గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 12, 2014

రాష్ట్రం ఏర్పడింతర్వాత కరెంటు లోటుంటుందన్న నల్లారి మాట వట్టిదే...


-కలిసొచ్చిన ఒప్పందాలు.. 
-ఆంధ్ర- తెలంగాణ విద్యుత్‌లో ఇరురాష్ర్టాలకు వాటా
-12 ఏళ్లదాకా కొనసాగనున్న విద్యుత్ పంపిణీ
- పీపీఏలలో తెలంగాణకు 55 శాతం, సీమాంధ్రకు 45 శాతం 
-సీజీజీలో తెలంగాణకు 52.17, సీమాంధ్రకు 47.83 శాతం 
-మరో ఐదేళ్లలో తెలంగాణలో మిగులు విద్యుత్తు అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కోతలు రానున్నాయన్న ఆపోహలు వాస్తవదూరమని నిపుణుల మాట. విద్యుత్ సరఫరాలో అటుఇటుగా ప్రస్తుతమున్న పరిస్థితే కొనసాగుతుంది. అదేసమయంలో నూతన ప్రభుత్వం చొరవ తీసుకుంటే విద్యుత్ లభ్యత భేషుగ్గా కూడా ఉంటుంది. రాష్ట్రవిభజన సందర్భంగా కేంద్రం విధించిన నిబంధనల వల్ల తెలంగాణకు మేలు జరగనుంది. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు 12 ఏళ్లు యథావిధిగా కొనసాగనున్నాయి. 

ఫలితంగా రెండు రాష్ర్టాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ 12 ఏళ్లపాటు ఇరురాష్ర్టాల మధ్య పంపిణీ జరగనుంది. ఇటు జన్‌కో, అటు ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కూడా తయారయ్యే ప్రతియూనిట్ మీద ఇరు రాష్ర్టాలకు హక్కు ఏర్పడింది. ప్రైవేటు విద్యుత్ కేంద్రాలతో ఉమ్మడి రాష్ట్ర సర్కారు కుదుర్చుకున్న ఒప్పందాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదాహరణకు...జీవీకే ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు(జేగూరుపాడు-220 మెగావాట్లు) సర్కారుతో కుదుర్చుకున్న ఒప్పందం 2024 ఏప్రిల్ 13వరకు కొనసాగుతుంది. ఒప్పందం ప్రకారం అంతకాలం ఆ ఉత్పత్తిలో తెలంగాణకు వాటా వస్తుంది. ఇలాంటి ఒప్పందాల్లో కొన్ని 2019 దాకా కొనసాగనుండగా మరికొన్ని గరిష్ఠంగా 2036 దాకా కొనసాగనున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో కూడా తెలంగాణకు వాటా దక్కుతుంది. 

ఉమ్మడి రాష్ట్రంలో కుదుర్చుకున్న అన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 12 ఏళ్లు కొనసాగుతాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ జెన్‌కో పవర్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు(సీజీజీ), ప్రైవేటురంగంలోని విద్యుత్ ప్రాజెక్టుల పీసీఏలు యధావిధిగా అమలు జరగనున్నాయి. 

ఏ రాష్ర్టానికి ఎంతెంత..?
రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో జరిగే విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణకు 55 శాతం, సీమాంధ్రకు 45 శాతం వాటా నిర్ణయించారు. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల(సీజీజీ) విద్యుత్ వాటాలు తెలంగాణకు 52.17 శాతం, సీమాంధ్రకు 47.83 శాతంగా విద్యుత్ విభజన ఖరారైంది. వీటికితోడు ప్రైవేటు రంగ పీపీఏలు ఉంటాయి. వీటిలో జీవీకే ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు(జేగూరుపాడు-220 మెగావాట్లు) 2024 ఏప్రిల్ 13వరకు ఉండగా, గౌతమి పవర్ లిమిటెడ్(పెద్దాపురం-464మెగావాట్లు) 2024 జూన్ 4, కోనసీమ గ్యాస్ పవర్ లిమిటెడ్(రావులపాలెం-444.08 మెగావాట్లు) పీపీఏ 2025 జూన్ 29 వరకు, జీఎమ్మార్ వేమగిరి పవర్ జనరేషన్ లిమిటెడ్(వేమగిరి-370 మెగావాట్లు) విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2029 సెప్టెంబర్ 15వరకు విద్యుత్ ఉత్పత్తి గడువును కలిగి ఉంది. దీంతో మరో రెండు దశాబ్దాల వరకు తెలంగాణ కరెంటుకు డోకా లేదనే విషయం స్పష్టం అవుతుంది. 

తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యమెంత..?
తెలంగాణలో థర్మల్ పవర్ ఉత్పత్తి 2,502 మెగావాట్లు ఉండగా, జల విద్యుదుత్పత్తి (హైడల్)1, 600 మెగావాట్లు మేరకు అందుబాటులో ఉంది. వీటికితోడు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రయివేటురంగంలో ఉన్న గ్యాస్ పవర్ ప్రాజెక్టులు(ఐపీపీ)ల నుంచి 2,497 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంలో తెలంగాణ వాటాలు యథావిధిగా కొనసాగనున్నాయి. అలాగే సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల(సీజీజీ)ల నుంచి 9,890 మెగావాట్ల విద్యుత్తులో తెలంగాణకు అధికంగా కేటాయింపులు దక్కనున్నాయి. వీటితో పాటు కొత్తగా తమిళనాడు, కర్నాటక, విశాఖపట్నం(పుడిమడక)నిర్మాణదశలో ఉన్న ఐదు సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల ద్వారామరో రెండేళ్ల కాలంలో 11,880 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అదనంగా తోడుకానున్నది.

ప్రస్తుతం నిర్మాణం దశలో 2,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు థర్మల్ పవర్ ప్రాజెక్టులు(కేటీపీఎస్ స్టేజ్-7, కాకతీయ స్టేజ్-2, సత్తుపల్లి) ఉన్నాయి. ఇవి సత్వరం పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీనికి అదనంగా లోయర్ జూరాల, పోచంపాడు జలవిద్యుత్ కేంద్రాల నుంచి 249 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సాధించేందుకు సిద్ధవుతున్నాయి. ఇక చేపట్టవల్సిన ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రతిపాదనలో ఉండి గ్యాస్ లేని కారణంగా నిలిచిపోయిన శంకరపల్లి 1,000 మెగావాట్లు, కరీంనగర్ నేదునూరు 2,100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. 

విద్యుత్ ఒప్పందాలు..
చాలా పీపీఏలు అమలులోకి వచ్చి ఇప్పటికే పది సంవత్సరాలు అవుతుండగా, మరో పది సంవత్సరాల పాటు ఇవి (పీపీఏ) అమలులో ఉంటాయి. వీటికి అదనంగా స్వల్పకాలిక(షార్ట్‌టర్మ్), మధ్యకాలిక(మీడియంటర్మ్), దీర్ఘకాలిక(లాంగ్‌టర్మ్) విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) కూడా కాలపరిమితి పూర్తి అయ్యేంత వరకు కొనసాగుతాయి. ప్రయివేటురంగంలోని జీవీకే ఇండస్ట్రీస్ పవర్ ప్రాజెక్టు(జేగూరుపాడు) పీపీఏ వచ్చే ఏడాది(2015) జూన్ 19వ తేదీనాటికి పూర్తికానుండగా, ల్యాంకో కొండపల్లి స్టేజ్-1 పీపీఏ 2015 అక్టోబర్ 17వ తేదీ నాటికి పూర్తి అవుతుంది.

స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్(ఉప్పాడ, కాకినాడ) పీపీఏ 2016 ఏప్రిల్ 18వ తేదీ వరకు ఉంది. 2017 అక్టోబర్ 23 నాటికి పెద్దపురంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పవర్ ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు ఒప్పందం పూర్తి అవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రతిపాదిత పవర్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసుకోవడం ద్వారా డిమాండ్‌ను అధిగమించడంతో పాటు మిగులు విద్యుత్తుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు సదరన్‌కారిడార్ నిర్మాణం పూర్తికానున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యుత్ సరఫరా అవకాశాలు మరింతగా మెరుగుపడుతాయని విద్యుత్‍రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇంతకూ తేలేదేమంటే, "తెలంగాణ రాష్ట్రం ఏర్పడింతర్వాత, తెలంగాణలో కరెంటు లోటుంటుంది" అన్న మాజీ ముఖ్యమంత్రి మాటలు అబద్ధాలే...తెలంగాణకు ఫుల్లు కరెంటు...లోటుమాట వట్టిదే...అని!

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

మరి కేసీఆర్ చెబుతున్నది వేరుగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక కనీసం రెండేళ్ల దాకా విద్యుత్తు గురించి గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పారు. దీనిపై ఎవరైనా విద్యుత్ రంగ నిపుణులు చెబితే బాగుంటుంది.

Unknown చెప్పారు...

మరి కేసీఆర్ చెబుతున్నది వేరుగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక కనీసం రెండేళ్ల దాకా విద్యుత్తు గురించి గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పారు. దీనిపై ఎవరైనా విద్యుత్ రంగ నిపుణులు చెబితే బాగుంటుంది.

Unknown చెప్పారు...

మరి కేసీఆర్ చెబుతున్నది వేరుగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక కనీసం రెండేళ్ల దాకా విద్యుత్తు గురించి గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పారు. దీనిపై ఎవరైనా విద్యుత్ రంగ నిపుణులు చెబితే బాగుంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి