గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 26, 2014

రాబోయే కాలంలో...టీ ఉద్యోగులకు...ఉమ్మడి హైకోర్టుతో చిక్కులే...?!


- సదుపాయాలపై హైకోర్టు ఉద్యోగుల్లో సందిగ్ధత
-పే స్కేల్, ఇంక్రిమెంట్లు, డీఏలపై నిర్ణయమెవరిది?
- ఏ రాష్ట్ర ఉత్తర్వులు అమలవుతాయో తెలియని అయోమయం
- ఆందోళన వ్యక్తం చేస్తున్న హైకోర్టు టీ ఉద్యోగులు

కొత్త రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు కొనసాగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హైకోర్టు ఉద్యోగులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఉద్యోగుల జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, డీఏలపై ఏ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అమలవుతాయనే విషయంలో అయోమయం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త హైకోర్టు ఏర్పాటు చేసేవరకు హైకోర్టు ఎట్ హైదరాబాద్‌గా మారనున్న ప్రస్తుత హైకోర్టు పరిధిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కేసులు విచారణ జరుగుతుందని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. కేసుల విచారణ వరకు ఈ సర్దుబాటు సమంజసంగానే ఉన్నా.. హైకోర్టు ఉద్యోగుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హైకోర్టు ఉద్యోగులను సచివాలయ ఉద్యోగుల క్యాడర్‌గా భావిస్తారు. అపాయింటెడ్ డే తరువాత ఉమ్మడి హైకోర్టులో సిబ్బంది జీతభత్యాల ఖర్చును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు 42:58 నిష్పత్తిలో భరిస్తాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. జీతాల చెల్లింపు విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ, ఇంక్రిమెంట్లు, డీఏ, ఇతర సదుపాయాల విషయంలో అయోమయం నెలకొంది.

ఎన్డీఏ ప్రభుత్వానిదే నిర్ణయం..
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేసే విషయమై ఎలాంటి గడువు విధించలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారం ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే వరకు హైకోర్టు ఎట్ హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని మాత్రమే పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కేంద్రం సూచనల మేరకు ప్ర త్యేక హైకోర్టు ఏర్పాటుపై సుప్రీంకోర్టు చ ర్యలు తీసుకుంటుంది. గతంలో యూపీ ఏ-2 ప్రభుత్వం త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానుంది. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వెల్లడి కావాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అయినా ప్రత్యేక హైకోర్టు ఎప్పటిలోగా ఏర్పాటవుతుందో నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి లేదు.

నిర్ణయమెవరిది?
కొత్త హైకోర్టు ఏర్పాటు అవకాశాలు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో హైకోర్టు సిబ్బందిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జీతాల విషయంలో ఎలాంటి సమస్య లేనప్పటికీ కొత్త ప్రభుత్వాలు ఇచ్చే డీఏ, ఇంక్రిమెంట్ల విషయంలో స్పష్టత లేదని ఇరు ప్రాంతాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి హైకోర్టు ఉద్యోగులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన పీఆర్సీ అమలు చేస్తారో తెలియడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సులకు రెండు రాష్ట్రాలు వేర్వేరుగా ఆమోదం తెలిపే అవకాశం ఉందని, అప్పడు తమకు ఏ రాష్ట్రం ఆమోదించిన పీఆర్సీని అమలు చేస్తారో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి హైకోర్టులో సమస్యలపై ఇప్పటికే తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై వారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు, తెలంగాణ ఉద్యోగసంఘాల ప్రతినిధులకు వినతిపత్రాలను సమర్పించారు. అదేవిధంగా ఉద్యోగులకు రెండు రాష్ట్రాలు వేర్వేరుగా డీఏ శాతాన్ని చెల్లిస్తే తమ పరిస్థితి ఏమిటని తెలంగాణ హైకోర్టు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీ తమ విషయంలో అమలయ్యే అవకాశంపై స్పష్టత లేదని టీ ఉద్యోగులు వాపోతున్నారు.

15శాతం ఉద్యోగుల కోసం 42 శాతం ఖర్చు భారం
ప్రస్తుత హైకోర్టులో క్లాస్ -4 మినహా మిగతా ఉద్యోగుల్లో తెలంగాణవారు కేవలం 15 శాతం మాత్రమే. కానీ ఉద్యోగుల జీతాల ఖర్చు విషయంలో తెలంగాణ ప్రభుత్వం 42శాతం చెల్లించాల్సిన పరిస్థితి ఉందని టీ ఉద్యోగులు పేర్కొన్నారు.

నిధులు, నీళ్లు, నియామకాల కోసమే పోరాడి ప్రత్యేకరాష్ట్రాన్ని తెచ్చుకున్న ప్రస్తుత సమయంలో కూడా ఆంధ్ర ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కల్పించే సదుపాయాలు తమకు అందకుండాపోయే ప్రమాదం ఉందని హైకోర్టు టీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ప్రత్యేక హైకోర్టును వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేలా ఒత్తిడి తీసుకరావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి