గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 30, 2014

ఆర్టీసీ కేటాయింపుల్లో ఈడీల లొల్లి


ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వ్యవహారం విమర్శల పాలవుతున్నది. సీమాంధ్ర అధికారుల తెలివితేటలు, ముందస్తు ప్రణాళిక తెలంగాణ అధికారుల పదోన్నతులకు ఎసరు వచ్చేలా చేస్తున్నది. స్థానికత ఆధారంగా పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన ఆర్టీసీ ఈడీ.. తెలంగాణకు ఆప్షన్ ఇవ్వడమే ఇందుకు కారణమవుతున్నది. ఈ ఈడీ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్ ఇవ్వాలని భావించినప్పటికీ.. సీమాంధ్రకు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తెలివిగా వ్యవహరించి తెలంగాణ ఆప్షన్ ఇచ్చుకునేలా ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఇతను ఆంధ్రప్రదేశ్‌కు వెళితే సీమాంధ్రకు చెందిన వారికి కీలకపోస్టులు దక్కవనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ ఆర్టీసీని ఎంచుకోమని చెప్పినట్లు సమాచారం. మార్గదర్శకాలు విడుదలై సదరు ఈడీ ఇచ్చిన ఆప్షన్‌ను ప్రభుత్వం అంగీకరిస్తే.. సీనియారిటీ ప్రకారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్‌గా కొనసాగే అవకాశముంది. ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు తర్వాత ఈ పోస్టు (ఈడీఏ)కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగినా తమ కనుసన్నల్లో ఉండే అధికారులే తెలంగాణ ముఖ్య విభాగాల్లో పనిచేయాలనే ఉద్దేశంతో సీమాంధ్ర అధికారులు చక్రం తిప్పుతున్నారు.

భవిష్యత్ అవసరాల రీత్యా కీలక స్థానాల్లో తమ వారిని నియమించుకోవాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు. విభజన సందర్భంగా ఆర్టీసీలో ఉన్న 10 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ బోర్డు తీర్మానం చేసింది. అందులోభాగంగా ఆరుగురు ఈడీలను ఆంధ్రప్రదేశ్‌కు, నలుగురిని తెలంగాణకు కేటాయించారు. సీమాంధ్రకు చెందిన ఇద్దరు ఈడీలు వచ్చే నెలలో పదవీ విరమణ పొందుతున్నారు. వాస్తవానికి వారికి ఈడీల అవసరం ఉంది. అయినా, హెడాఫీసులో కొనసాగాలనే తాపత్రయం తో.. తెలంగాణ ఆర్టీసీ తమ కనుసన్నల్లో నడవాలనే దుర్బుద్ధితో కుట్రలకు పాల్పడుతున్నారు. ఈడీ పదోన్నతికి ఎదురుచూస్తున్న తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణతోపాటు రంగారెడ్డి జిల్లా రీజియన్ మేనేజర్‌గా ఉన్న వినోద్‌కుమార్ ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడే పరిస్థతి వస్తుంది. 

ఇరు రాష్ర్టాల ఆర్టీసీ కన్సల్టెంట్‌గా ఆపరేషన్స్ ఈడీ రమణారావు
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంతర్‍రాష్ట్ర సర్వీసులు సక్రమంగా నడిచేందుకు జూలై నెలలో పదవీ విరమణ పొందుతున్న ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ రమణారావును ఏడాదిపాటు కన్సల్టెంట్‌గా నియమించుకుంటున్నారు. దీనికి పాలకమండలి కూడా అంగీకరించింది. తెలంగాణకు చెందిన రమణారావును ఆపరేషన్స్ కన్సల్టెంట్‌గా నియమించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు తెలంగాణలో ఇష్టారీతిన తిప్పడానికి వీలవుతుందనే భావనతో సీమాంధ్ర అధికారులు చక్రంతిప్పుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

కార్ల కోసం.. బస్సుల కొనుగోలు:
బహుమతుల కోసం ఆర్టీసీ అధికారులు .. అడ్డగోలుగా బస్సులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము లేకపోవడంతో.. యాజమాన్యం కార్మికుల వేతనాలతో ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేస్తున్నది. దీని కోసం ఆర్టీసీ ఉద్యోగుల నెల జీతంనుంచి ఒక రోజు వేతనాన్ని తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ను యాజమాన్యం జారీచేసింది. సమాచారంలేకుండా వేతనాల్లో కోత విధిస్తూ ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై కార్మికులు మండిపడుతున్నారు. చాలీచాలని జీతంతో అవస్థలు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు ఈ ఏకపక్ష నిర్ణయం ఆవేదనకు గురిచేస్తున్నది. 

కనీసం కార్మిక సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు లక్షా 25 వేల మంది అధికారులు, కార్మికుల బేసిక్ వేతనం నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఉద్యోగుల నుంచి వచ్చిన రూ.6 కోట్లతో 24 బస్సులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ బస్సుల కొనుగోలు వెనుక అధికారుల స్వార్థం ఉన్నట్లు తెలిసింది. 24 బస్సులను కొనడం ద్వారా బస్సుల అమ్మకపు సంస్థలు ఐదు కార్లు బహుమతిగా ఇస్తున్నట్లు కార్మిక వర్గం ఆరోపిస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి