గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 17, 2014

కేసీఆర్ విజయ రహస్యం....?



కేసీఆర్‍........,..ది లీడర్...
-14 ఏళ్లుగా పోరాడిన ఒక్కడు...
-ఒక్కడే కదిలి...మొత్తం సమాజాన్ని కదిలించి.. 
-ఆటుపోట్ల నడుమ ఆరితేరిన వ్యూహకర్త...
-ఆశయ సాధనే లక్ష్యం.. 
-అలుపెరుగని పోరాటం
-ఫలితమిచ్చిన పద్నాలుగేండ్ల సమరం 
-టీఆర్‌ఎస్‌వైపు ప్రజలను తిప్పిన మ్యానిఫెస్టో హామీలను 
-బలంగా తీసుకెళ్లిన పార్టీ యంత్రాంగం

తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, మరెంతో కఠినమైన లక్ష్యాలను అవలీలగా సాధిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాగించిన ఈ 14 ఏళ్ల ప్రయాణం ఎంతో అపూర్వమైనది. ఒంటరిగా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పదవులను తృణప్రాయంగా వదిలేసిన బక్కపలచని ఈ యోధుడు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను కూడా భుజస్కంధాలపైకి ఎత్తుకుని ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. 2001లో పార్టీ పెట్టిననాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచి ఒక్కడై వచ్చి అసెంబ్లీని కుదిపేశారు. ఆనాడు ఒక్కడిగా అసెంబ్లీ గడప ఎక్కిన ఆయన ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజం అండదండలతో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిశగా ముందుకు సాగుతున్నారు. 2001లో పార్టీ పెట్టిన తరువాత వచ్చిన స్థానిక ఎన్నికల్లో అపూర్వ మెజార్టీని సాధించుకున్నారు. తరువాత కొన్ని శక్తులు ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్‌కు అండగా నిలుస్తూ వచ్చాయి. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 45 అసెంబ్లీ, 6 పార్లమెంట్ సీట్లలో పోటీచేయగా, 26 ఎమ్మెల్యే, ఐదు ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, కొంత మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తనవైపు తిప్పుకోవడంతో మళ్లీ ఉద్యమాన్ని బతికించేందుకు 2006లో ఉప ఎన్నికలకు వెళ్లి పోటీచేసిన 16 స్థానాల్లో 7 స్థానాలను, నాలుగు పార్లమెంట్ స్థానాల్లో రెండింటిని దక్కించుకున్నారు. ఆ తరువాత కేసీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీతో మహాకూటమితో పొత్తు పెట్టుకుని 45 అసెంబ్లీ 9 పార్లమెంట్ సీట్లను తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలనే దక్కించుకుంది.

అనంతర కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ ప్రజామోదం కోసం నిరంతర కృషి సలిపారు. 11రోజులపాటు కొనసాగించిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. కేంద్రం దిగివచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. తెల్లవారేసరికి ఆంధ్ర నాయకులు అసెంబ్లీ వేదికగా రాజీనామాలు చేయడంతో కేంద్రం డిసెంబర్ 23వ తేదీన ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంది. దీంతో టీఆర్‌ఎస్ చొరవతో అన్ని పార్టీలను కలుపుతూ, ప్రజాసంఘాలతో ఒక వేదిక రూపుదిద్దుకుంది. ఆ వేదికే తెలంగాణ పొలిటికల్ జేఏసీ. ఈ వేదికతోనే మొత్తం తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తూ కేసీఆర్ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.

తదనంతర పరిస్థితుల్లో తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికైనా సిద్ధపడ్డారు. కానీ ఢిల్లీ హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన ఢిల్లీ బాట వీడి 2014 ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకుంటామని స్పష్టం చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించి, ఆంధ్రలో పార్టీ కనుమరుగవుతున్నదని గ్రహించి తెలంగాణలో బతికించుకోవడమే లక్ష్యంగా తెలంగాణకు సానుకూలంగా స్పందించింది. అనంతరం కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ఏ పార్టీతో పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతుందని ప్రకటించారు. ఇంటి పార్టీకి పట్టం కట్టండి.. ఇంకా పంచాయితీ అయిపోలేదంటూ బరిలో నిలిచారు. 

ఎన్నికల నిండా ఒక్కడే...
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కేసీఆర్ కార్యరంగంలోకి దూకేశారు. పొత్తుల కమిటీ, మ్యానిఫెస్టో కమిటీలు వేసుకున్న ఆయన అంతకుముందే రూపొందించుకున్న ఎన్నికల కమిటీతో వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. తొలుత పొత్తుల అంశం కొంతకాలం చర్చనీయమైనా ఆ తర్వాత ఎలాంటి పొత్తులు పెట్టుకోవద్దని నిర్ణయించుకుని మొదటి విడతలో 69 మంది అభ్యర్థులను ప్రకటించి పోరుకు సైసై అన్నారు. అనంతరం విడతలవారీగా అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికలకు సరిగ్గా 15 రోజుల ముందు నుంచి ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. దేశంలో మరే నేత ఒకే ప్రాంతంలో వందకు పైగా సభలు నిర్వహించిన చరిత్ర ఎన్నడూ లేదు. కానీ కేసీఆర్ మాత్రం కేవలం 11 రోజుల వ్యవధిలో 107 బహిరంగసభలు నిర్వహించారు. ఇంటి పార్టీ అవసరాన్ని, భవిష్యత్తులో ఉన్న సమస్యలను, వాటికి పరిష్కారాలను చూపిస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఆకట్టుకున్నారు. కాలికి బలపం కట్టుకుని తిరిగినట్లుగా కేసీఆర్ చేసిన ప్రచారం ఇతర రాజకీయ పార్టీల నేతలను అవాక్కయ్యేలా చేసింది.

ఒక బక్కపలుచని వ్యక్తి ఒక్కో రోజులో పదికిపైగా బహిరంగసభల్లో పాల్గొనడం, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా సభల్లో ప్రసంగించడం చరిత్రాత్మకమే. ఈ ప్రచారం పార్టీకి తీవ్రస్థాయిలో ఊపు తెచ్చిందని చెప్పక తప్పుదు.

మలుపుతిప్పిన మ్యానిఫెస్టో...
టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో అత్యంత కీలక ప్రభావం చూపింది. కేసీఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో రూపొందిన మ్యానిఫెస్టోలో పలు వర్గాలను ఆకట్టుకునే పలు అంశాలను చేర్చారు. లక్షలోపు ఉన్న వ్యవసాయ ఋణాల మాఫీ, ఇండ్లు లేనివారికి మూడు లక్షలతో అన్ని సదుపాయాలతో నిర్మించి ఇస్తామనడం, ఆటోలపై రవాణాపన్నును మినహాయించడం, డ్వాక్రా రుణాల పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి హామీలు టీఆర్‌ఎస్ వైపు ప్రజలు ఇనుమడించిన ఉత్సాహంతో తిరిగి చూడటానికి కారణమయ్యాయి.

ఇంటి పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రత్యక్ష్యంగా కలిగే లాభాలేమిటో, తెలంగాణ జీవితాలను ఎలా మార్చవచ్చో కేసీఆర్ చెప్పిన విధానం ప్రజల్లోకి వేగంగా వెళ్లింది. అదే సమయంలో ఇతర పార్టీల్లోని వారిని కూడా కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తేవడం, తెలంగాణ పునర్నిర్మాణం చేయాలంటే గెలుపుగుర్రాలకు టికెట్లు ఇవ్వకతప్పదంటూ కేసీఆర్ పక్కా వ్యూహంతో ముందుకు కదిలారు.

ఎన్డీయేకు దూరంగా.... మైనార్టీలకు దగ్గరగా...
తెలంగాణలో 12శాతం ఉన్న మైనారిటీలను ఆకట్టుకునేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అమలుపరుస్తామని ప్రచారం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చారు. ఎన్నికలకు ముందే ఎన్డీయేకు ట్రెండ్ ఉన్నప్పటికీ కేసీఆర్‍.......బీజేపీ, మోడీ వైపు ఏమాత్రం మొగ్గుచూపలేదు. థర్డ్‌ఫ్రంట్‌కుగానీ, యూపీఏకుగానీ మద్దతిస్తామని ప్రకటించారు. సెక్యులర్ ముద్ర వేసుకున్నారు. ఎన్నికల క్రమంలో ఈ విధంగా ఆయన ప్రదర్శించిన సందర్భోచిత నాయకత్వ పటిమే ఆయన భారీ విజయానికి దారితీసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి