-ఫ్రీ జోన్ పేరుతో కుట్రలకు పాల్పడ్డ సీమాంధ్ర అధికారులు
- రేంజ్ ప్రమోషన్లను అక్రమంగా పొందిన సిటీ అధికారులు
-సుప్రీం మొట్టికాయలు వేసినా స్పందించని పోలీస్‌శాఖ
- హైదరాబాద్ రేంజ్, సిటీ పోలీసుల మధ్య అంతర్యుద్ధం
ఎవరో జ్వాలను రగిలించారు...వేరెవరో దానికి బలి అయ్యారు! సీమాంధ్ర ప్రభుత్వం, అధికారుల నిర్వాకానికి తెలంగాణ పోలీసులు బలవుతున్నారు. రాష్ట్రం విడిపోతున్న తరుణంలో తెలంగాణ పోలీసుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. గతంలో టీడీపీ ప్రభుత్వం, సీమాంధ్ర ఐపీఎస్‌ల కుట్రల మూలంగా ఏర్పడిన ఫ్రీ జోన్ నియామకాలు.. ఇప్పుడు తెలంగాణ పోలీసుల మధ్య వివాదానికి కారణమవుతున్నాయి. తాజాగా వెలువడిన డీఎస్పీ సీనియారిటీ లిస్ట్‌తో తెలంగాణ పోలీసులే అన్యాయానికి గురికావాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇదీ పంచాయితీ:
1978 నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్‌వ్యవస్థ ఫ్రీజోన్ కింద పనిచేస్తూ వస్తోంది. ఆర్టికల్ 371(డీ), సిటీ పోలీస్‌యాక్ట్ ప్రకారం ప్రత్యేకంగా రూపుదాల్చింది. ఫ్రీజోన్ కింద 1985, 89, 91, 95, 96, 98 సంవత్సరాల్లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత వ్యక్తులు ఎస్‌ఐలుగా నియమితులయ్యారు. 1998 లో హైదరాబాద్ రేంజ్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ అనంతరెడ్డిని వరంగల్‌కు బదిలీ చేసి, అక్కడ పనిచేస్తున్న మరో ఇన్‌స్పెక్టర్‌ను హైదరాబాద్ రేంజ్‌కు బదిలీచేశారు. ఇది చట్టవిరుద్ధమని, రేంజ్‌లో ఉన్న సీఐలను రేంజ్‌లోనే బదిలీచేయాలంటూ అనంతరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. అతనితోపాటు సిటీలో పనిచేస్తున్న మరో ఇన్‌స్పెక్టర్‌ను రేంజ్‌కు బదిలీచేశారు. ఈ రెండు పిటిషన్లు హైకోర్టుకు చేరాయి. హైదరాబాద్ సిటీ కూడా హైదరాబాద్ రేంజ్‌లో భాగమేనని 2001లో స్పష్టమైన తీర్పువచ్చింది. హైదరాబాద్ రేంజ్ కిందే రిక్రూట్‌మెంట్ చేసుకోవాలని ఆదేశించింది.
బలైన రేంజ్ ఇన్‌స్పెక్టర్లు:
2001లో హైకోర్టు తీర్పు రాకముందు రేంజ్ ప్రమోషన్ల ప్రక్రియ సాఫీగానే సాగింది. 1989 బ్యాచ్ ఎస్‌ఐలు ఇన్‌స్పెక్టర్లుగా ప్రమోషన్లు పొందారు. సిటీ, రేంజ్ వేర్వేరు కాదని, సిటీ కూడా రేంజ్ కిందే ఉండాలని హైకోర్టు ఆదేశించడంతో సీమాంధ్ర అధికారులు కుట్రకు పథకం రూపొందించారు. రేంజ్‌లో 1991 బ్యాచ్ ఎస్‌ఐలకు రావాల్సిన ప్రమోషన్లను సిటీలో పనిచేస్తున్న ఎస్‌ఐలకు సీమాంధ్ర అధికారులు అప్పనంగా అంటగట్టారు. రేంజ్‌లో పనిచేస్తున్న వారికే నిబంధనల ప్రకారం పదోన్నతి ఇవ్వాలి. కానీ హైకోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకొని ఫ్రీజోన్‌లో రిక్రూట్ అయిన అధికారులు ప్రమోషన్లు పొందారు. దీంతో రేంజ్‌లో పనిచేస్తున్న 1991 బ్యాచ్ ఎస్‌ఐలు 2005 వరకు ప్రమోషన్లు పొందలేకపోయారు. ఇలా రేంజ్ ఇన్‌స్పెక్టర్ల ప్రమోషన్లు ప్రతిసారీ సిటీఇన్‌స్పెక్టర్లే తీసుకోవడంతో ఆరేళ్ల సర్వీస్ నష్టపోవాల్సివచ్చింది.
2002లో కొత్త డ్రామా:
హైదరాబాద్ రేంజ్ కింద సిటీలో కేవలం తెలంగాణవ్యక్తులే నియామకమవ్వాలి. దీంతో సిటీలో పనిచేస్తున్న కొంతమంది సీమాంధ్ర అధికారులు లాబీయింగ్‌కు తెరతీశారు. 2002లో సీమాంధ్ర ఐపీఎస్, పలువురు సీమాంధ్ర ఉన్నతాధికారులను రంగంలోకి దించి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయించారు. హైదరాబాద్ సిటీపోలీస్.. రేంజ్ పరిధిలోకి రాదని, ప్రత్యేకమైన సిటీ పోలీస్ యాక్ట్ ఉందని వాదించారు. దీంతో 2009లో రేంజ్, సిటీ వేర్వేరంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. సిటీ పోలీస్ యాక్ట్ ప్రత్యేకం కాబట్టి సిటీ కమిషనరేట్ రేంజ్ పరిధిలోకి రాదని తీర్పు నిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు సిటీపోలీస్‌లో పనిచేస్తున్న కొంతమంది సీమాంధ్ర అధికారులు అడ్డూఅదుపు లేకుండా అడ్‌హక్ ప్రమోషన్లు పొందారు. అప్పటి నుంచి డీఎస్పీలుగా, అడిషనల్ ఎస్పీలుగా రాజభోగాలు అనుభవిస్తున్నారు. వీరితోపాటు నియమాకమైన రేంజ్ అధికారులు మాత్రం ఇన్‌స్పెక్టర్లుగానే ఉండిపోవాల్సి వచ్చింది.
పదోన్నతులపై సమీక్ష శూన్యం:
2001 నుంచి 2009 సుప్రీం కోర్టు తీర్పు వరకు అడ్డగోలుగా కొనసాగిన పదోన్నతులపై ప్రభు త్వం సమీక్షించి అర్హులకు న్యాయం చేయాలి. రేంజ్‌లో తీసుకున్న ప్రమోషన్లను తిరిగి రేంజ్‌కు అప్పగించాలి. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్‌ను రూపొందించాలి. కానీ ఎక్కడా పాటించలేదు. పైగా అక్రమంగా పదోన్నతులు పొందిన డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా అడ్‌హక్ ప్రమోషన్లను ఇచ్చేందుకు యత్నించగా రేంజ్ సీఐలు 2010లో ట్రిబ్యునల్‌కు వెళ్లారు. పదోన్నతులపై స్టే వచ్చింది. హైకోర్టులోనూ ఇదే తీర్పు వెలువడింది.
అయినా కూడా సీమాంధ్ర ఐపీఎస్‌ల తీరులో మార్పురాలేదు. రేంజ్ ఇన్‌స్పెక్టర్లు 2013 జనవరిలో అప్పీలుకు వెళ్లారు. సీనియారిటీ లిస్ట్ తయారుచేసి పదోన్నతులు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మూడు నెలల్లో ప్రక్రియ పూర్తిచేయాలని, న్యాయం జరగకపోతే మళ్లీ రావాలని రేంజ్ ఇన్‌స్పెక్టర్లకు సూచించింది. డీజీపీ, హోంశాఖ సెక్రటరీలకు నోటీసులు జారీచేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలుచేసిన హోంశాఖ పలు అంశాలను ప్రస్తావించింది. హైదరాబాద్ సిటీ, రేంజ్‌ను విడదీస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ తయారుచేస్తున్నామని చెప్పింది. డీసీపీ, అడ్‌హక్ ప్రమోషన్లపై సమీక్షిస్తామని తెలిపింది.
మారని హోంశాఖ, డీజీపీ కార్యాలయ తీరు:
సుప్రీం తీర్పును అధికారులు బేఖాతరు చేడంతో రేంజ్ ఇన్‌స్పెక్టర్లు మళ్లీ కంటెంట్ కోర్టు కింద 2014 మే 2న సుప్రీంలో పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. డీఎస్పీ సీనియారిటీ లిస్ట్ తయారుచేసి పదోన్నతులకు వెళ్లాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదని డీజీపీ, హోంశాఖ సెక్రటరీలను మందలించింది.
జూన్ 7లోగా డీఎస్పీ సీనియారిటీ లిస్ట్ తయారుచేసి, ఆ రిపోర్ట్‌తో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆగ్రహంతో హోం శాఖ, డీజీపీ కార్యాలయం సీనియారిటీ లిస్ట్ తయారుచేసి ఈనెల 20న వెబ్‌సైట్‌లో పెట్టింది. వీటిలో అడ్‌హక్ ప్రమోషన్లను సమీక్షించకుండానే లిస్ట్‌ను రూపొందించిందని ఆరోపణలున్నాయి.
జూన్ 2 తర్వాత సందేహమే:
కేవలం లిస్ట్ తయారుచేసి డీజీపీ కార్యాలయం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదని బాధిత రేంజ్ ఇన్‌స్పెక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇలా చేస్తే మళ్లీ నష్టపోతామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జూన్ 2లోపే డీఎస్పీ పదోన్నతుల ప్రక్రియ ముగించాలని, లేకుంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించడం ఇబ్బందిగా మారుతుందని వాపోయారు. సీమాంధ్ర పాలకుల కుట్ర వల్ల రాబోయే తెలంగాణ డీజీపీ, హోంశాఖ అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించి ప్రమోషన్లు ఇచ్చేందుకు కృషిచేయాలని కోరారు. సీమాంధ్ర అధికారుల నిర్వాకంతో తెలంగాణ పోలీసుల్లో విభేదాలు తారస్థాయికి చేరే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.
సత్వరమే టీఆరెస్ అధినేత...కాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి మన తెలంగాణ పోలీసులకు న్యాయం జరిపిస్తారని ఆశిద్దాం.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి