-ఆదివాసీల సమస్యలు పరిష్కరించేదాకాపోలవరం ప్రాజెక్టును చేపట్టవద్దు
-స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి
-కేసీఆర్‌కు శుభాకాంక్షలు..
-పునర్నిర్మాణంలో సహకరిస్తాం
-తెలంగాణ విద్యావంతుల వేదిక తీర్మానాలు
ఆదివాసీల సమస్యలను పరిష్కరించేవరకు పోలవరం ప్రాజెక్టును చేపట్టవద్దని తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) డిమాండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పునరావాస, పర్యావరణ సమస్యలను ఆదివాసీల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ఆదివారం సమావేశమైన టీవీవీ పలు నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలు చేసింది.
సమావేశంలోని తీర్మానాలివి..
-60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సాధనను సాకారం చేయడంలో కేసీఆర్, టీఆర్‌ఎస్ కృషి చారిత్రాత్మకం
మలిదశ పోరాటంలో టీఆర్‌ఎస్, ఇతర ఉద్యమ సంస్థలతో విద్యావంతులవేదిక చేయి కలిపి పనిచేసింది. ఉద్యమవ్యాప్తి కోసం తనవంతు కృషి చేసింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలను తెలుపుతూ తీర్మానం చేసింది. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి సహకరిస్తామని వేదిక ప్రకటించింది.
-ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పును జీర్ణించుకోలేని టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను వేదిక ఖండించింది. హైదరాబాద్ యూటీ, లేదా దేశానికి రెండో రాజధాని పేరిట చేసే ఎత్తుగడలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
-పోలవరం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదని, ఆదివాసీల బతుకు సమస్య అని కార్యవర్గం అభిప్రాయపడింది. ముంపుగ్రామాలను తిరిగి తెలంగాణకు బదిలీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తిచేసింది.
-స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని వేదిక కోరింది. ఆప్షన్ల పేరిట తెలంగాణలో సీమాంధ్రుల పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండించింది.
-జూన్ 1 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ధూమ్ ధాంలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని , తెలంగాణ జెండా ఎగురవేసి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
-జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసాలు, ఆగస్టు 10న మంచిర్యాలలో వేదిక దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని కార్యవర్గం నిర్ణయించింది.
ఈ సమావేశంలో వేదిక గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ సీతారాంరావు, గురిజాల రవీందర్‌రావు, లక్ష్మారెడ్డి, శ్రీధర్ దేశ్‌పాండే, ఆవునూరి సమ్మయ్య, తిప్పర్తి యాదయ్య, వేదిక రాష్ట్ర కార్యదర్శులు, పది జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి