గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 29, 2014

పోలవరం ఆర్డినెన్సుపై టీఆర్‍ఎస్ పోరుబాట!

-అసంపూర్ణ తెలంగాణపై మొదటినుంచి హెచ్చరికలు
-అప్రమత్తంగా ఉండాలన్న గులాబీ నేత
-తెలంగాణను ముంచుడే ఆ ఇద్దరు సీమాంధ్ర నేతల పని అని మండిపడుతున్న తెలంగాణవాదులు
-అధికారంలోకి వచ్చినా మళ్లీ ఉద్యమబాట పట్టిన తెలంగాణ ఇంటిపార్టీ

అసంపూర్ణ తెలంగాణ..
టీఆర్‌ఎస్ నేత కేసీఆర్ అనుమానించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అసంపూర్తి తెలంగాణ. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలంటూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. తెలంగాణ ఆదివాసీలకు మరణశాసనం రాస్తూ ఇలా ఆర్డినెన్స్ తీసుకురావడానికి కారకులు ఆ ఇద్దరు నేతలేనని తెలంగాణ సమాజం ఇప్పుడు వేలెత్తి చూపుతోంది. తెలంగాణకు అన్యాయం జరిగేలా మొదటినుంచి వారు వ్యవహరించిన తీరుపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.


తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబునాయుడు ఒకవైపు.. కేంద్ర మంత్రివర్గంలో చేరిన బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు మరోవైపు.. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేలా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు వారు తమ శక్తియుక్తులను సర్వదా వినియోగిస్తూనే వచ్చారు. అయితే అవి విఫలమయ్యాయి. తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్నపుడు ఇంటా బయటా అడ్డంకులు సృష్టించేందుకు వారు అన్ని రకాలుగా ప్రయత్నించారు.

చంద్రబాబునాయుడు హస్తినలో మకాం వేసి, రాష్ట్రాలు తిరిగి.. జాతీయ నాయకులతో సంప్రదింపులు జరిపి ఏదో విధంగా తెలంగాణను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయినా, కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం కాదంటూనే సీమాంధ్ర ప్రయోజనాలపై ఎప్పుడూ గళమెత్తే వెంకయ్య నాయుడు కూడా పోలవరంపై ఆర్డినెన్స్ రావడం వెనుక ప్రధాన పాత్ర పోషించారని, వీరిద్దరు పక్షపాతంతో వ్యవహరించడం వల్లే ఇంతా జరిగిందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. 

పోలవరంపై ఇలాంటి తఖరారు ఉంటుందని అనుమానిస్తూ వచ్చిన తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ ఇప్పుడు మళ్లీ తన ఉద్యమ స్వభావాన్ని చాటేందుకు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారినా, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై తిరిగి టీఆర్‌ఎస్ ఉద్యమ బాట పట్టింది. జూన్ 2వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించనున్న పార్టీ అధినేత కే.చంద్రశేఖరరావు పోలవరంపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు నిరసనగా స్వయంగా బంద్‌కు పిలుపునిచ్చారు. 

పోలవరం కింద ముందుగా 105 గ్రామాలే ముంపునకు గురవుతాయని ప్రచారం జరిగింది. అయితే, గిరిజన గ్రామాలు ముంపునకు గురికాకుండా...వాళ్లు నష్టపోకుండా ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని కేసీఆర్ పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, కేవలం ముంపును తగ్గించాలన్నదే తమ పోరాట లక్ష్యమని కూడా చెప్పారు. ఇదే విషయాన్ని బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి సవివరమైన వినతిపత్రాన్ని అందించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కేసీఆర్ ఉద్యమాన్ని కొనసాగించటంతోపాటు పోలవరంపై వెంటనే తన దృష్టిని కేంద్రీకరించారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రతిపాదించిన సమయంలోనూ ఆయన తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టిన క్లాజులపట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

ఉద్యోగుల విషయం...నీటి వాటాల అంశాలపై, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోవటం వంటి విషయాలను కేసీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. విద్య, ఉమ్మడి రాజధాని, హైకోర్టు, హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించటం వంటి విషయాల్లో తెలంగాణపట్ల కనబరిచిన వివక్షతను ఆయన ఎత్తి చూపారు. పోలవరం ప్రాజెక్టు కింద ఏడు మండలాలు ముంపునకు గురవుతుండగా వాటిని సీమాంధ్రలో చేర్చేందుకు చర్యలు తీసుకునేలా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయటం అప్రజాస్వామికమని టీఆర్‌ఎస్ మండిపడుతున్నది. 

పోలవరం ఆర్డినెన్స్‌పై ప్రధానంగా తెలుగుదేశం, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తున్నా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా జారీ అయిన ఆర్డినెన్స్‌పై ఆ పార్టీ నాయకులు కనీసం ప్రతిఘటించలేకపోయారు. ఈ విషయంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు మహానాడులో చంద్రబాబు నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పటం గమనార్హం. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వచ్చే నెల 8వ తేదీన పదవీబాధ్యతలు స్వీకరిస్తున్న చంద్రబాబు కూడా రెండు రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేస్తామని చెబుతున్నారు...తప్పితే పోలవరం ఆర్డినెన్స్‌తో తెలంగాణ ప్రయోజనాలు పూర్తిగా దెబ్బ తింటున్నా దానిపై ఒక్క మాట కూడా మాట్లాడడంలేదు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా పోలవరం ప్రాజెక్టుపై అంతంత మాత్రంగానే పెదవి విప్పారు. తెలుగుదేశం అధినేత ఒకవైపు..ప్రధాని నరేంద్ర మోడీ మరోవైపు తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించకుండా ఆర్డినెన్స్ జారీ చేయటాన్ని తెలంగాణ బీజేపీ నాయకులు పట్టించుకోకపోవటం గమనార్హం. ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

పోలవరంపై బిల్లులో ఏముంది?
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 సెక్షన్ 90 (1) ప్రకారం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని కూడా పేర్కొంటూ నీటిపారుదల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణమని సబ్ సెక్షన్ 2 కింద పేర్కొన్నారు. 3వ సబ్ సెక్షన్ కింద రాబోయే తెలంగాణ రాష్ట్రం పోలవరం ప్రాజెక్టును అంగీకరించినట్టుగా పేర్కొనటం గమనార్హం.

సబ్ సెక్షన్ 4 కింద ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ, అటవీశాఖ అనుమతులతోపాటు నిర్వాసితుల పునరావాస బాధ్యతలను కూడా కేంద్రమే చేపడుతుంది. మొత్తంగా నాలుగు సబ్ సెక్షన్లలో పోలవరం అంశానికి సంబంధించిన వివరాలను పేర్కొనగా 3వ సబ్ సెక్షన్ ప్రకారం పేర్కొన్న విషయాలు వివాదాస్పదంగా ఉన్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ముందుగానే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్టు పేర్కొనటం వివాదానికి తావిస్తోంది. అయితే, పోలవరం విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్డినెన్స్ జారీ చేయటానికి సాహసించలేకపోయింది. తరువాత వచ్చిన ప్రభుత్వానికి నిర్ణయాధికారాన్ని వదిలిపెట్టింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఎన్నికల సమయంలో సమస్యలు వద్దని ఆర్డినెన్స్‌ను వాయిదా వేసేందుకే సిఫార్సు చేసినట్టు సమాచారం. అయితే, ఎన్నికలు ముగిసి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో మొదటి క్యాబినెట్ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసింది. 

పోలవరం ఆర్డినెన్స్‌ను ఆమోదించొద్దు 
-గెజిట్ నోటిఫికేషన్ నుంచే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది..
-తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సరిహద్దులు మార్చడం అప్రజాస్వామికం-కేంద్ర ప్రభుత్వ చర్య స్థానిక గిరిజనులకు వ్యతిరేకం -రాష్ట్రపతి ప్రణబ్‌కు కేసీఆర్ లేఖ 
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న కే చంద్రశేఖర్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావ సమయంలో సరిహద్దుల్లో మార్పులు చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆర్డినెన్స్ తీసుకురావడం అప్రజాస్వామికమని బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

పార్లమెంట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గెజిట్ నోటిఫికేషన్‌గా విడుదలైన నాటినుంచే అమల్లోకి వచ్చిందన్నారు. జూన్ 2వ తేదీ నుంచి 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు సహేతుకం కావని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారని, తెలంగాణ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే రాజ్యాంగం విరుద్ధంగా ఇలాంటి చర్యలకు పూనుకోవడం దురదృష్టకరమన్నారు. 

ఆ అధికారం పార్లమెంట్‌కే..:ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణ నుంచి వేరుచేసి ఆంధ్రప్రదేశ్‌లో కలిపే అధికారం ఆర్టికల్-3 ద్వారా పార్లమెంట్‌కు మాత్రమే ఉందన్నారు. కేంద్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన తీర్మానాన్ని ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్‌గా జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని.. అయితే, ఈ విధానం సాధారణ ఆంశాలకే పరిమితమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దులను మార్చే విషయంపై క్యాబినెట్ ఆర్డినెన్స్ జారీ చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం మార్పులు ఎలా చేయాలో ఎస్.ఆర్.బొమ్మై కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. 

గిరిజన వ్యతిరేక చర్య:తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. అదేసమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు సైతం కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవ్వలేదన్నారు. తాము పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని, ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు చేసి ముంపు ప్రాంతాలను వీలైనంత మేరకు తగ్గించాలని.. గిరిజనులకు ఇబ్బందులు కలుగకుండా, సమస్యలు రాకుండా చూడాలని ఆశిస్తున్నామని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న మీరు కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారన్న విశ్వాసంతో ఈ విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి వర్గం చేసిన ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని ఆయన తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 

లేఖలోని ముఖ్యాంశాలు
-ఆర్టికల్ 3 ప్రకారం సరిహద్దుల మార్పు విషయంలో రాష్ట్రపతి సిఫార్సుల మేరకే పార్లమెంట్‌లో బిల్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. క్యాబినెట్ ఆర్డినెన్స్ చెల్లవు.
-పార్లమెంట్ కూడా తనకు తానుగా ఆర్టికల్3 కింద బిల్లును పరిశీలనలోకి తీసుకోవడం సాధ్యం కాదు. -ప్రస్తుత ఆర్డినెన్స్ వల్ల తెలంగాణలోని లోయర్ సీలేరు జలాశయం.. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తుంది. తత్ఫలితంగా తెలంగాణకు విద్యుత్‌పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. -తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీడీపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి ఆర్డినెన్స్ రూపంలో తెలంగాణకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నదన్న అనుమానాలు కలుగుతున్నాయి.
-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను మార్చే ఇలాంటి ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం తోసిపుచ్చుతుంది.

పోలవరంపై అలుపెరగని పోరు
-ఆది నుంచి టీఆర్‌ఎస్‌ది ఉద్యమ పంథానే
-నిబంధనలు తుంగలో తొక్కిన వైఎస్ -ఆగమేఘాల మీద ప్రాజెక్టుకు శంకుస్థాపన-ఆనాడే తీవ్ర నిరసన తెలిపిన గులాబీదళం
-ఆర్డినెన్స్‌కు నిరసనగా నేడు బంద్ బాట
-టీఆర్‌ఎస్‌కు తోడుగా తెలంగాణ జాగృతి 
పోలవరం ప్రాజెక్టుపై మడమతిప్పకుండా టీఆర్‌ఎస్ పార్టీ పోరాటం సాగిస్తున్నది. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని ప్రకటిస్తూనే లక్షలాది మంది గిరిజనులను ముంచే పోలవరం డిజైన్‌ను మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నది. నేడు తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇక్కడి ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా మరోసారి ఉద్యమజెండాను ఎగురవేసింది.  

 
కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వైఎస్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించారు. విలేకరులు వైఎస్‌ను అనుమతులు లేకుండా శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నిస్తే.. ప్రాజెక్టులు అనుమతులు వచ్చాకే ఎక్కడైనా కడుతున్నారా? ప్రాజెక్టును కట్టినంక అనుమతులు అవే వస్తాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలంటే ముందు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వైఎస్ క్యాబినెట్‌లో ఆరుగురు టీఆర్‌ఎస్ మంత్రులు ఉండటంతో క్యాబినెట్‌లో చర్చించకుండానే సరాసరిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

ఇది ఒకరకంగా తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా అవమానపర్చడమే. వైఎస్ చేసిన శంకుస్థాపనపై తెలంగాణ సమాజంలో, టీఆర్‌ఎస్ మంత్రుల్లో నాడు తీవ్ర అలజడి మొదలైంది. దీంతో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ మంత్రులు నిరసనకు దిగారు. అదే సమయంలో కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు కేసీఆర్, నరేంద్ర సైతం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ హైకమాండ్‌ను నిలదీశారు. దీంతో నాడు సోనియాగాంధీ సూచన మేరకు దిగ్విజయ్‌సింగ్.. కేసీఆర్, వైఎస్‌తో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా కేసీఆర్ ప్రధానాంశంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాల్సిందేనని కోరారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు. కానీ వైఎస్ మాత్రం దూకుడుగా పోలవరంపై ముందుకు వెళ్తుండటంతో రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులతోపాటు, కేంద్రంలో ఉన్న ఒక క్యాబినెట్, ఒక సహాయమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి దూకింది టీఆర్‌ఎస్. 

పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలతో పాటు, సుప్రీంకోర్టులో కూడా న్యాయపోరాటం చేస్తూ ముందుకుసాగుతున్నది. 2006-07లో టీఆర్‌ఎస్ తరపున ఎంపీ వినోద్, కేంద్ర జలవనరుల కమిషన్ మాజీ సభ్యుడు ఆర్ విద్యాసాగర్ సుప్రీంకోర్టులో కేసువేశారు. అదే సమయంలో తెలంగాణ జాగృతి తరఫున ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ కవిత కూడా సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు 2007-08సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ వైఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులు తెస్తూనే ఉంది. ఈ అనుమతులన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు లోబడే ఉంటాయని ఆయా శాఖలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాల్లో కూడా సమస్యలొస్తున్నాయని ఛత్తీస్‌గఢ్, ఒడిశాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో చాలా రోజులుగా పోలవరంపై సుప్రీంలో స్టే కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెల్లవారే క్యాబినెట్ భేటీలో పోలవరంపై ఆర్డినెన్స్‌ను ఆమోదించడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. 

పోరాడుతున్న తెలంగాణ జాగృతి
పోలవరం ప్రాజెక్టు డిజైన్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణ జాగృతి కూడా తీవ్రస్థాయిలో పోరాటాలు చేస్తూనే ఉంది. ఒక వైపు ప్రజాఉద్యమాల్లో భాగం అవుతూనే మరోవైపు కోర్టుల్లో న్యాయపోరాటాలు చేస్తోంది. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ కవిత 2009 నుంచి పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. 2009లో సుప్రీంలో కేసు వేసిన ఆమె ఆ తర్వాత రాష్ట్రంలో టెండర్లు వేస్తున్నారని తెలిసి హైకోర్టులో మరో కేసు వేశారు. హైకోర్టు పోలవరం కేసులన్నీ కూడా సుప్రీంలో ఉన్నాయని చెప్పడంతో మరోసారి ఆమె సుప్రీంను ఆశ్రయించారు. 
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 
జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి