కం.
మన చేతను వోటున్నది,
మనకును మేలొదుగఁ జేయు మంచి మనిషికిన్
మన వోటును వేసినఁ జా
లును నిఁక నైదేండ్ల దాఁక రోచిస్సులెగా!
ఆ.వె.
వోటు వేయునపుడె చేటు కల్గింపని
నాయకులను మనమునందుఁ దెలిసి,
యైదు వత్సరములు హర్షమ్మునిచ్చెడి,
మంచివారినెన్నుమయ్య నీవు!
తే.గీ.
మనకు బంగారు భావి సంభవముఁ జేసి,
మన బ్రతుకులను బాగుగా మలచి, మనను
వెలుఁగఁ జేసెడి యత్యంత ప్రియతములగు
నేతలను నెన్నుచో మన గీత మారు!
కం.
వేమఱు నాలోచింపుఁడు,
నీమముతో నీదు వోటు నీ రాష్ట్రమ్మున్
సేమముగ నుంచు వారికె!
ధీమాతో వోటు వేయి ధీమంతులకే!
తే.గీ.
వోటు తప్పుడు వ్యక్తికి పోవు కతన,
నైదు వత్సరములు నీదు హక్కు లిడుము
లంబడుటె కాదు, రాష్ట్రంపు సంబరములు
నాశనమ్మగుఁ గావున నమ్మ కెపుడు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి