్పించిన ఆయన మాసాబ్‌ట్యాంక్‌లోని క్లార్క్ కాన్వెంట్ స్కూల్‌లో 4, 5వ తరగతి చదివినట్లు పేర్కొన్నారు. కానీ, దానికి సంబంధించి స్టడీ సర్టిఫికెట్ లేదని స్పష్టం చేశారు. ఆబిడ్స్‌లోని సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్‌లో 6నుంచి 9వ తరగతి వరకు చదివినట్లు సర్టిఫికెట్‌ను సమర్పించారు. ఆ సర్టిఫికెట్లు అనేక అనుమానాలకు తావిచ్చాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వివరాలు తీసుకుంటే అసలు విషయం బయటపడింది. మూమూలుగా విద్యాసంవత్సరం జూన్‌లో మొదలై మార్చి లేదా ఏప్రిల్‌లో ముగుస్తుంది. కానీ, నరేష్‌కుమార్ విచిత్రంగా జనవరి 1న 1967లో సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్‌లో 6వ తరగతిలో చేరినట్లు పేర్కొన్నారు. 5వ తరగతి పూర్తయిన తర్వాత జనవరి వరకు ఏ పాఠశాలలో చదివింది చెప్పకపోవడం అనుమానాలకు తావిచ్చింది. 

దీంతోపాటు తొమ్మిదో తరగతి కూడా పూర్తి చేసినట్లు దాఖలాలు లేవు. 16 డిసెంబర్ 1970 వరకే అంటే పరీక్షలు పూర్తి కాకముందే ఆయన సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్‌ను వదిలినట్లు స్వయంగా లోకల్ స్టేటస్ ఫ్రూఫ్‌లో పేర్కొన్నారు. ఏ విధంగా చూసినా ఆయన నాలుగు విద్యాసంవత్సరాలు పూర్తి చేసిన రుజువులు లేవు. పీపుల్స్ ట్యుటోరియల్ కాలేజీ, గన్‌ఫౌండ్రీ ఆంధ్ర మెట్రిక్యులేషన్‌లో ప్రైవేట్‌గా పదో తరగతి పూర్తి చేసినట్లు స్టడీ సర్టిఫికెట్ తీసుకున్నారు. పీపుల్స్ ట్యుటోరియల్‌కు అసలు ఉనికిలో లేదని, పైగా ప్రైవేట్‌గా రాసిన ఆ సర్టిఫికెట్ స్థానికత కిందకు రాదని తెలంగాణవాదులు అభ్యంతరం లేవదీశారు. నరేశ్‌కుమార్ సర్టిఫికెట్లపై విచారణ జరిపి ఆయన అసలు స్వరూపాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమకు చెందిన నరేశ్‌కుమార్ జోన్-7లో ఎంపిక చేయడమే తప్పని ఆయన్ను వెంటనే ఆంధ్రాకు పంపాలని వారు కోరుతున్నారు. ఎంతోమంది అధికారులు బోగస్ సర్టిఫికెట్లతో మాయ చేస్తున్నారని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కొన్ని రోజులుగా తెలంగాణ ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

(నమస్తే తెలంగాణా దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి