-కాబోయే ముఖ్యమంత్రులకు అధికారుల నివేదన
-ఇవి మీవి.. అవి వారివి అంటూ లెక్కలు అప్పజెప్పిన అధికారులు
-పొత్తుల లెక్కలు చట్టంలో పేర్కొన్నట్లుగానే కొనసాగింపు
-సీమాంధ్రులకూ సేవలందించనున్న మన భవనాలు
-కొత్తవి సీమాంధ్రకు.. పాతవి తెలంగాణకు
-ఇన్నాళ్లూ మనం చూస్తున్న అసెంబ్లీ గోపురం ఇక మనది కాదు
-సచివాలయందీ అదే తీరు.. ముఖం వాళ్లకు.. తోక మనకు
రాష్ట్ర విభజనలో కీలకమైన తుది నివేదికను నమస్తే తెలంగాణ సంపాదించింది. ఆవిర్భావ తేదీ, కొత్త ప్రభుత్వాల కొలువుదీరే సమయం దగ్గర పడుతుండగా విభజన అధికారులు పూర్తి నివేదికలను సిద్ధం చేశారు. ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా నివేదికలను రూపొందించి ఆయా రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రుల ముందుంచిన అధికారులు...వాటిపై సమీక్షలు చేశారు. వీటిపై ఆయా రాష్ట్రాలకు కాబోయే సీఎంల అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి వాటిని కేంద్రానికి పంపేందుకు సమాయత్తమవుతున్నారు.
ఈ నివేదికల రూపకల్పనకు 22 కమిటీలు, అపెక్స్ కమిటీ తీవ్రస్థాయిలో శ్రమించాయి. తుది నివేదికలను ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్పీ టక్కర్ సారథ్యంలోని అపెక్స్ కమిటీకి అందించిన 21 కమిటీలు పనిని పూర్తిచేశాయి. 82 పేజీలతో కూడిన ఈ నివేదిక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని షెడ్యూళ్లపై సమగ్రంగా చర్చించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీకే మహంతి వీటిని గవర్నర్‌కు నివేదించి తుది ఆమోదం పొందారు. తాజాగా వీటిని రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు నివేదించారు.
భవనాల పంపిణీ అస్తవ్యస్తం:
నూతన రాష్ట్రం వచ్చిన సందర్భంలో ఇన్నాళ్లూ తన చారిత్రక ఆనవాళ్లతో అత్యున్నత స్థాయిలో నిజాం కట్టడంగా వెలుగొందిన అసెంబ్లీ భవనం సీమాంధ్ర అసెంబ్లీగా మారనుంది. ఆ భవనం ముఖ ద్వారానికి ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహంతోపాటు ఇటీవలే ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహం కూడా సీమాంధ్ర ఖాతాకే వెళ్లనున్నాయి. మన హైదరాబాద్‌లో మనమే కిరాయికి ఉన్నవారిలా భవనాల పంపిణీ చేశారని నివేదికద్వారా అర్థం అవుతున్నది. దీనిద్వారా రాష్ట్రమేర్పడినా ఆనందం కనబడకుండా పోయేలా ఉందని తెలంగాణ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వెనుక భాగంలో ఉన్న కొత్త భవనాన్ని తెలంగాణకు కేటాయించారు. తద్వారా అసెంబ్లీ భవనాన్ని కనబడకుండా, తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. మంత్రులు, సీఎం...చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. సచివాలయానికి కూడా అదేతీరులో వాస్తుకు విరుద్ధంగా ఉత్తరం వైపునుంచి కొత్త గేటుద్వారా రావాల్సి వస్తుంది.
నివేదికలోని అనేక అంశాలు ఇలా ఉన్నాయి:
12 అంశాలుగా పేర్కొన్న నివేదికలో మొట్టమొదటి అంశంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రీ ఆర్గనైజేషన్-ఓవర్‌వ్యూ అండ్ కీ ఇష్యూను తీసుకున్నారు.
ఇక వరుసగా ప్రాధాన్యతాక్రమంలో ఉమ్మడి రాజధానిలోని భవనాల పంపిణీ, షెడ్యూల్-9లోని కంపెనీలు-కార్పొరేషన్లు, షెడ్యూల్-10లోని శిక్షణా సంస్థలు, షెడ్యూల్-13లోని విద్య, వైద్య మౌలిక వసతుల కల్పన, కాంట్రాక్టుల పంపిణీ, పోలీస్, నీటిపారుదల, విద్యుత్, ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఉద్యోగుల పంపిణీ, ట్రాన్సిషన్ ప్రణాళిక వంటి అంశాలను పేర్కొంది.
12 అంశాలను ఏప్రిల్ 31నాటికే పూర్తిచేసినట్లు అధికారులు నివేదికలో వెల్లడించారు.
మొత్తం ఫైళ్లు 44,72,132 కాగా, వీటి పేజీల సంఖ్య 16,33,28,282 ఉన్నాయని, అయితే ఇందులో 4,74,79,965ను స్కాన్ చేసినట్లు చెప్పారు.
స్థిర, చర ఆస్తుల సంఖ్య:
చరాస్తులు 4,73,106, వాహనాలు 43,067(ఇందులో 11శాతం 15 ఏళ్లకు పైబడినవి)
స్థిరాస్తులు 68,182 ఉన్నాయని అధికారులు లెక్కలు తేల్చారు.
ఇరు రాష్ట్రాలకు భవనాల పంపిణీ:
సచివాలయం:
తెలంగాణకు ఏ,బీ,సీ,డీ బ్లాకులు కేటాయించారు. వీటి విస్తీర్ణం 35,818 చదరపు మీటర్లుగా, మొత్తం విస్తీర్ణంలో 42 శాతంగా తేల్చారు.
ఏపీకి నార్త్ హెచ్,సౌత్ హెచ్,జే,కే,ఎల్ బ్లాకులు, వీటి విస్తీర్ణం 49,342 చదరపు మీటర్లుగా, విస్తీర్ణంలో 58 శాతంగా పంచారు.
శాసన సభ:
మొత్తం 18 ఎకరాల్లో ఉన్న అసెంబ్లీని పంపిణీ చేశారు.
అసెంబ్లీ నూతన భవనాన్ని తెలంగాణకు, పాత భవనాన్ని ఏపీకి కేటాయించారు.
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్లు:
ఏపీకి 78,583 చదరపు అడుగుల్లోని 78 క్వార్టర్లను కేటాయించారు. విస్తీర్ణంలో 54 శాతంగా పంపిణీ చేశారు. ఇందులోని జనరల్(3 అంతస్తుల) భవనాలు 11నంబర్‌నుంచి 19వరకు 9 బ్లాకులను 52,393 చదరపు ఫీట్ల విస్తీర్ణాన్ని కేటాయించగా, డీలక్స్ విభాగంలోని 20నుంచి 23 నంబర్ వరకు ఉన్న 4 బ్లాకులను 28,190 చదరపు ఫీట్లను కేటాయించారు.
తెలంగాణకు 66,869 చదరపు అడుగుల్లోని 67 క్వార్టర్లను కేటాయించారు. వీటి సంఖ్య విస్తీర్ణంలో 46 శాతంగా గుర్తించారు. ఇందులో జనరల్ విభాగంలోని 1నుంచి 10 నంబర్ వరకు బ్లాకులను 58,215 చదరపు ఫీట్ల విస్తీర్ణాన్ని కేటాయించారు. డీలక్స్ విభాగంలోని 24వ బ్లాక్ ఒక్కటే కేటాయించడం విశేషం. ఇక డాక్టర్స్ క్వార్టర్లుగా ఉన్న 2 అంతస్తుల భవనాల్లో ఒక్కటి మాత్ర మే తెలంగాణకు కేటాయించారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లు:
హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లకు చెందిన మొత్తం 112 క్వార్టర్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు 56, 56గా పంపిణీ చేశారు. ఇందులో మొత్తం విస్తీర్ణం 2.81 ఎకరాలుగా గుర్తించి సరిసమానంగా పంచారు.
మంత్రుల నివాస సముదాయాలు:
బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్-12లో 74 ఎకరాల్లో విస్తరించి ఉన్న మంత్రుల అధికార నివాస గహ సముదాయాన్ని తెలంగాణకు 42 శాతంగా, ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతంగా పంపిణీ చేశారు.
షెడ్యూల్-9లోని తక్షణం విభజించాల్సిన 20 సంస్థలను గుర్తించారు. అవి..
-సివిల్ సైప్లెస్.. ఆంధ్రప్రదేవ్ స్టేట్ సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ లి.
-రెవెన్యూ (ఎక్సైజ్).. ఆంధ్రప్రదేశ్ బీవరేజెస్ కార్పొరేషన్ లి.
-టీఆర్‌బీ.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టీఆర్‌బీ.. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివద్ధి కార్పొరేషన్
-హౌసింగ్.. ఆంధ్రప్రదేశ్ ప్టేట్ హౌసింగ్ కార్పొరేషన్
-ఎనర్జీ.. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
-ఎనర్జీ.. ఆంధ్రప్రదేశ్ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ
-ఈఎఫ్‌ఎస్‌అండ్‌టీ.. ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
-అగ్రి అండ్ కో ఆపరేటివ్.. ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ లి
-హెచ్‌ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ.. ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
-హోం.. ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లి
-ఇరిగేషన్.. ఏపీ వాటర్ రీసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
-ఎంఏయూడీ.. ఏపీ అర్భన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
-స్కూల్ ఎడ్యుకేషన్.. ఏపీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
-వైఏటీ అండ్ సీ.. ఏపీ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లి.
13వ షెడ్యూల్‌లోని పథకాలపై..
-తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర సహకారంతో ఏర్పాటు చేయాలని నిర్ధేశించిన పలు పథకాలపై ఎటువంటి ప్రగతి కన్పించలేదు. ఆవిర్భావ తేదీనుంచి 6నెలలలోపు రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టాలని, రైల్ కనెక్టివిటీని విస్తరించే చర్యలు తీసుకోవాలని 13వ షెడ్యూల్‌లో నిర్దేశించారు. వీటిపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని అధికారులు నివేదికలో చెప్పారు. 2014 ఏప్రిల్ 1న రైల్వే శాఖతో జరిగిన చర్చల్లో చైర్మన్ రైల్వే బోర్డుకు లేఖ అందించామని, ఇంకా రైల్వే బోర్డునుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు.
-ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆవిర్బావ తేదీ అనంతరం 6నెలలలోపు నిర్మాణ పనులను ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలన్న అంశంలో సెయిల్ అధికారులు నివేదిక తయారు చేయాల్సి ఉందని చెప్పారు.
-తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానం పూర్తిచేసి జాతీయ రహదారులతో కనెక్టివిటీని పెంచాలన్న నిర్ణయంపై అడుగు ముందుకు పడలేదు. ఈ అంశంపై 2 వేల కిలోమీటర్ల రాష్ట్ర, జాతీయ రహదారులను 4 లైన్లుగా అభివృద్ధి చేయాల్సి ఉందని, 1400 కిలోమీటర్ల రెండు లైన్ల జాతీయ రహదారులను వెనుకబడిన ప్రాంతాలకు విస్తరించాల్సి ఉందని కేంద్ర ఉపరితల, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశామని నివేదికలో చెప్పారు.
-తెలంగాణలో ఎన్టీపీసీ స్థాపించాల్సిన 4వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన కోల్ లింకేజీలపై రాష్ట్ర ప్రభుత్వం భూమి గుర్తించాల్సి ఉందని, అవసరమైన నీటిని అందించాల్సి ఉందని నివేదించారు.
-ట్రైబల్, హార్టీకల్చర్ యూనివర్సిటీల ఏర్పాటుపై 12, 13వ పంచవర్ష ప్రణాళికల్లో చేపట్టాల్సిన వీటిపై ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నామని, వీటిని ఏర్పాటు చేయాల్సిన స్థల పరిశీలన ఇంకా పూర్తి కాలేదని నివేదించారు.
-ఇరు రాష్ర్టాలకు ర్యాపిడ్ రైల్, రోడ్డు కనెక్టివిటీని విస్తరించి తెలంగాణలోని ఇతర ముఖ్య పట్టణాలకు ఏపీ కొత్త రాజధానితో అనుసందానం చేయాల్సి ఉందన్న అంశంలో ఇంకా కొత్త రాజధానిని గుర్తించనందున దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువరించలేమని నివేదికలో స్పష్టం చేశారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి