తేది: సెప్టెంబర్ 12, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యము
(అన్నపూర్ణాష్టకమునందలి ప్రథమ శ్లోకానువాదము)
శా.
మా కానందము నిచ్చ లిచ్చి, వరసంరక్షా సుశోభాబ్ధివై;
మా కృత్యమ్ముల ఘోర పాపము నశింపం జేయు సాక్షాచ్ఛివా!
యో కాళీ! హిమశైల వంశ విమలా! యో కాశికాధీశ్వరీ!
మా కీయం గదె భిక్ష రక్ష దయలున్ మా తాన్నపూర్ణా ఽమ్బికా!!
మూలశ్లోకము:
నిత్యానన్దకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||
భావము:
నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘోరమైన పాపముల నన్నిటినీ కడిగివేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి