గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మే 28, 2014

ముంచుతే ఊరుకోం...


-ఆర్డినెన్స్ జారీపై దూకుడు తగదు
-అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం
-ఇరు రాష్ట్రాలతో చర్చించాకే నిర్ణయించాలి
-ఆర్టికల్ 3ని విస్మరించడం రాజ్యాంగ విరుద్ధ చర్య
-పార్లమెంటు ఆమోదించకుండా రాష్ట్రాల సరిహద్దుల మార్పు అసాధ్యం
-తెలంగాణకు అన్యాయం జరిగితే న్యాయపోరాటమే
-మేం పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు...డిజైనుకు వ్యతిరేకం
-వార్ రూమ్‌కు చంద్రబాబు వస్తే ...
-మోస్ట్ వెల్‌కం...ఢిల్లీలో మీడియాతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ అధినేత, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కే సీ ఆర్ హెచ్చరించారు. ఈ కేటాయింపు విషయంలో కేంద్ర క్యాబినెట్ దూకుడుగా వ్యవహరించడం తగదన్నారు. కేంద్ర క్యాబినెట్ తొలి సమావేశంలోనే ఇలాంటి ఆర్డినెన్సు జారీ చేయాలని తలపెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు. ఇదే జరిగితే మోడీ ప్రభుత్వం తన ముఖానికి తానే మసి పూసుకున్నట్లవుతుందని హెచ్చరించారు.

ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన కేసీఆర్, మంగళవారం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తూ కొద్ది నిమిషాలపాటు ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ముంపు మండలాల బదలాయింపునకు ఆర్డినెన్సు జారీ అంశంపై మాట్లాడుతూ నేను నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేస్తున్నా.పజాదరణతో, ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నికైన ప్రధాని.. తన తొలి క్యాబినెట్ సమావేశంలోనే ప్రజాస్వామ్యాన్ని అవమానపరచవద్దు. ఆర్డినెన్స్ ప్రతిపాదన తక్షణం విరమించండి. ఏ మార్పుచేర్పులైనా ఇరు రాష్ర్టాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రులను పిలిచి చర్చించాకే నిర్ణయించండి అని అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన జరిగి, పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత తిరిగి పార్లమెంటు ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. పార్లమెంటు సమావేశాలు జరగడానికి ముందే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తుందని అన్నారు.

సమాచారముంది..
క్యాబినెట్ తొలి సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసే ఆర్డినెన్సు ఆమోదానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందని అన్నారు. ప్రధానికి అత్యంత సన్నిహితులు ఈ విషయాన్ని చెప్పారని, హోంశాఖ వర్గాలు కూడా ఆర్డినెన్సు తయారీ జరుగుతున్నట్లు స్పష్టం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని సన్నిహితులతో మాట్లాడిన సందర్భంగా హడావిడిగా ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని కోరానని, వారు కూడా తెలంగాణకు విరుద్ధంగా అలాంటిదేదీ జరగదని హామీ ఇచ్చారని కేసీఆర్ చెప్పారు. తన విజ్ఞప్తిని ప్రభుత్వం గౌరవిస్తుందని, ప్రధాని మోడీ తన మాటను మన్నిస్తారని అనుకుంటున్నానని తెలిపారు. గతంలో ఇలాంటి ఆర్డినెన్సే మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు క్యాబినెట్‌కు వెళ్ళిందని, అయితే అది ఆమోదం పొందకుండా వాయిదా పడిందని కేసీఆర్ గుర్తు చేశారు.

పార్లమెంటు ఆమోదం తప్పనిసరి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై రాజ్యాంగంలోని ఆర్టికల్ -3 ప్రకారం పార్లమెంటు ఉభయ సభల్లో చర్చలు జరిగి ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిందని ఆయన వివరించారు. ఆ చట్టంలో పేర్కొన్న దానికి భిన్నంగా ఏ మార్పుచేర్పులు జరగాలన్నా మళ్ళీ పార్లమెంటు ఆమోదం ద్వారానే జరగాలని అన్నారు. పోలవరం ముంపు గ్రామాల విషయంలోనూ కొత్తగా గ్రామాలను లేదా మండలాలను ఏపీలో చేర్చాలంటే ఆర్టికల్-3 ద్వారా చట్టంలో మార్పు జరగాలే తప్ప ఆర్డినెన్స్ ద్వారా కాదన్నారు. ఒకవేళ క్యాబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్‌ను ఆమోదించినప్పటికీ ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

శాసనసభల్లో చర్చించాలి...
ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఏర్పడ్డాయని, అపాయింటెడ్ డే ప్రకటన కూడా వచ్చిందని, మరో నాలుగైదు రోజుల్లో ఈ రెండు రాష్ర్టాలూ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనున్నాయని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు ఏ రాష్ట్ర సరిహద్దులను మార్చాలన్నా, కొత్తగా గ్రామాలను కలపడం తీసివేయడం చేయాలన్నా ముందుగా ఇరు రాష్ర్టాల శాసనసభలను సమావేశపర్చాలని అన్నారు. రెండు రాష్ర్టాల్లోనూ ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండుచోట్లా కొత్తగా ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇద్దరినీ ప్రధాని సమావేశపర్చి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇదే ప్రజాస్వామిక చర్యగా ఉంటుందని కేసీఆర్ వివరించారు.

న్యాయపోరాటం జరుపుతాం...
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలను ముంపు పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడాన్ని టీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తమ విజ్ఞప్తులు పక్కనబెట్టి ఆర్డినెన్స్ జారీ చేస్తే న్యాయపోరాటం చేయక తప్పదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ విషయమై సంప్రదింపులు జరిపామని, కేసు వేస్తే విచారణ తొలి దశలోనే ఈ ఆర్డినెన్సును న్యాయస్థానం కొట్టేస్తుందని వారు చెప్పారన్నారు. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం కాబట్టి న్యాయస్థానం సైతం మళ్ళీ రాజ్యాంగ ప్రక్రియ మొత్తం పాటించాలంటూ స్పష్టం చేయాల్సి వస్తుందని అన్నారు. పునర్విభజన బిల్లు రూపకల్పన సమయంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో (నెం. 111)లో 139 గ్రామ పంచాయితీలు పోలవరం ముంపు ప్రాంతాలుగా ఉంటాయని గుర్తించిందని, ఈ పంచాయితీల పరిధిలో ఉన్న చిన్నచిన్న గూడేలను కూడా కలుపుకుంటే మొత్తం సంఖ్య 200 వరకు ఉందని ఆయన చెప్పారు.

పోలవరం డిజైన్‌నే వ్యతిరేకిస్తున్నాం...
తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, దాని డిజైన్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. డిజైన్‌ను మార్చడం ద్వారా మాత్రమే అక్కడ దీర్ఘకాలం నుంచి నివసిస్తున్న గిరిజనులను కాపాడవచ్చునని అన్నారు. శబరి నదికి ఇవతలి వైపు నుంచి వచ్చే గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నందున వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, సాగునీటిని రైతులు వాడుకుంటే టీఆర్‌ఎస్ ఎప్పుడూ అభ్యంతరం చెప్పదని అన్నారు. డిజైన్‌ను మార్చాలని తాము సుప్రీంకోర్టులో కేసు వేశామని అది ఇంకా పెండింగ్‌లోనే ఉన్నదని గుర్తు చేశారు. పోలవరం డిజైన్‌ను ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇంజనీర్లు, టెక్నోక్రాట్లే తప్పుపట్టారని, దేశంలో మొత్తం 11 భూకంప ప్రభావితమైన ప్రాంతాలను గుర్తిస్తే అందులో పోలవరంప్రాంతం రెండవ ప్రమాదకర జోన్‌లో ఉన్నట్లుగా తేలిందని గుర్తు చేశారు. ఒడిషా, చత్తీస్‌ఘడ్ రాష్ర్టాలు కూడా న్యాయపోరాటం చేస్తున్నాయని చెప్పారు. క్యాబినెట్‌లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించేవారు ఒక్కరూలేరు కాబట్టి ఎవ్వరూ వ్యతిరేకించలేదనే ఆలోచనతో ఆర్డినెన్స్ ఆమోదానికి పాల్పడితే ఇంతకు మించిన అప్రజాస్వామిక చర్య మరొకటి ఉండదని అన్నారు.

వార్‌రూంకు చంద్రబాబు వస్తానంటే రావొచ్చు
టీఆర్‌ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన వార్ రూమ్‌పై తెలుగుదేశం అధినేత చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థం లేదని కేసీఆర్ అన్నారు. వార్‌రూంకు చంద్రబాబును అనుమతిస్తారా? అని మీడియా ప్రశ్నించినపుడు వెల్‌కం..మోస్ట్ వెల్‌కం అన్నారు. చంద్రబాబు వస్తానంటే రావొచ్చు అన్నారు.వార్‌రూం అంటే అదో సమాచారాన్ని క్రోడీకరించే చోటు. అక్కడేముంటాయి..కంప్యూటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు అంతే అని కేసీఆర్ అన్నారు. బాబుకు సరైన ఆలోచన లేదు కాబట్టే అనాలోచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఉద్యోగుల స్థానికత, విభజనకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన గణాంకాలతో సహా సమాచారాన్ని మొత్తం సేకరించడానికి.. విశ్లేషించడానికి ఉద్దేశించింది కాబట్టి తాము వార్ రూమ్ అని పేరుపెడితే అది యుద్ధం ప్రకటించడం కోసమంటూ చంద్రబాబు అర్థం చేసుకుంటే చేయగలిగిందేమీ లేదని అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిథ్యమే లేకపోవడంపై స్పందించేందుకు కేసీఆర్ నిరాకరించారు. మీరీ ప్రశ్నను వేయాల్సింది నరేంద్ర మోడీకి...కేసీఆర్‌కు కాదు.. అని ఆయన జవాబిచ్చారు. మేము ఏ పార్టీతోనూ, కూటమితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగా వెళ్ళాలనుకున్నాం... వెళ్ళాం... ఒంటరిగానే వెళ్తాం అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

(నమస్తే   దినపత్రిక సౌజన్యంతో)



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి