గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మే 28, 2014

మోడీ మొదటి క్యాబినెట్‌లోనే ముంచుడు కుట్ర


-పోలవరంపై నాయుడు ద్వయం ఎత్తులకు బలవుతున్న గిరిజనం
-ముంపు ప్రాంతాల విలీనంపై ఆర్డినెన్స్ రెడీ!
-205 గ్రామాలు ఆంధ్రాకే

తెలంగాణను ముంచే ప్రాజెక్టు పోలవరం. నోరులేని గిరిజనం ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే సీమాంధ్ర ప్రాయోజిత ప్రాజెక్టు. జల వనరుల నిపుణులు వద్దన్నా, డిజైన్ మార్చాలని తెలంగాణ మేధావులు కోరినా అడుగులు వడివడిగా పడుతూనే ఉన్నాయి. కేంద్ర సర్కారు తొలి క్యాబినెట్ సమావేశంలోనే కుట్రలు తారాస్థాయికి చేరా యి. ఇద్దరు నాయుళ్ల్ల (చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు) ఎత్తులు స్పష్టమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లోనే కలిపే ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ నుంచి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

లక్షలాది మంది గిరిజనం గూడుచెదిరేలా చేసేందుకు చాలాకాలంగా సీమాంధ్ర నాయకత్వం చేస్తున్న కుట్రలు ఫలించేటట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజల మనోగతానికి విలువివ్వకుండా సీమాంధ్ర పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడేందుకే మోడీ సర్కారు కూడబలుక్కుంది. ఖమ్మం జిల్లా కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలను ఆంధ్రాలో కలిపేందుకు ఆగమేఘాల మీద ఫైళ్లను కదిలిస్తున్నది. దీంతో 205 గ్రామాలు ఆంధ్రాకు వెళ్లనున్నాయి. నాలుగు మండలాలు పూర్తిగా, మూడు పాక్షికంగానూ ముంపునకు గురవుతున్నాయి. భద్రాచలం పట్టణం మినహా రెవెన్యూ పరిధి పూర్తిగా పోలవరం ముంపు పేరిట తెలంగాణ రాష్టానికి దూరమవుతోంది. మొదటినుంచి బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోలవరంపై పట్టుబడుతున్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే వారి ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు మోడీ సర్కారును ఒప్పించడంలో సఫలమైనట్లు సమాచారం. ఎన్నికల ప్రచారపర్వంలో బీజేపీ, టీడీపీలు పోలవరం కట్టితీరుతామంటూ శపథం చేశాయి. వారి పంతాన్ని నెగ్గించుకునేందుకు తొలి క్యాబినెట్‌ను వేదికగా చేసుకోవడం గమనార్హం. 

ఆర్డినెన్స్ మాట నిజమే!
పోలవరంపై క్యాబినెట్ భేటీలో ప్రత్యేకంగా చర్చించలేదని సమావేశం అనంతరం మీడియాతో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అన్నింటిని వివరంగా మీడియాకు చెప్పలేమన్న ఆయన కొన్ని అంశాలపై చర్చించామని మాత్రం తెలిపారు. ఐతే క్యాబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అంశం చర్చకు వచ్చినట్లు ఆ సమావేశానికి హాజరైన ఒక మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నందున బుధవారం మరోసారి జరిగే క్యాబినెట్ భేటీలో వాటిని చర్చించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. దీన్ని బట్టి పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుందన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అనుమానాలు నిజమైనట్లు తెలుస్తోంది. క్యాబినేట్ భేటీలో పోలవరం, ముంపు గ్రామాల విలీనంపై చర్చించినప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగానే గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఇప్పుడే వెల్లడించడం ద్వారా ప్రజల్లో ఎలాంటి భావోద్వేగాలు వస్తాయోనన్న అనుమానాలు వ్యక్తమైనట్లు తెలిసింది. 

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూ మోడీ సర్కారు ఆర్డినెన్స్ రూపకల్పనకు శ్రీకారం చుట్టడం తెలంగాణ వాదులను నిరాశ పరుస్తోంది. అమాయక గిరిజనానికి శాపంగా పరిణమించే పోలవరంపై ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకోకపోవచ్చునని భావించిన విశ్లేషకుల అంచనాలు తారుమారయ్యాయి. ఒక ప్రాంతాన్ని ముంచి మరో ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు రాజ్యాంగంలోని ఏ చట్టాలు అంగీకరించవని నిపుణుల అభిప్రాయం. ఓ జాతి మనుగడే ప్రశ్నార్థకమవుతోన్న తరుణంలో ఎన్నో ప్రజా సంఘాలు, పౌర సంఘాలు పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ఉద్యమాలు చేసిన విషయాన్ని కేంద్ర కొత్త సర్కారు పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ముంపు గ్రామాలు ఎన్నికలను బహిష్కరిస్తూ పోలవరంపై నిరసనను ప్రదర్శించాయి. ఏ అంశాన్ని ప్రతిపాదికగా తీసుకోకుండా ఏకపక్షంగా పోలవరం ముంపు గ్రామాల విలీనంపై ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. 

టీ టీడీపీ, టీ బీజేపీ ఏ పక్షం?
తెలంగాణ ప్రజా ప్రయోజనాలు కాపాడుకునేందుకు మహానాడులో తీర్మానం చేస్తామంటూ టీటీడీపీ నేతలు ప్రకటించారు. అలాగే బీజేపీ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మోడీ సర్కారు కృషి చేస్తుందంటూ ప్రగల్భాలు పలికారు. ఖమ్మం జిల్లా ఆదివాసి తెగను నిండాముంచుతూ తీసుకున్న ఈ నిర్ణయంపై ఈ రెండు పార్టీల తెలంగాణ నాయకత్వం ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి. పోలవరంపై స్పష్టత ఇవ్వాలని సార్వతిక ఎన్నికల ప్రచారంలో నిలదీసిన తెలంగాణ సమాజాన్ని తప్పించుకుతిరిగారు. ఇప్పుడూ ముఖం చాటేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నల్లధనంపై దర్యాప్తుకు సిట్
మోడీ సర్కార్ తొలిరోజే కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై దర్యాప్తు కోసం విశ్రాంత న్యాయమూర్తి ఎంబీ షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. వైస్‌చైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అర్జిత్ పసాయత్‌ను నియమించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరక్టర్ జనరల్, రెవెన్యూ కార్యదర్శి, సీబీఐ, రా, ఈడీ డైరెక్టర్లు, సీబీడీటీ చైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌లను సిట్ సభ్యులుగా నియమించారు. క్యాబినెట్ భేటీలో ప్రధానంగా రెండు అంశాలపైనే చర్చించామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సిట్ ఏర్పాటుతోపాటు గోరఖ్‌ధామ్ రైలు ప్రమాదంపై చర్చించామన్నారు. నల్లధనం వ్యవహారంలో కేంద్రం నిబద్ధతకు సిట్ ఏర్పాటే నిదర్శనమని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సుప్రీంకోర్టు విధించిన గడువు బుధవారంతో ముగుస్తుండటంతో తొలిసమావేశంలోనే సిట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. రైలు ప్రమాదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉన్నత స్థాయి సమీక్ష జరపనున్నట్లు ఆయన తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి