స్వాగత వృత్తము:
కామితానఁ దెలగాణను వేగన్
క్షేమమెంచి, యిట గెల్చియు రాష్ట్ర
మ్మోమఁగా మనసు పొంగినవాఁడా!
సౌమనస్యవర! స్వాగతమయ్యా!!
రథోద్ధత వృత్తము:
కల్వకుంట్ల తెలగాణ యోధుఁడా!
విల్వఁ బెంచితివి వేగ జేతవై!
నల్వవోలె నిను నవ్యగీతులన్
గొల్వఁ బూనితిమి, కొమ్ము కేసియార్!
తోటక వృత్తము:
ఘన మోదము నిచ్చితి! కాంక్షితమౌ
*త్రినగాంధ్రను గెల్చితి! తేజము హె
చ్చెను మోమున నిప్పుడు శీఘ్రగతిన్!
గొను మో ఘన వీరుఁడ, కూర్మినతుల్!!
ప్రియంవదా వృత్తము:
అరువదేండ్ల కల నందఁ జేయు నిన్
విరుల వర్షములఁ బ్రేమతోడుతన్
మురియఁ జల్లుదుము! ముఖ్యమంత్రివై
వరమొసంగఁగను వందనమ్మిదే!
వనమయూర వృత్తము:
ఎంత ఘన వీరుఁడవు, హేమనగధీరా!
చింత వలదంచు మముఁ జీరి, తెలగాణన్
బంతమున గెల్చితివి! భారము తొలంగెన్!
సంతసము హెచ్చెనయ! స్వాగతముఁ గొమ్మా!
మాలినీ వృత్తము:
విమత కుటిల ధ్వస్తా! ప్రీతి పౌర ప్రశస్తా!
నమిత జన విశేషా! నవ్య నేతృ ప్రభూషా!
శ్రమ దమన విశిష్టా! శాంతి కాంతి ప్రహృష్టా!
విమల సుగుణమూర్తీ! విశ్వవిఖ్యాతకీర్తీ!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
*త్రినగాంధ్ర పద రూపసాధన:
(త్రినగాంధ్రము = త్రిలింగాంధ్రము = త్రిలిఙ్గాన్ధ్రము > త్రిలింగాన్ధ్రము > తిలింగాన్దము > తెలంగాన్దము > తెలంగాణ్డము > తెలంగాణ్ణము > తెలంగాణము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి