గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 30, 2014

పోలవరము వరమిడదు, ముంపు నిడును!

(నేను గతంలో దివి:21-11-2013 మరియు 08-02-2014 నాడు పోలవరము నిర్మిస్తే కలిగే నష్టాలను వివరిస్తూ పెట్టిన టపాను మరల ఈ క్రింద ఇస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భద్రాచలం ముంపుకే కానీ మంచికి కాదు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా భద్రాచలవాసులు దీన్ని ఎంత మాత్రం సహింపరు. అంతగా అవసరం ఐతే పోలవరం డిజైన్ మార్చి, ఎవరికీ ముంపులేని, నష్టం కలిగింపని, తెలంగాణ (భద్రాద్రి)లోని పూచిక పుల్లంత స్థలాన్నికూడా సీమాంధ్రలో కలుపని రీతిగా నిర్మించుకుంటే మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణ జోలికి వస్తే మాత్రం రణరంగమే!)


భద్రగిరిఁ బొంది, మీ పోలవరము నిచట
నిర్మితము సేయఁ గుట్రల నెన్నొ పన్ని,
"మేల్మి బంగారమే యయ్య మే" మటంచుఁ 
బల్క, నమ్మెడి వారమే? వదరఁ బోకు! 

ఇచటి భద్రాచలాలయ, మిచటి జనులు,
వీరిపై ప్రేమ నీ కున్న వేగిరముగఁ
బోలవరమందుఁ బ్రాజెక్టు పూన్కి నాపి,
ముంపు నీయక, భద్రాద్రి కింపు నిడుము!


పోలవర మిట నిర్మింప మునుఁగు నంచు
నమ్ముఁ డెనుఁబది మూఁడు శాతమ్ము గ్రామ
ములును! మూఁడు లక్షల జనములు నుపాధి
లేక నిర్వాసితులు నయి, లేమిలోనఁ
గూర్పఁ బడుదురు! బాధలఁ గోరఁ దగునె?

ఇరువదియు నైదు వేల యెకరములు గల
యటవి నీటను మున్గును! నటులె రెండు
నూర్ల డెబ్బది యైదగు నూళ్ళు మునుఁగు!
పాపికొండలు, పేరంట్ల పల్లి మునిఁగి,
నీటి కడుపున నివసించు నిజము సుమ్ము!

నేఁడు పదునేను నడుగుల నీటిమట్ట,
మది నలువదియు మూఁడడ్గు లటు పయిఁ జను;
భారి వర్షమ్ము వచ్చిన వరద హెచ్చ
రికయె నల్వదెన్మిది గంటలకును ముందె
జారి యగుచుండ, ప్రాజెక్టుఁ గోరి యిచట
నిర్మితముఁ జేయు తదుపరి నెట్టు లుండు 
నో యటంచు నూహింపఁ గదోయి! యితర 
ప్రాంత సంబంధముల్ తెగు! వైద్య, విద్య, 
గిరిజనోపాధు లన్ని దుష్కరము లగును! 

గిరిజనులఁ గావ మైదాన పరిధులకును
దీసికొని పోవ నేజన్సి వాస చట్ట
మెటులు వారికి వర్తించు? నేది దారి?

సరియె పోనిండు! భరత దేశమ్మునందె
మిగులఁ బ్రాచీన జాతిగ నెగడునట్టి
కొండ రెడ్ల తెగయె యిటనుండి తొలఁగు!

ఎనిమిదౌ గ్రామములు మున్గు నిచట యనియుఁ
బల్కి, "యొడిశా"యె పెట్టె నభ్యంతరమ్ము!

ఇన్ని భద్రాద్రి గ్రామా లవెట్టి దుఃఖ
మందఁగాఁ గోరు దీవు? తమంత తాము
వెలికి వచ్చి, భద్రాద్రినిం గలుపఁగ వల 
దాంధ్రలోపల నంచును నార్తి తోడఁ 
బల్కుచుండి రీ ప్రజ! పోలవరము నాపి,
జరుగఁ బోవు విలయమునుం జరుగకుండఁ
గావఁగా నాంధ్రుఁడా నీకుఁ గరుణ లేదె?
కర్కశుండవే? యిఁక నైన గాలి మాట 
లాపి, భద్రాద్రి జోలికి రావలదయ! 

పోలవరము ప్రాజె క్టదియేల నీకు?
ఎన్నొ దుష్పరిణామాలు నున్న దదియ!

నీదు బాగుకోసమె యిట, నాదు బాగు
నాశ మొనరింతువే? యన్యాయమునకు
నడుము కట్టెదవే? దుర్జనుఁడవె నీవు?

మంచివాఁడవు నీవైన, మాన్యతఁ గన,
భద్రగిరి జోలికే రావ వలదు! కోర,
పోలవరము వర మిడదు! ముంపు నిడును!

ఇదే విషయమై మరిన్ని వివరాలకు:

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి