- అతితెలివితో విభజన అగ్నికి ఆజ్యం పోస్తున్న అధికారులు
- ఏ చిన్న అవకాశం దొరికినా అనుకూలంగా మార్చుకుంటున్న వైనం
- ప్రొవిజనల్ సాకుతో కేటాయింపుల్లో తిరకాసులు
- తాత్కాలికమే అంటూ సమర్థింపులు
- హామీ ఇవ్వాలంటున్న తెలంగాణ ఉద్యోగులు
ఉద్యోగుల విభజనలో ఉన్నతాధికారులు రూపొందించిన ప్రాథమిక మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఓ పథకం ప్రకారం సీమాంధ్ర అధికారులు ప్రవేశపెట్టిన ఆర్డర్-టు-వర్క్ తిరకాసు తెలంగాణ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఈ ఒక్క నిబంధనను అడ్డం పెట్టుకుని తెలంగాణ దిగువస్థాయి ఉద్యోగులు సీమాంధ్రలో, సీమాంధ్ర అధికారులు తెలంగాణలో పనిచేసే పరిస్థితి కల్పించే కుట్రకు సీమాంధ్ర ఉన్నతాధికారులు తెరతీశారు. ఇరు రాషష్ట్రాల్లోనూ సీమాంధ్ర అధికారుల పెత్తనమే కొనసాగేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఫలితంగా ఇంటర్మీడియెట్ కమిషనర్ కార్యాలయంలో సూపరిండెంటెండ్‌గా పనిచేసే జేఏసీ కో కన్వీనర్ విఠల్‌తోపాటు ఇప్పటికే దాదాపు మూడు వందల మంది తెలంగాణ ఎగువ, దిగువ స్థాయి ఉద్యోగులు సీమాంధ్ర ఖాతాలో చేరిపోయారు.
తాజాగా భూగర్భ జలశాఖలో కేంద్ర కార్యాలయంలో వివిధ కేటగిరీలలో ఏకంగా 30 మంది తెలంగాణ ఉద్యోగులను ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించారు. ఇంతవరకు జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 42 ఆంధ్రకు 58 నిష్పత్తిలో ఉద్యోగుల విభజన జరుగుతుందని భావించారు. కానీ ఉన్నతాధికారులు విడుదల చేసిన మార్గదర్శకాలలో తెలంగాణకు 41.68 సీమాంధ్రకు 58.32 నిష్పత్తిలో విభజన ఉంటుందని స్పష్టం చేశారు.
సందు దొరికితే చాలు..:
ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో 13వ అంశం రెండో పేరాలో ఖాళీలను మినహాయించి ఉన్న ఉద్యోగులను జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఉంది. వాస్తవానికి ఆయా శాఖలకు కేటాయించిన మొత్తం పోస్టులను లెక్కలోకి తీసుకుని విభజన చేయాలి. కానీ అధికారులు తెలివిగా ఖాళీలను మినహాయించారు. ఫలితంగా తెలంగాణ ఉద్యోగులకు విభజనలో అన్యాయం జరుగుతున్నది. ఉదాహరణకు భూగర్భజల శాఖ కేంద్రకార్యాలయంలో 30 అటెండర్ పోస్టులుండగా 24 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఆరుపోస్టులను మినహామించిన సీమాంధ్ర అధికారులు.. పనిచేస్తున్న వారినే జనాభా నిష్పత్తిలో తెలంగాణకు 10 ఆంధ్రకు 14మందిని కేటాయించారు. ఆరు వెకెన్సీలను కలిపితే తెలంగాణకు 14 ఆంధ్రకు 16 మందిని కేటాయించాల్సి ఉంటుంది.
ఉద్యమనాయకులు ఆంధ్రకా..:
సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణకు కేటాయిస్తుండడంతో అసలైన తెలంగాణ ఉద్యోగులను సీమాంధ్రకు బదిలీ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే విద్యుత్, విద్యాశాఖ, సహకార, భూగర్భజలశాఖ , అటవీ, నీటిపారుదల శాఖలకు చెందిన అనేక మంది తెలంగాణ ఉద్యోగులను సీమాంధ్రకు బదిలీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌ను సీమాంధ్రకు బదిలీ చేయడమే ఇందుకు తార్కాణం. ఉద్యమనాయకులను ముందుగా సీమాంధ్రకు బదిలీ చేస్తే వారు గందరగోళంలో పడిపోతారని, ఈలోగా సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో నియమించుకోవచ్చనే కుట్ర దాగి ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో తిష్ఠ వేస్తున్న విషయంలో ప్రశ్నించకుండా అక్కడికి తరలించిన వారి కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ ఉద్యోగుల ఆందోళన
సీమాంధ్ర అధికారులు ఉద్యోగుల విభజనలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని భూగర్భజల శాఖ కేంద్రకార్యాలయంలో తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు సోమవారం ఆందోళనకు దిగారు.
తెలంగాణ ఉద్యోగులను కావాలనే ఆంధ్ర డైరెక్టరేట్‍కు బదిలీ చేశారని అసోసియేషన్ నాయకులు జీ నర్సింహులు, చలపతి, లక్ష్మయ్య, అంజయ్య తదితరులు ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆర్డర్-టు-వర్క్ ఇచ్చేటప్పుడు మూడు నెలల్లోపు తెలంగాణవారు తెలంగాణలోనే పని చేయొచ్చనే హామీ ఇవ్వాలని వారు పట్టుబట్టారు. ఈ హామీ ఇవ్వకపోతే తాము విధుల్లో చేరబోమని ప్రకటించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగులు కూడా విభజన తీరును నిరసిస్తూ సోమవారం ఆ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి