గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 18, 2014

కడుపు...నోరు...కట్టుకొని పనిచేద్దాం...

trsmembers


-కుల మతాలను పక్కన పెడదాం
-టీఆర్‌ఎస్ పైనే ప్రజల ఆశలన్నీ ...
-సంక్షేమ శాఖ నేనే ఉంచుకుంటా...
-వచ్చే 20ఏళ్లు మనదే అధికారం కావాలి
-అనుకున్న లెక్క కంటే 10-13సీట్లు తగ్గినయి
-టీఆర్‌ఎస్‌ను బలమైన పార్టీగా తీర్చిదిద్దుదాం
-మైనార్టీల రిజర్వేషన్లపై తమిళనాడుకు బృందం
-మోడీ గాలిని తట్టుకుని గెలిచినం

-టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశంలో కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి తావులేని పాలన ఉండాలని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ శాసనసభ, పార్లమెంటరీపక్ష సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. కడుపు నోరు కట్టుకొని పనిచేద్దాం.. పారదర్శకంగా పని చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుదాం అని ఆయన పిలుపునిచ్చారు. అధికారం వచ్చింది కదా! అని కొమ్ములు, కోరలు పెంచుకోవద్దు. హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉండాలి...అని ఎమ్మెల్యేలకు సూచించారు. కుల మతాలు పక్కకు పెట్టి ప్రజల సమస్యలే ఎజెండాగా పనిచేస్తేనే ప్రజల మన్నన పొందగలుగుతామని ఉద్బోధించారు. సుమారు గంటకు పైగా సాగిన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందున ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలనే అంశంపై చాలా సేపు మాట్లాడారు. త్వరలోనే నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యేలకు రెండు రోజుల ట్రైనింగ్‌క్లాసులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో వచ్చినట్లు తెలిసింది.

రాబోయే రెండేళ్లు తెలంగాణకు చాలా కీలకమైనవని, ఈ సమయంలో ఎమ్మెల్యేలంతా జాగ్రత్తగా వ్యవహరించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను ఆచరణలో పెట్టి తీరాల్సిందేనని అన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాం కదా...అని పార్టీ నిర్మాణం మరువొద్దు. క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా టీఆర్‌ఎస్‌ను తీర్చిదిద్దాలి. దేశంలోనే అత్యంత దృఢనిర్మాణం కలిగిన పార్టీగా మార్చాలి. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలి. రాబోయే 20 ఏళ్ల పాటు మనమే ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. వాస్తవానికి మనం అనుకున్న లెక్క కంటే 10-13 సీట్లు తక్కువగా వచ్చినయి. తక్కువ మెజార్టీలతో ఇతర పార్టీలు గెలిచిన చోట మనవారే వెనకంజలో ఉన్నారు. ఎమ్మెల్యేలు వరుసగా ఐదారుసార్లు ఎలా గెలుస్తారనే దానిపై కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి అని ఆయన అన్నారు. 

నిపుణుల సలహాలతో కార్యక్రమాలు..
తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి శాఖకు ఒక నిపుణుల కమిటీ వేసుకుని వారి సూచనల ఆధారంగా అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ ప్రతిపాదించారు. ప్రభుత్వంలోకి కూడా కొత్తగా ఎన్నికైన వారు వచ్చే అవకాశం ఉంది కనుక వారు ఎలా పనిచేయాలనే దానిపై కూడా రిటైర్డ్ ఐఏఎస్‌లతో ఒక కమిటీ వేసుకుందామని అన్నారు. సీఎం ఆఫీసులోని వారికీ ఒక కార్యాలయం ఉంటుందని, క్యాబినెట్ ర్యాంక్‌లోనే వారు పనిచేస్తారని అన్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించింది పేద ప్రజలని, ఉద్యమకారులను గెలిపిస్తేనే తెలంగాణ బాగుపడుతుందని నమ్మి ఓట్లేశారని...ఇతర పార్టీలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా దాన్ని తట్టుకుని టీఆర్‌ఎస్‌వైపు నిలబడ్డారని...కాబట్టి ఆ ప్రజలకోసం...ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పాలన సాగించాలని తెలిపారు.

సాంఘిక సంక్షేమ శాఖ నావద్దే...!
తెలంగాణలో దళితులు ఎంతో వెనుకబడి ఉన్నారు. అయితే వారు అభివృద్ధి చెందిండ్రు అనేది మాత్రం ప్రచారం మాత్రమే. ఎవరైనా అభివద్ధి చెంది ఉంటే...అది వారి వ్యక్తిగత కృషివల్లే. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల దళితులు అభివృద్ధి అయింది తక్కువే. దళితుల కోసం ఐదేళ్లలో 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చినం. ప్రతి యేటా జిల్లాకు రూ.500 కోట్ల చొప్పున ఖర్చు పెడుదాం. రెండేళ్లలోనే వారి జీవితాలు మారిపోవాలి. ఈ ఫండ్‌లోని ప్రతి పైసా దళితులకే చేరాలి. సాంఘిక సంక్షేమశాఖలో నిజాయితీ కలిగిన అధికారులను పెట్టుకుని నిధులు ఖర్చుపెడదాం. 

మీరు అంగీకరిస్తే ఈ శాఖను నా వద్దే పెట్టుకుని నిధులు ఖర్చు చేయాలని ఉంది...అని కేసీఆర్ అన్నట్లు సమాచారం. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చాం కనుక దీన్ని చట్టం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నట్లు తెలిసింది. తమిళనాడులో ఉన్న రిజర్వేషన్లను అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని అక్కడికి పంపాలని నిర్ణయించారు. తెలంగాణలో మెజార్టీ ప్రజలు పేదలేనని, వారి జీవన పరిస్థితులు చూస్తే కళ్లవెంట నీళ్లు తిరుగుతాయని అన్నారు.

మోడీని అధిగమించి గెలిచినం
దేశం మొత్తంగా మోడీ ప్రభావం ఉన్నా ఆయన్ను అధిగమించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలాన్ని సమీకరించుకున్నామని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. పేద ప్రజలు నమ్మి మనకు ఓట్లేసినందున వారి ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. మిగిలిన రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఎలాంటి సంబంధాలుంటాయో సీమాంధ్ర సీఎం చంద్రబాబుతో కూడా అలాంటి సంబంధాలే ఉంటాయని అన్నట్లు తెలిసింది. కొండా సురేఖ చేరికను కొందరు విమర్శించారని, ఇప్పుడు ఆమెను ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి పంపారని అన్నట్లు తెలిసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి