-నిజాయితీపరులకే అందులో చోటు
-సమర్థులైన ఐఎఎస్‌లకే శాఖల అప్పగింత
-క్యాబినెట్ కూర్పుకంటే దీనికే ప్రాధాన్యత
-పారదర్శక పాలనకు గులాబీ బాస్ కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా అధికారపీఠం ఎక్కబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తన ప్రభుత్వంలో ఉండాల్సిన అధికారుల కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా కేసీఆర్ కార్యాచరణను చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఐఏఎస్‌లు, శాఖాధిపతులుగా ఉండే ఐఏఎస్‌ల ఎంపికపై ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ల ఎంపికపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఐఏఎస్‌ల సమర్థత పైనే పాలనారథం పరుగులు తీస్తుంది...కనుక సమర్థపాలనకు ఈ టీం ప్రాణాధారం. అందుకే సమర్థవంతులు, నిజాయితీపరులైన వారికే ఇక్కడ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకే ఇతర శాఖల పనితీరు ఉంటుంది...కనుక ఇక్కడ నిజాయితీ పరులు, సమర్థులు ఉంటేనే శాఖలు కూడా అదే తీరులో పనిచేస్తాయని కేసీఆర్ భావన. ఆ నేపథ్యంలోనే అన్నింటికన్నా ముందుగా సీఎంవోలో ఉండే ఐఎఎస్‌ల ఎంపిక మీద దృష్టి పెట్టారు. ఇక్కడి అధికారులంతా పూర్తిగా తన టీంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక శాఖాధిపతులుగా ఉండే ముఖ్య కార్యదర్శుల ఎంపికపై కూడా కేసీఆర్ దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.
గత రెండుమూడు రోజలుగా కేసీఆర్‌ను పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ శాఖాధిపతుల ఎంపికను కూడా చేపట్టారని తెలుస్తోంది. ఇక పోలీస్ విభాగంలో తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు అనుకూలంగా ఉండేవారినే ఎంపిక చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది.
తనవద్ద ఉండే టీం...తెలంగాణ సమాజం గౌరవం పొందేలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. జిల్లాల పునరేకీకరణ జరుగుతున్న నేపథ్యంలో 22-24 మంది జిల్లా కలెక్టర్లు అవసరం అవుతారు. పనిలోపనిగా వారిని కూడా గుర్తించే పనిచేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి కేసీఆర్ క్యాబినెట్ కూర్పుకంటే ముందు దీనిపైనే ఎక్కువ కసరత్తు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి